ఫోన్ కొనాలంటే మరింత ఖర్చు చేయాల్సిందే.. 2027లోనూ పెరగనున్న ధరలు!
2027లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల ధరలు మరింత పెరిగే అవకాశముందని Techarc అంచనా వేసింది. మెమరీ చిప్‌ల కొరతతో 2026లో స్మార్ట్‌ఫోన్ ధరలు 16.6 శాతం, ల్యాప్‌టాప్ ధరలు 13.5 శాతం పెరిగాయి. ముఖ్యంగా రూ.12 వేల లోపు ఫోన్ల ధరలు 21.9 శాతం పెరిగాయి. వచ్చే ఏడాది కంపెనీలు తక్కువ ధర మోడళ్లలో ర్యామ్, స్టోరేజ్ తగ్గించే అవకాశముంది.
By: Tupaki Desk | 29 Nov 2026 9:21 PM ISTస్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి మరో షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే పెరిగిన ఫోన్ల ధరలు వచ్చే ఏడాది కూడా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. 2027లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని టెక్ మార్కెట్ పరిశోధనా సంస్థ Techarc అంచనా వేసింది. అయితే 2026లో నమోదైనంత వేగంగా ధరలు పెరగకపోవచ్చని తెలిపింది.
గత ఏడాది కాలంలోనే భారత మార్కెట్‌లో ఫోన్ల ధరలు గణనీయంగా పెరిగాయి. 2025 అక్టోబర్‌తో పోలిస్తే 2026 అక్టోబర్ నాటికి స్మార్ట్‌ఫోన్ల ధరలు సగటున 16.6 శాతం పెరిగాయి. ల్యాప్‌టాప్‌లలో 13.5 శాతం, ట్యాబ్లెట్లలో 13.3 శాతం పెరుగుదల నమోదైంది. స్మార్ట్ టీవీల ధరలు 6.7 శాతం, సెక్యూరిటీ కెమెరాల ధరలు 5.6 శాతం పెరిగాయి.
ఈ ధరల పెరుగుదలకు మెమరీ చిప్‌ల కొరత ప్రధాన కారణం. ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా వేగం పుంజుకోవడంతో మెమరీ చిప్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది. చిప్ తయారీ సంస్థలు ఏఐ రంగానికి అవసరమైన మెమరీపై ఎక్కువ దృష్టి పెట్టడంతో సాధారణ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఉపయోగించే చిప్‌ల సరఫరాపై ఒత్తిడి పెరిగింది.
ఈ ప్రభావం తక్కువ ధర ఫోన్లపై మరింత ఎక్కువగా ఉంది. రూ.12 వేల లోపు స్మార్ట్‌ఫోన్ల ధరలు సగటున 21.9 శాతం పెరిగాయి. మరోవైపు లక్ష రూపాయలకు పైబడిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధరలు 5.7 శాతం తగ్గడం గమనార్హం. తక్కువ ధరలో ఫోన్ కొనాలనుకునేవారికి ఈ మార్పు పెద్ద భారంగా మారుతోంది.
అయితే అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలూ పెరగలేదు. 2026 జనవరి నుంచి అక్టోబర్ మధ్య వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ధరలు 16.3 శాతం తగ్గాయి. రోబో వాక్యూమ్ క్లీనర్ల ధరలు 12.8 శాతం, ఎయిర్ ప్యూరిఫైయర్ల ధరలు 10 శాతం తగ్గాయి.
2027లోనూ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఖరీదయ్యే అవకాశాలున్నాయని Techarc చెబుతోంది. ధరలు మరీ పెరిగితే కొనుగోలుదారులు వెనక్కి తగ్గే ప్రమాదం ఉండటంతో కంపెనీలు తక్కువ ధర మోడళ్లలో ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యాన్ని తగ్గించే అవకాశముంది. అంటే ఫోన్ ధర పెరగడమే కాకుండా, అదే బడ్జెట్‌లో గతంలో వచ్చిన ఫీచర్లు కూడా దక్కకపోవచ్చు.
