Begin typing your search above and press return to search.

శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో కొత్త సేవలు... రంగంలోకి రోబోలు!

By:  Tupaki Desk   |   26 Oct 2023 3:42 AM GMT
శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో కొత్త సేవలు... రంగంలోకి రోబోలు!
X

ఇండియాలోని విమానాశ్రయాల్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వేగంగా మరింత అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక శంషాబాద్‌ విమానాశ్రయ ప్రయాణికులకు రోబోల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్ పోర్టులోకి ఎంటరైనప్పటినుంచి విమానంలో కూర్చొనేంత వరకూ ప్రయాణికులకు అవసరమైన సేవలు ఇకపై రోబోలు అందించనున్నాయి. ఈ మేరకు జీఎంఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది!

అవును... ప్రయాణికులకు అవసరమైన సేవలతో పాటు రిశుభ్రతను మరింత మెరుగుపర్చేందుకు రోబోటిక్‌ పరిజ్ఞానంతో పనిచేసే పరికరాలు, యంత్రాలను శంషాబాద్ విమానాశ్రయంలో అందుబాటులోకి తేనున్నారు. దీనికోసం జీఎంఆర్‌ ఇన్నోవెక్స్‌ పేరుతో 6 నెలల క్రితం ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం రోబో సేవలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు!

దీనికోసం ఇప్పటికే ఐఐటీ-బాంబే, పెప్పర్‌మెంట్‌ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలుస్తుంది! ఇదే సమయంలో రోబోటిక్‌ ఉత్పత్తులను రూపొందించే స్టార్టప్ కంపెనీలకూ ప్రోత్సాహం అందించనున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో అన్నీ అనుకున్నట్లుగా సాగితే వచ్చే ఏడాది తొలి ఆరునెలలోనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రోబోల సేవలు అందుబాటులోకి వస్తాయి!

ఈ సర్వీస్ కోసం ఇప్పటికే రోబోటిక్‌ ప్రయోగశాలను అందుబాటులోకి తీసుకొచ్చిన జీఎంఆర్... పలు స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు రూపొందిస్తున్న ఆవిష్కరణలను ఎంకరేజ్ చేస్తూ, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలనూ కల్పిస్తున్నారని తెలుస్తుంది. ఇలా అనుభవం ఉన్న వ్యక్తులు, స్టార్టప్ కంపెనీల సౌజన్యంతో త్వరలో రోబోల సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

ప్రయాణికుల సేవలతో పాటు మరిముఖ్యంగా పరిసరాల శుభ్రత విషయంలో ఈ రోబోల సేవలు విరివిగా ఉపయోగించుకోవాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని జీరో పర్సంటేజ్ కి తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో రోబోలను విమానాశ్రయంలో అందుబాటులోకి తేవడం ద్వారా ప్రయాణికులకు సమయం ఆదా అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

కాగా... ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే రోబోలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అవి ప్రయాణికులకు విమానాల రాకపోకలు, ఎయిర్‌ లైన్స్‌ సమాచారాన్ని అందిస్తున్నాయి.