యాపిల్ ఐఫోన్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్!
ఈ సందర్భంగా ఐఫోన్ 15 విడుదల ఆలస్యం
By: Tupaki Desk | 22 July 2023 5:03 AM GMTఒకసారి ఐఫోన్ వాడటం మొదలుపెట్టారంటే... మరో ఫోన్ వైపు చూడరని అంటుంటారు. ఇదే క్రమంలో ప్రతీ ఏడాదీ ఆ ఫోన్ కొత్త మోడల్ కి అప్ డేట్ అవ్వకపోతే సంతృప్తిగా ఉండరని చెబుతుంటారు. మరికొంతమందైతే ఐఫోన్ అప్ డేట్ కోసం సమయం దగ్గరపడేకొద్ది తీవ్ర ఆతృతతో ఉంటారని అంటుంటారు. ఈ సమయంలో అలాంటి వారికి బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో యాపిల్ ఐఫోన్ సిరీస్ లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐఫోన్ 15 సిరీస్ విడుదలలో జాప్యం ఏర్పడనుందని తెలుస్తుంది.
అవును... ముందే అనుకున్న విడుదల షెడ్యూల్ కంటే మరికొన్ని వారాలు ఆలస్యంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ లు విడుదల అయ్యే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే దీనికి కారణం ఏమిటనే విషయంపై రకరకాల కారణాలు తెరపైకి వచ్చాయి.
ఈ సందర్భంగా ఐఫోన్ 15 విడుదల ఆలస్యం ఎందుకు జరుగుతుందో స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.. అయితే ఫోన్ క్యూ4లో అంటే అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఎప్పుడైనా యూజర్లకు పరిచయమయ్యే అవకాశం ఉంది అని బ్యాంక్ ఆఫ్ అమెరికా అనలిస్ట్ వంశీ మోహన్ చెబుతున్నారు!
ఇదే సమయంలో ఈ ఆలస్యానికి విభిన్న కారణాలను తెలుపుతూ... మరికొన్ని నివేధికలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... స్క్రీన్ తయారీ సమస్యల కారణంగా ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ సెప్టెంబర్ లాంచ్ ఆలస్యం అవుతుందని అంటున్నారు.
మరోపక్క ప్రో మోడల్ మెటల్ షెల్ కు స్క్రీన్ జతచేసేటప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయని.. దీంతో ఎల్జీ డిస్ ప్లే తయారీ ప్రక్రియలో సమస్యలను ఎదుర్కొంటోందని అందుకే ఆలస్యం కావొచ్చు అని మరొక నివేధిక తెలిపిందని అంటున్నారు.
గతంలో యాపిల్ వాచ్ 7 డిస్ ప్లే అంశంలోనూ ఇదే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. యాపిల్ వాచ్ 7ను మార్కెట్ లో విడుదల చేసిన నెల రోజుల తర్వాత విక్రయాలు జరిగాయి. అయితే ఈసారి ఐఫోన్ 15 విడుదలలో జాప్యం యాపిల్ సంస్థ యొక్క సెప్టెంబర్ త్రైమాసికంపై కూడా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.
కాగా, యాపిల్ సాధారణంగా తన కొత్త ఐఫోన్ జెన్ ని సెప్టెంబర్ లో లాంచ్ చేయడం.. అదే నెలలో కొన్ని రోజుల తర్వాత వినియోగదారులకు అందుబాటులో ఉంచడం తెలిసిందే. కానీ, కోవిడ్-19 కారణంగా ఐఫోన్ 12 సిరీస్ లాంచ్ 2020లో సాధారణం కంటే ఆలస్యం అయింది. ఈ సంవత్సరం, రాబోయే యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ కూడా ఇదే విధమైన ఆలస్యాన్ని ఎదుర్కొంటుందని తెలుస్తోంది.