Begin typing your search above and press return to search.

వరల్డ్‌ ఫుడ్‌ డే: రోజూ ఎన్ని టన్నుల ఆహారం వృథా అవుతుందో తెలుసా?

కాగా ప్రపంచ ఆహార దినోత్సవంగా అక్టోబర్‌ 16న ప్రకటించడం వెనుక ఆసక్తికర సంగతులు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 Oct 2023 9:54 AM GMT
వరల్డ్‌ ఫుడ్‌ డే: రోజూ ఎన్ని టన్నుల ఆహారం వృథా అవుతుందో తెలుసా?
X

అక్టోబర్‌ 16.. ప్రపంచ ఆహార దినోత్సవం. ఇప్పటికీ పోషకాహారం సంగతి దేవుడెరుగు.. బుక్కెడు బువ్వ కూడా దక్కని ప్రజలు ప్రపంచంలో వందల కోట్లలో ఉన్నారు. ఇప్పటికీ కొన్ని దేశాల ప్రజలకు తాగునీరు, పౌష్టికాహారం అందని ద్రాక్షగానే ఉండిపోయాయి. మరోవైపు కొన్ని దేశాలు నిత్యం టన్నుల కొద్దీ ఆహారాన్ని పారేస్తున్నారు. ఇలా వృథా అవుతున్న ఆహారాన్ని లేనివారికి అందిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ నేపథ్యంలో సరైన ఆహారాన్ని పొందడం మానవుల ప్రాథమిక హక్కుగా మారింది.

కాగా ప్రపంచ ఆహార దినోత్సవంగా అక్టోబర్‌ 16న ప్రకటించడం వెనుక ఆసక్తికర సంగతులు వినిపిస్తున్నాయి. 1979లో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) సమావేశంలో ప్రపంచ ఆహార దినోత్స ప్రాధాన్యతను ప్రపంచ దేశాలు గుర్తించాయి. దీంతో 150కి పైగా దేశాలు అక్టోబర్‌ 16న ప్రపంచ ఆహార దినోత్సవంగా గుర్తించాయి.

కాగా ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. ప్రపంచ జనాభా 810 కోట్లు కాగా... ఇందులో 300 కోట్ల మందికి ఆరోగ్యకరమైన ఆహారం పొందగలిగే ఆర్థిక స్థోమత లేదు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు.. ఇజ్రాయెల్‌ – పాలస్తీనా, రష్యా–ఉక్రెయిన్‌ లతో ప్రపంచ పరిస్థితులు క్లిష్టంగా మారిపోయాయి. యుద్ధాల సంక్షోభంతో తలెత్తే ప్రభావాలతో పేద దేశాలు మరింత పేదరికానికి గురవుతున్నాయి.

గణాంకాల ప్రకారం.. ఏటా 130 కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తులు వృథా అవుతుండటం గమనార్హం. ఇలా వృథా అవుతున్న ఆహారాన్ని అన్నార్తులకు అందిస్తే మరింత మందికి ఆకలి తీర్చొచ్చు.

ఇక మనదేశం విషయానికొస్తే భారతదేశంలో పోషకాహార లోపాల కారణంగా ఐదేళ్ల లోపు పిల్లల్లో 30 శాతం మందికి సమస్యలు ఉన్నాయి. ఈ పిల్లలు వారి సామర్థ్యానికి తగ్గట్టు ఎదగలేకపోతున్నారు. రక్తహీనత, విటమిన్‌ లోపాలు తలెత్తుతున్నాయి. ఇవే కాకుండా మరిన్ని సమస్యలు కూడా ఉంటున్నాయి.

మనోవ్యాకులత (డిప్రెషన్‌) యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు ఆకలి కారణంగా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2023 వరల్డ్‌ ఫుడ్‌ డే థీమ్‌ గా... "నీరే జీవితం, నీరే ఆహారం... ప్రతీ ఒక్కరికీ ఇది అందుబాటులో ఉండాలి" అనేదాన్ని నిర్దేశించారు.