రోజులో మీరు తీసుకునే పుడ్ లో ఎంత నూనె అవసరం?
ఒక కుటుంబం నెలసరి వస్తువుల జాబితాలో వంట నూనెల్ని ఎంత కొనుగోలు చేయాలి? అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
By: Tupaki Desk | 3 May 2025 9:39 PM ISTఇటీవల కాలంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంట నూనెల గురించి తరచూ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న దానికి కనీసం 20 శాతం వంట నూనెల్ని తక్షణం తగ్గించాలని కోరుతున్నారు. దీనికి కారణం.. వంట నూనెల్ని అధికంగా వినియోగిస్తే జరిగే నష్టాన్ని నివారించాలన్నదే లక్ష్యం. వంట ఏదైనా..అందులో వంట నూనె (అది ఏదైనా కావొచ్చు) వాడితేనే దాని రుచి. వంట నూనె లేకుండా వండే వంట మూడు ముద్దలు కూడా తినబుద్ధి కాదు.
అలా అని అతిగా వంట నూనెల వినియోగం మంచిది కాదు. అయితే.. ఎంత వాడాలి? ఒక కుటుంబం నెలసరి వస్తువుల జాబితాలో వంట నూనెల్ని ఎంత కొనుగోలు చేయాలి? అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకూ వంట నూనెల్ని అధికంగా వాడితే ఏం జరుగుతుందన్న సందేహం రావొచ్చు. వంట నూనెల్నిఅధికంగా వాడితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇది రక్తపోటు.. గుండెజబ్బులకు దారి తీస్తుంది. అందుకే.. వంట నూనెల్ని ఇష్టారాజ్యంగా కాకుండా.. ఆచితూచి అన్నట్లుగా వాడాలి.
వంట నూనెల్లో మంచి కూడా ఉంటుంది. మనిషి శారీరక శ్రమకు అవసరమైన శక్తిని వంట నూనెల ద్వారా వస్తుంది. కొన్ని రకాల విటమిన్లు వంట నూనెల్లో పుష్కలంగా ఉంటాయి. వంట నూనెలకు సంబంధించి కోల్డ్ ప్రెస్డ్ నూనెలు చాలా మంచివి. కాస్త ఖరీదు ఎక్కువగా ఉన్నప్పటికి.. ఈ నూనెల్ని తయారు చేసే వేళ వేడిచేయటం.. రసాయనాలు కలపటం లాంటివి చేయరు.
మామూలుగా అయితే.. వంట నూనెల్ని తయారు చేసేటప్పుడు నూనె గింజల్ని వేడి చేయటం.. నిల్వ ఉంచేందుకు వీలుగా కొన్ని రసాయనాలు కలుపుతారు. ఈ క్రమంలో ఒమేగా మూడు కొవ్వు ఆమ్లాలు.. యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. రిఫైన్ చేసేటప్పుడు ప్రమాదకర రసాయనాలు తొలిగిపోతాయి. వంట నూనెల వాడకం విషయానికి వస్తే.. రెండు.. మూడు రకాల వేర్వేరు ఆయిళ్లను కలిపి వాడితే ఆరోగ్యానికి మంచిది.
ఇంతకూ ఒక మనిషి రోజుకు ఎంత వంట నూనె అవసరం అంటే.. 3 చెంచాల నుంచి 5 చెంచాలు సరిపోతాయి. మరింత పక్కాగా లెక్క చెప్పాలంటే.. నలుగురు కుటుంబ సభ్యులున్న ఫ్యామిలీ నెలకు 2 లీటర్లకు మించిన ఆయిల్ పాకెట్లు వాడకూడదు. మిగిలిన సరకుల సంగతి ఎలా ఉన్నా.. వంట నూనెల వినియోగం విషయంలో మాత్రం కచ్ఛితంగా లెక్కలు పాటిస్తే.. ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పక తప్పదు.
నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు 2 లీటర్లు అంటే.. ఒకరికి అర లీటరు. అంటే.. సుమారు 450 గ్రాములుగా లెక్కేస్తే.. రోజుకు 15 గ్రాముల కంటే ఎక్కువ నూనె వినియోగించకూడదు. నిజ జీవితంలో మీరెంత నూనెల్ని వినియోగిస్తారన్న విషయాన్ని తెలుసుకోవటానికి ఒక చిన్న పని చేస్తే ఇట్టే అర్థమవుతుంది. మీ ఇంట్లో దోశెలు వేసే వేళలో.. పావు కేజీ నూనెను వేరుగా ఒక గిన్నెలో ఇచ్చి.. ఉదయం.. రాత్రి దోశెల్ని మాత్రమే తినండి. దోశె చట్నీకి వినియోగించే నూనెనుకూడా పావు కేజీ గిన్నెలో నుంచి తీయండి. అప్పుడు అర్థమవుతుంది.. రోజువారీగా వంట నూనెల్నిఎంతగా తాగేస్తున్నామో.
