60 సెకన్లలో 200 బిర్యానీ ఆర్డర్లు
భారతదేశం లాంటి దేశంలో భిన్న ప్రాంతాలు.. విభిన్న ఆహార అలవాట్లు ఉన్నప్పటికి.. అందరిని ఏకం చేసే ఫుడ్ గా మారుతోంది బిర్యానీ.
By: Tupaki Desk | 24 Dec 2025 11:58 AM ISTభారతదేశం లాంటి దేశంలో భిన్న ప్రాంతాలు.. విభిన్న ఆహార అలవాట్లు ఉన్నప్పటికి.. అందరిని ఏకం చేసే ఫుడ్ గా మారుతోంది బిర్యానీ. గడిచిన కొద్ది సంవత్సరాలుగా బిర్యానీపై ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. అదిప్పుడు ఎంత భారీగా ఉందన్న విషయాన్ని తాజాగా దిగ్గజ ఫుడ్ డెలవరీ యాప్ స్విగ్గీ స్పష్టం చేసింది. తాజాగా 2025 సంవత్సరానికి సంబంధించిన రిపోర్టును విడుదల చేసింది.
ఇందులో మొత్తంగా తమకు వచ్చిన ఫుడ్ ఆర్డర్లతోపాటు.. పలు ఆసక్తికర అంశాల్ని ఇందులో పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తంలో 9.3 కోట్ల బిర్యానీలు ఆర్డర్ వచ్చినట్లుగా రిపోర్టు వెల్లడించింది. ఇందులో 5.77 కోట్లు చికెన్ బిర్యానీలుగా పేర్కొన్నారు. ఆన్ లైన్ వినియోగదారుల్లో అత్యధికులు తమ ఫేవరెట్ ఫుడ్ గా బిర్యానీని ఇఫ్టపడుతున్నట్లుగా పేర్కొన్నారు. నిమిషం వ్యవధిలో 200 ఆర్డర్లు మరింత కరెక్టుగా చెప్పాలంటే 194 ఆర్డర్లు వస్తున్నట్లుగా పేర్కొన్నారు.
బిర్యానీ తర్వాతి స్థానం బర్గర్లుగా చెప్పాలి. ఏడాదిలో 4.42 కోట్ల బర్గర్లు డెలివరీ చేయగా.. 4.01 కోట్ల పిజ్జాలు.. 2.62 కోట్ల దోశెల్ని డెలివరీ చేసినట్లుగా పేర్కొన్నారు.స్థానిక వంటకాలను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లుగా పేర్కొన్న రిపోర్టు.. హిల్ స్టేషన్ ప్రాంతానికి చెందిన వంటకాలకు ఆదరణ పెరిగినట్లుగా పేర్కొన్నారు. మలబారి.. రాజస్థానీ.. మల్వానీతో పాటు ఇతర స్థానిక వంటలకు ఆర్డర్లు అధికంగానే వస్తున్నాయని పేర్కొన్నారు. వినియోగదారుల్లో వస్తున్న మార్పునకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశాన్ని పేర్కొన్నారు.
తమకు వచ్చే ఆర్డర్లలో లంచ్ కంటే డిన్నర్ వేళలోనే ఎక్కువగా వస్తాయని స్విగ్గీ పేర్కొంది. విదేశీ వంటకాలకు ఆదరణ పెరిగిందని.. మెక్సికన్ ఫుడ్ కు సంబంధించి 1.2 కోట్ల డెలివరీలు చేసినట్లుగా పేర్కొన్నారు. తర్వాతి స్థానంలో టిబెటన్ ఫుడ్ 12 కోట్లు.. కొరియన్ ఫుడ్ ను 47 లక్షలు డెలివరీ చేసినట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ కు చెందిన ఒక కస్టమర్ రూ.47 వేల ఖర్చుతో 65బాక్సుల డ్రైఫ్రూట్స్ బిస్కెట్లు ఆర్డర్ చేసినట్లుగా తెలిపింది. అంతేకాదు ముంబయికి చెందిన ఒక వినియోగదారు ఏడాదిలో మొత్తంగా 9వేల సార్లు ఆర్డర్ చేశారని.. సరాసరిన చూస్తే రోజుకు తొమ్మిది ఆర్డర్లు చేసినట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఇదో ఆసక్తికర రిపోర్టుగా చెప్పక తప్పదు.
