Begin typing your search above and press return to search.

కాఫీ ధరపై ప్రపంచ కుబేరుడి భార్య మాట వింటే అవాక్కే

ఆమె సాదాసీదా మహిళ కాదు

By:  Tupaki Desk   |   17 July 2023 4:37 AM GMT
కాఫీ ధరపై ప్రపంచ కుబేరుడి భార్య మాట వింటే అవాక్కే
X

ఆమె సాదాసీదా మహిళ కాదు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ సతీమణి ఆస్ట్రిడ్ బఫెట్. వేలాది కోట్ల ఆస్తిపాస్తులు ఉన్న వారికి.. చిన్న విషయాల్ని పెద్దగా పట్టించుకోరన్న భ్రమలో ఉంటాం. అయితే.. అలా ఉండరన్న విషయం తాజా ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. అంతేకాదు.. లలితా జ్యూయలర్స్ అధినేత కిరణ్ వాణిజ్య ప్రకటనల్లో చెప్పే.. 'డబ్బులు ఊరికే రావు' అన్న మాట కూడా బఫెట్ సతీమణి తాజా వ్యాఖ్యల్ని చూసినప్పుడు ఇట్టే అర్థమవుతుంది. డబ్బుల్ని ఎంతగా రెస్పెక్ట్ చేస్తే.. అంతలా డబ్బులు ఉంటాయన్న భావన కలుగక మానదు.

న్యూయార్క్ పోస్టు అందించిన ఆసక్తికర కథనంలో ఈ ఆసక్తికర ఉదంతాన్ని పబ్లిష్ చేశారు. అమెరికాలోని సన్ వ్యాలీ రిసార్టులో అలెన్ అండ్ కో సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బిలియనీర్ల కోసం సమ్మర్ క్యాంప్ ను నిర్వహించారు.

దీనికి బిలియనీర్లు పలువురు హాజరయ్యారు. వారిలో వారెన్ బఫెట్ సతీమణి ఒకరు. రిసార్టు సిబ్బంది ఒక కాఫీకి నాలుగు డాలర్లు (మన రూపాయిల్లో సుమారు రూ.330) వసూలు చేశారు. ఇంతే మొత్తాన్ని స్టార్ బక్స్ దగ్గర నుంచి కాఫీ డేలలో కూడా వసూలు చేయటం కనిపిస్తూ ఉంటుంది.

అయితే.. ఒక కాఫీకి నాలుగు డాలర్లు వసూలు చేయటం సరికాదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేయటం ఆసక్తికరంగా మారింది. మిగిలిన చోట్ల నాలుగు డాలర్లకు ఒక పౌండ్ కాఫీ కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు.

ఒక పౌండ్ కాఫీ పౌడర్ అంటే.. దగ్గర దగ్గర 32 స్పూన్ల కాఫీ పొడి వస్తుంది. ఇదే విషయాన్ని రిసార్టు సిబ్బందికి కంప్లైంట్ చేశారు. సరసమైన ధరకు కాఫీను అమ్మాలన్న సలహాను కూడా ఇవ్వటం గమనార్హం.

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ సతీమణి.. కాఫీ ధర గురించి ఇంతలా స్పందించారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. వేలాది కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఖర్చు చేసే ప్రతి రూపాయిని లెక్కగా చూసుకునే జాగ్రత్త కూడా డబ్బుల్ని మరింత పెంచేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఎన్ని డబ్బులు ఉన్నా.. చేతి నుంచి వెళ్లే ప్రతి రూపాయి.. 'వాల్యూ ఫర్ మనీ' అవునా? కాదా? అన్నది సరి చూసుకొని మరీ ఖర్చు చేయాల్సిన అవసరాన్ని తాజా ఉదంతం చెబుతుందని చెప్పాలి.