టమాటా మోత...సెంచరీకి చేరువలో
అలగే రెండవ రకం పది కిలోల బుట్ట 480 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ రెండు రకాలు చూస్తే కనుక వారం క్రితం వరసగా .440, 340 రూపాయలకు లభించాయి అని గుర్తు చేస్తున్నారు.
By: Satya P | 26 Nov 2025 1:00 AM ISTఏపీలో కూరగాయాలు సామాన్యుడిని వేధిస్తున్నాయి. సంచి నిండా డబ్బులు పట్టుకెళితే జేబుకి సరిపడా కూరగాయలు రావడం కష్టంగా మారిందని సగటు జీవి రోదిస్తున్నాడు. ఈసారి శీతాకాలం సీజన్ ఇలా ఉందంటే వేసవిలో కూరగాయాలు మంటెక్కిస్తాయని ముందే ఊహిస్తూ గోడుమంటున్నాడు. సాధారణంగా వర్షాకాలం శీతాకాలం లలో కూరగాయాల ధరలు నేల మీదనే ఉంటాయి. ఎందుకంటే పంట చక్కగా చేతికి వస్తుంది. అధిక దిగుబడితో సరఫరా డిమాండ్ మధ్యన సమతూల్యత సాధించి అటు రైతులు ఇటు వినియోగదారుడికీ కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ వింటర్ సీజన్ వెరైటీగా మారింది. ఆ మాటకు వస్తే వర్షాకాలం కూడా కలికాలంలో కొత్త అధ్యాయాన్ని రాసింది అని అంటున్నారు.
ఆరు నెలల నుంచి :
వర్షాకాలం అన్న మాటే కానీ దానికి ముందు అధిక అన్న మాట పెట్టాలని వాతావరణ నిపుణులు అంటున్నారు అధిక వర్షపాతం తోనే నాలుగు నెలలు హోరెత్తించింది. పంట వేసినా ఫలితం దక్కకుండా రైతు లబోదిబోమంటే అతి తక్కువ పంట మార్కెట్ కి చేరి డిమాండ్ పెరిగి కూరగాయల ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. అదే సమయంలో తుఫానులు కూడా వచ్చి పడ్డాయి. దాంతో కూరగాయాలేంటి మహా ప్రభో అని సాధారణ జనం అనుకునే పరిస్థితి ఉంది.
శీతాకాలం బాధ :
శీతాకలంలో కూరగాయల ధరలు బాగానే ఉంటాయి. అయితే ఇదే నెలలలో పవిత్రమైన కార్తీక మాసం, అలాగే అయ్యప్ప స్వాముల దీక్షలతో శాకాహారం వైపు అంతా చూస్తారు. దాంతో డిమాండ్ కూడా బాగానే ఉంటుంది కానీ సరిపడా మార్కెట్ లో కూరగాయల సరఫరా ఉన్నట్లు అయితే ఏ ఇబ్బంది ఉండదు, గత ఏడాది అలాగే జరిగింది. సమంజసమైన రేట్లకే కూరగాయలు దొరికాయి అని అంతా గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఈసారి తేడా భారీగానే కొట్టింది అని అంటున్నారు.
టమాటా మంటలు :
శీతాలకం హెచ్చు పంటగా టమాటా వస్తుంది. ఇది శీతాలం పంటగా చెబుతారు. ఇక ప్రతీ కూరలోనూ అనుబంధంగా టమాటాను వాడతారు. అలాంటి టమాట ఎవరి మాటా వినకుండా అటకెక్కి కూర్చుంది. రోజు రోజుకీ ధరలు అలా పెరిగి పోతున్నాయి. దాంతో టమాటా కిలో ధర చూస్తే వామ్మో అనుకోవాల్సి వస్తోంది అని అంటున్నారు కొనుగోలుదారులు. ఏపీ వ్యాప్తంగా చూస్తే ఇపుడు టమాటా రేట్లు టాప్ లేచిపోతున్నాయి. టమాటాకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లో మొదటి గ్రేడ్ టమోటాలు పది కిలోల బుట్ట ఏకంగా 610 రూపాయలు చేరడం విశేషం. అలగే రెండవ రకం పది కిలోల బుట్ట 480 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ రెండు రకాలు చూస్తే కనుక వారం క్రితం వరసగా .440, 340 రూపాయలకు లభించాయి అని గుర్తు చేస్తున్నారు. రిటైల్ మర్కెట్ లో అయితే ఇవే టమాట కిలో చూస్తే ఏకంగా 80 రూపాయల్కు చేరిపోయింది. తొందరలో సెంచరీ కొడుతుందని అంటున్నారు. వరసబెట్టి తుఫాన్లు, అలగే అదే పనిగా భారీ వర్షాలు వంటివి సంభవించడంతో టమాటా పంట దిగుబడి తగ్గిపోయింది అని అంటున్నారు వ్యవసాయా శాఖ అధికారులు చెబుతున్నారు.
వందకు పోటీ :
ఇదే తీరున మిగిలిన కూరగాయలు అన్నీ పోటీ పడుతూ కిలో వంద అంటూ ఆ వైపు చూస్తున్నాయి. వంకాయలు, బీరకాయలు, బెండకాయలు ఏ కూర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నీ ధరల మంట పెట్టడం ఖాయం అని సగటు జీవి పాడుకోవాల్సి వస్తోంది. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే కొత్త ఏడాది పండుగ ఆ మీదట మళ్ళీ శుభ కార్యాలు, ఇక వేసవి కాలంతో ఈ ధరలే ఫిక్స్ అయిపోతాయేమో అన్న కంగారు అయితే బడుగు జీవులకు కలుగుతోంది.
