Begin typing your search above and press return to search.

పొదుపే కాదు... డబ్బును ఖర్చు చేయడమూ తెలుసుకోండి!

ఈ రోజుల్లో చాలామంది 'డబ్బు ఎలా పొదుపు చేయాలి?', 'ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?' అనే విషయాలపైనే దృష్టి సారిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 July 2025 3:15 PM IST
పొదుపే కాదు... డబ్బును ఖర్చు చేయడమూ తెలుసుకోండి!
X

ఈ రోజుల్లో చాలామంది 'డబ్బు ఎలా పొదుపు చేయాలి?', 'ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?' అనే విషయాలపైనే దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా SIPలు ( సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్) గురించి ఆర్థిక నిపుణులు నిరంతరం మార్గదర్శకత్వం ఇస్తున్నారు. అయితే తాజాగా ఎడెల్ వైస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో CEO రాధికా గుప్తా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె చెప్పిన దాని ప్రకారం కష్టపడి సంపాదించిన డబ్బును కేవలం పొదుపు చేయడమే కాదు, జీవితంపై ప్రేమతో ఆ డబ్బును సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.

జూలై 23న తన X ఖాతా ద్వారా రాధికా గుప్తా ఒక ముఖ్యమైన పోస్ట్ చేశారు. “నా పని SIPలు అమ్మడమే. కానీ నేను ఎప్పుడూ ప్రజలకు ఒకే మాట చెబుతాను. మీ సంపాదనను ఆస్వాదించడానికి సమయం కేటాయించండి. డబ్బును ఆదా చేయండి, కానీ మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాలపై ఖర్చు చేయడానికి కూడా వెనుకాడకండి.” అని ఆమె పేర్కొన్నారు. ఆమె మాటల్లోని సారాంశం ఇదే "జీవితం ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందన్న పోటీ కాదు, ఎవరు ఎక్కువ ఆనందంగా ఉన్నారన్నదే అసలైన విజయం."

- పొదుపు vs ఖర్చు.. సరైన సమతౌల్యం అవసరం

ఆర్థిక విషయాల్లో చాలామంది పెట్టుబడి, పొదుపుపైనే దృష్టి పెడతారు. ఖర్చు చేయడం అనేది అనవసరం అని భావిస్తారు. కానీ రాధికా మాటల ప్రకారం ఈ రెండింటి మధ్య సరైన సమతౌల్యం పాటించడం చాలా ముఖ్యం. పొదుపు వల్ల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. ఖర్చు వల్ల మన జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు. ఈ రెండింటి మధ్య సరైన సంతులనం ఉండాలి. ఆ సంతులనమే మన జీవిత నాణ్యతను పెంచుతుంది.

- ఫిన్‌ఫ్లూయెన్సర్స్‌పై హెచ్చరిక

జూన్‌లో చేసిన మరో పోస్ట్‌లో రాధికా గుప్తా ప్రజలను ఫిన్‌ఫ్లూయెన్సర్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కొంతమంది సోషల్ మీడియా ఆర్థిక గురువులు, ప్రజల్లో ఎఫ్.ఓ.ఎంఓ ( ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్) అంటే ఏదో కోల్పోతున్నామనే భయాన్ని పెంచి, తొందరపాటుతో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె స్పష్టం చేసినది ఏమిటంటే “ఎవరైనా పెట్టుబడి చేయాలంటే ముందు రిస్క్ అర్థం చేసుకోవాలి. అధిక రాబడి ఆశతో అజ్ఞానంగా పెట్టుబడులు వేయడం ప్రమాదకరం.” అని పేర్కొన్నారు.

- ఎస్ఐపీలు.. మార్కెట్ స్థిరత్వానికి ఆధారం

భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు నమ్మకంతో SIPల ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల దేశ క్యాపిటల్ మార్కెట్లకు స్థిరత్వం లభిస్తోందని ఆమె పేర్కొన్నారు. అలాంటి పెట్టుబడులు సరైన అవగాహనతో చేయాలి కానీ, కేవలం డబ్బు కూడబెట్టాలనే ఆలోచనతో ఆనందాన్ని పక్కనపెట్టి చేయకూడదని ఆమె సూచించారు.

డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం. దాన్ని పొదుపుగా ఉంచడం తెలివైన పని. కానీ దాన్ని జీవితానికి ఆనందంగా మార్చుకోవడం నిజమైన ఆర్థిక విజయం. కాబట్టి, మీరు పెట్టుబడి పెట్టండి, పొదుపు చేయండి. కానీ, మీ కష్టార్జితాన్ని ఆస్వాదించడానికి కూడా సమయం కేటాయించండి. జీవితానికి విలువ మీరు ఎంచుకున్న SIPలలో కాదు, సంతోషంగా గడిపిన క్షణాల్లో ఉంటుంది.