'విరాటపాలెం' కాపీరైట్ ఇష్యూపై జీ5 క్లారిటీ.. ఏమందంటే?
స్క్రిప్ట్ రైటర్ ప్రశాంత్ దిమ్మల.. తమ వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ సిరీస్ విషయంలో కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డామని ఆరోపిస్తూ దావా వేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని జీ5 తెలిపింది.
By: Tupaki Desk | 28 Jun 2025 9:12 AM ISTతెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సిరీస్ ఒరిజినల్ కథ తమదేనని ఈటీవీ విన్ వాదిస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ న్యాయపోరాటం చేస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టుకు అయినా వెళ్తామని అన్నారు. ఇప్పుడు ఆ విషయంపై జీ5 సంస్థ స్పందించింది.
స్క్రిప్ట్ రైటర్ ప్రశాంత్ దిమ్మల.. తమ వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ సిరీస్ విషయంలో కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డామని ఆరోపిస్తూ దావా వేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని జీ5 తెలిపింది. ఆ విషయం సబ్ జ్యుడీషియల్ పరిధిలో ఉందని చెప్పింది. అందుకే బహిరంగ ప్రకటనలు చేయకూడదని వ్యాఖ్యానించింది.
కానీ ఉద్దేశపూర్వకంగా విలేకరుల సమావేశం నిర్వహించారని తెలిపింది. ఓపిక పట్టకుండా లేదా కంటెంట్ వీక్షించే అవకాశాన్ని ఉపయోగించుకోకుండా దుష్ప్రచారం చేశారని చెప్పింది. కాపీరైట్ జరిగిందనే వాదనను నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు అందించకుండా ఇది జరిగిందని తెలిపింది. ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది.
తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రశాంత్ దిమ్మలాతోపాటు ఆయన టీమ్ బాధ్యతారహితంగా ఉన్నారని చెప్పింది. ముఖ్యంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంపై దృష్టి పెట్టారని పేర్కొంది. పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని జీ సంస్థ ఆరోపించింది.
అందుకే చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశపూర్వకంగా నిర్వహించడంపై క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది. తప్పుడు ప్రకటనలు పంచుకోవడం మానుకోవాలని అందరినీ కోరుతుంది. అన్ని చట్టపరమైన పరిష్కారాలను అనుసరించే హక్కు తమకు ఉందని తెలిపింది.
జీ తన కంటెంట్ ను సృష్టించడంలో కాపీరైట్ చట్టాలను పాటించడానికి, రచయితలు, కళాకారులు, సాంకేతిక నిపుణుల గౌరవాన్ని నిలబెట్టడానికి తన అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని స్పష్టం చేసింది. సత్యాన్ని నిలబెట్టడానికి, దాని ప్రతిష్టను కాపాడుకోవడానికి స్థిరంగా ఉందని వెల్లడించింది.
