నా నోటి నుంచి ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ జోహార్ అనే మాట రాదు: YVS
ఈ సందర్భంగా డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తన భావోద్వేగాలను పంచుకుంటూ మాట్లాడారు..
By: Tupaki Desk | 12 May 2025 1:30 PM ISTతెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వంశంలో ఇప్పటివరకు మూడు తరాల నందమూరి నటవారసులు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు నాలుగో తరం నుంచి మరో హీరో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. హరికృష్ణ మనవడు, జానకీరామ్ కుమారుడు ఎన్టీఆర్ హీరోగా పరిచయం అవుతున్న తొలి సినిమా సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంగరంగ వైభవంగా లాంచ్ అయింది.
ఈ లాంచ్ కార్యక్రమానికి నందమూరి కుటుంబం తరపున నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, వసుంధర బాలకృష్ణ, నందమూరి మోహనకృష్ణ తదితరులు హాజరయ్యారు. నారా భువనేశ్వరి క్లాప్ కొట్టగా, మోహనకృష్ణ మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు. ప్రాజెక్ట్‌ను వైవీఎస్ చౌదరి డైరెక్ట్ చేస్తుండగా, సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి అందిస్తున్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తన భావోద్వేగాలను పంచుకుంటూ మాట్లాడారు, "నందమూరి తారకరామారావు గారి ఈ స్థలం నాకు దివ్యమైన పుణ్యక్షేత్రం లాంటిది. ఇది ఒక శక్తినిచ్చే ప్రదేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, మా ముందు జనరేషన్ వారు, నా జనరేషన్, తదుపరి తరం వారు కూడా ఇక్కడికి వచ్చి తమ బాధలు చెప్పుకుంటారు. ఒక రకంగా ఇది మెడిటేషన్ లాంటి స్థలం. ఇక్కడ ఆయన మనతో ఉన్నట్లే అనిపిస్తుంది. ఈ స్థలంలో సినిమా ప్రారంభించడం నాకు చాలా గర్వంగా ఉంది."
"నా నోటి నుంచి ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ జోహార్ అనే మాట రాదు. ఎందుకంటే.. ఆయన మనలో ఉన్నారు.. మనతో ఉన్నారు.. మరణం లేని జననం.. ఆయన మనలోనే ఉన్నారు. మన హృదయాల్లో ఉన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన గుర్తింపు కొనసాగుతుంది. ఈ చరిత్రలో మాత్రమే కాక, రాబోయే చరిత్రలోనూ ఆయన పేరు నిలిచిపోతుంది" అని వైవీఎస్ చౌదరి తన మాటలతో ఆకట్టుకున్నారు.
ఇక వైవీఎస్ చౌదరి చాలా కాలం తరువాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాస వంటి హిట్ చిత్రాలను ఆయన తెలుగు సినిమా రంగానికి అందించారు. ఇక చాలా గ్యాప్ తరువాత ఈ కొత్త హీరోతో వస్తున్న ప్రాజెక్ట్ పై నందమూరి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగిన లాంచ్ ఈ సినిమాకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిందనడం అతిశయోక్తి కాదు. ఈ ప్రాజెక్ట్ వైవీఎస్‌కు కొత్త శకం తీసుకురావాలని అందరూ ఆశిస్తున్నారు.
