వైవీఎస్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేస్తారా?
అయితే అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ వైవీఎస్ చౌదరి నందమూరి వారసుడి సినిమాలో రాబోతున్నానని ప్రకటించి షాక్ ఇచ్చారు.
By: Tupaki Desk | 10 May 2025 10:37 AM IST'సీతారాముల కల్యాణం చూతము రారండి' సినిమాతో డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న వైవీఎస్ చౌదరి ఆ తరువాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో..' సీతయ్య, దేవదాసు.. వంటి సినిమాలతో తనకు టాలీవుడ్‌లో తిరుగులేదనిపించుకున్నారు. దర్శకుడిగా మాంచి జోరుమీదున్న సమయంలో వైవీఎస్ చౌదరికి భారీ ఝలక్ తగిలింది. అదే 'ఒక్క మగాడు'. కమల్ భారతీయుడు క్యారెక్టర్‌ని కాపీ చేసి ఈ సినిమాతో చౌదరి ఫూల్ అయ్యాడు. బాలయ్యను విభిన్నమైన గెటప్‌లలో చూపించినా అవి భారతీయుడుకు కాపీ కావడంతో భారీ డిజాస్టర్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
అప్పటి వరకు టాలీవుడ్‌లో క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వైవీఎస్‌కు ఆ తరువాత ఆ క్రేజ్ పోయింది. వరుస ఫ్లాపులు, డిజాస్టర్లు వరించాయి. గుణశేఖర్‌ని డైరెక్టర్‌గా పెట్టి రవితేజతో చేసిన 'నిప్పు' చౌదరి కెరీర్‌కు నిప్పు పెట్టింది. ఇక సాయిధరమ్ తేజ్‌తో చేసిన 'రేయ్' దర్శకుడిగా ఆయన స్థాయిని మరింతగా దిగజార్చింది. దీంతో గత పదేళ్లుగా వైవీఎస్ చౌదరి సైలెంట్యిపోయారు. ఏ సినిమాని ప్రకటించకుండా సినిమాలకు పదేళ్లుగా దూరంగా ఉంటూ వచ్చారు.
ఒకప్పుడు స్టార్లతో సినిమాలు చేసిన ఆయన ఇకపై డైరెక్షన్ చేయడం కష్టమే. అంతే కాకుండా ఆయనకు సినిమాలు కూడా రావనే కామెంట్‌లు ఇండస్ట్రీలో వినిపించాయి. దీంతో వైవీఎస్ కెరీర్ ఇక ముగిసినట్టేనని అంతా భావించారు. అయితే అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ వైవీఎస్ చౌదరి నందమూరి వారసుడి సినిమాలో రాబోతున్నానని ప్రకటించి షాక్ ఇచ్చారు. నందమూరి జానకీరామ్ తనయుడు ఎన్టీఆర్‌ను హీరోగా పరిచయం చేస్తున్నానని ప్రకటించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌తో మళ్లీ వార్తల్లో నిలిచిన ఆయన వరుస అప్‌డేట్‌లతో స్పీడు చూపించారు.
ఇంట్రో వీడియోలని విడుదల చేసి ప్రాజెక్ట్‌పై అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించారు. కానీ ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తారని, చంద్రబోస్ సాంగ్స్ ఇస్తారని, బుర్రా సాయిమాధవ్ మాటలు అని టెక్నిషియన్స్‌ని పరిచయం చేసిన వైవీఎస్ చౌదరి ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కష్టమేననే కామెంట్‌లు వినిపించాయి. అయితే ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ వైవీఎస్ చౌదరి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశారు. జానకి రామ్ తనయుడితో ప్రాజెక్ట్ ఉందని, దీన్ని ఈ నెల 12న భారీ స్థాయిలో ప్రారంభించబోతున్నామని హింట్ ఇచ్చేశారు. ఆ రోజే హీరో, హీరోయిన్‌ల లుక్ ని కూడా రివీల్ చేస్తారట. ఈ విషయం తెలిసిన వాళ్లంతా వైవీఎస్ ఈ మూవీతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేయాలని కోరుకుంటున్నారు. మరి చౌదరి గారు ఈ మూవీతో స్ట్రాంగ్‌గా కమ్ బ్యాక్ ఇస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.
