గాడి తప్పిన వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్!
ఇటీవలే రిలీజ్ అయిన `ఆల్పా` అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. రిలీజ్ కు ముందు బోలెడంత హైప్ క్రియేట్ చేసినా `ఆల్పా` రిలీజ్ తర్వాత విమర్శలు ఎదుర్కోంటుంది.
By: Srikanth Kontham | 5 July 2026 1:59 PM ISTయశ్‌రాజ్ ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్పై యూనివర్స్ అంటే? బాలీవుడ్‌లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌గా భావిస్తారు. సల్మాన్ ఖాన్ `టైగర్` సిరీస్, హృతిక్ రోషన్ `వార్`, షారుఖ్ ఖాన్ `పఠాన్` వంటి చిత్రాలతో స్పై ప్రపంచాన్ని అద్భుతంగా నిర్మిస్తారని ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. కానీ ఇటీవల వెలువడుతున్న పరిణామాలు, కథల్లోని పట్టు తగ్గడం ,విడుదల తేదీల్లో గందరగోళం చూస్తుంటే యూనివర్స్ దారిని కోల్పోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే రిలీజ్ అయిన `ఆల్పా` అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. రిలీజ్ కు ముందు బోలెడంత హైప్ క్రియేట్ చేసినా `ఆల్పా` రిలీజ్ తర్వాత విమర్శలు ఎదుర్కోంటుంది.
అయితే ప్రధాన సమస్య స్క్రిప్ట్ విషయంలోనే కనిపిస్తోంది. మొదట్లో వచ్చిన `ఏక్ థా టైగర్`, `టైగర్ జిందా హై` చిత్రాలు ఒక పద్ధతిలో సాగితే? ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో లాజిక్ కంటే స్టార్ ఇమేజ్, భారీ యాక్షన్ సీన్లకే ప్రాధాన్యత పెరిగింది. దీనివల్ల పాత్రల మధ్య ఉండాల్సిన ఎమోషనల్ కనెక్టివిటీ తగ్గిపోయి విజువల్స్ మాత్రమే మిగిలాయి. ముఖ్యంగా స్పై యూనివర్స్ అంటే ఉండాల్సిన గూఢచారి లక్షణాలు, సస్పెన్స్ మూలకాలు ఇప్పుడు వెండితెరపై కనిపించడం లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రాజెక్టుల మధ్య సమన్వయం లోపించడం కూడా పెద్ద ఇబ్బందిగా మారింది.
`వార్ 2` నుండి `టైగర్ వర్సెస్ పఠాన్` వరకు ప్రతి సినిమా భారీ అంచనాల మధ్య మొదలవుతున్నా? వాటిని పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోంది. ఒక సినిమాకు మరో సినిమాకు మధ్య ఉండాల్సిన కథా పరమైన అనుసంధానం ఇప్పుడు కాస్త కృత్రిమంగా అనిపిస్తోంది. ఇది ప్రేక్షకులలో ఉన్న ఆసక్తిని క్రమంగా తగ్గిస్తూ గందరగోళానికి దారితీస్తోంది. యూనివర్స్‌ను విస్తరించాలనే ప్రయత్నంలో కొత్త పాత్రలను పరిచయం చేయడం లేదా పాత పాత్రలను అనవసరంగా వాడటం వల్ల కథా గమనం దెబ్బతింటోంది. ప్రతి సినిమాలోనూ పాత పాత్రల అతిథి పాత్రలు ఉండటమే యూనివర్స్ కు ప్రధాన బలంగా మారింది.
కానీ కేవలం అతిథి పాత్రల మీదే ఆధారపడితే ఆయా చిత్రాల సొంత కథాంశం బలం కోల్పోతుందనే విషయాన్ని నిర్వాహకులు గ్రహించలేకపోతున్నారు. మార్కెట్ పరంగా చూసినా? ఇతర చిత్రాలు గ్లోబల్ రేంజ్‌లో భారీ వసూళ్లను సాధిస్తుంటే వైఆర్ఎఫ్ స్పై చిత్రాలు కేవలం దేశీయంగానే పరిమితం కావడం ఆందోళనకరం. భారీ బడ్జెట్‌లను పెడుతున్నా? ఆ స్థాయి మేకింగ్ క్వాలిటీ లేకపోవడం చిత్రాలను బాక్సాఫీస్ వద్ద వెనకబడిపోయేలా చేస్తోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఆశిస్తున్న ప్రేక్షకులకు ఈ పాత ఫార్ములా సినిమాలు బోర్ కొడుతున్నాయనేది వాస్తవం.
వైఆర్ఎఫ్ సంస్థ యూనివర్స్‌ను కాపాడుకోవాలంటే ? మళ్ళీ మొదటి నుండి ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. స్టార్ హీరోల కాంబినేషన్ల మీద కాకుండా గ్రిప్పింగ్ స్క్రిప్ట్‌లు , కొత్తదనంపై దృష్టి సారిస్తేనే స్పై యూనివర్స్ మళ్ళీ గాడిలో పడుతుంది. లేకపోతే అతిపెద్ద స్పై యూనివర్స్ అనే పేరుతో మొదలైన ప్రయాణం మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు .
