YRF 'ఆల్ఫా' నిడివిపై 'వార్ 2' ప్రభావం?
ఇటీవలి కాలంలో భారతీయ చిత్ర పరిశ్రమలో సినిమాల సుదీర్ఘ నిడివి (రన్‌టైమ్)పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
By: Sivaji Kontham | 30 Jun 2026 7:00 PM ISTఇటీవలి కాలంలో భారతీయ చిత్ర పరిశ్రమలో సినిమాల సుదీర్ఘ నిడివి (రన్‌టైమ్)పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గతంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన `యానిమల్` చిత్రం మూడు గంటలకు పైగా నిడివితో సంచలనం సృష్టించగా.. ఆ తర్వాత వచ్చిన దురంధర్, దురంధర్ 2 చిత్రాలు కూడా భారీ రన్‌టైమ్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సాధారణంగా మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిడివి ఉన్న సినిమాలను థియేటర్లలో చూడాలంటే ప్రేక్షకులకు చాలా ఓపిక కావాలి. అయితే ఆ మూడు సినిమాలు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేయడంలో విజయవంతమయ్యాయి.
కానీ ఇదే ఫార్ములా అన్ని వేళలా వర్కవుట్ కాదని యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మక చిత్రం `వార్ 2` నిరూపించింది. భారీ అంచనాల మధ్య క్రేజీ మల్టీస్టారర్‌గా విడుదలైన `వార్ 2` చిత్రం 173 నిమిషాల (దాదాపు 3 గంటల) సుదీర్ఘ నిడివితో వచ్చి ప్రేక్షకులకు తీవ్ర విసుగు పుట్టించింది. కథనంలో వేగం లేకపోవడం, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రక్తి కట్టించడంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ పూర్తిగా విఫలమయ్యాడనే విమర్శలు వచ్చాయి. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే వైఆర్ఎఫ్ అధినేత ఆదిత్య చోప్రా తమ తదుపరి స్పై యూనివర్స్ చిత్రం `ఆల్ఫా` నిడివి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రిప్పింగ్ నేరేషన్ తో ప్రతి పావుగంటకు ఒక హైలైట్ ఉండేలా `ఆల్ఫా`ను స్క్రీన్ ప్లేను డిజైన్ చేసారట.
యుఏ సర్టిఫికెట్ :
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఇద్దరు లేడీ స్పైల కథతో వస్తున్న మొదటి మహిళా ప్రధాన చిత్రం `ఆల్ఫా`. అలియా భట్, శార్వరి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను జూన్ 29న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సి) సెన్సార్ చేసింది. ఈ చిత్రానికి బోర్డు యుఏ సర్టిఫికేట్ జారీ చేసింది. సెన్సార్ సర్టిఫికేట్ ప్రకారం ఈ సినిమా రన్‌టైమ్‌ను కేవలం 2 గంటల 20 నిమిషాల 48 సెకన్లకే పరిమితం చేశారు. ఇందులో ఫస్టాఫ్ 1 గంట 13 నిమిషాల 32 సెకన్లు కాగా, సెకండాఫ్ 1 గంట 7 నిమిషాల 16 సెకన్ల పాటు సాగనుంది. అనవసరపు సాగతీత లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతోనే వైఆర్ఎఫ్ నిడివి విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంది.
శివ్ రావల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 3జూలై 2026న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఘనంగా విడుదల కానుంది. ట్రైలర్, స్టార్ కాస్టింగ్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బుధవారం జూలై -1 నుండి అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే గత వారం విడుదలైన `వెల్కమ్ టు ది జంగిల్` సినిమా వీకెండ్ టికెట్ ధరలనే `ఆల్ఫా`కు కూడా కొనసాగించాలని.. అలాగే అన్ని షోలు ఉదయం 9:30 గంటల తర్వాతే ప్రారంభం కావాలని థియేటర్ల యజమానులకు వైఆర్ఎఫ్ నిర్ణయించిందట.
ఇక థియేటర్లలో షోల కేటాయింపు విషయంలో కూడా వైఆర్ఎఫ్ గట్టి నిబంధనలనే పెట్టింది. మల్టీప్లెక్స్‌లలో తమ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత దక్కేలా ప్లాన్ చేసిందట. 2 స్క్రీన్స్ ఉన్న థియేటర్లలో కనీసం 4 షోలు, 3 స్క్రీన్స్ ఉన్న చోట 6 షోలు, 4 స్క్రీన్స్ ఉన్న మల్టీప్లెక్స్‌లలో కనీసం 8 షోలు కేటాయించాలని కోరింది. ఇక 10 కంటే ఎక్కువ స్క్రీన్స్ ఉన్న భారీ మల్టీప్లెక్స్‌లలో కనీసం 10 షోలు `ఆల్ఫా` సినిమాకే ఇవ్వాలని డిమాండ్ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయానికి వస్తే... పరిస్థితిని బట్టి వైఆర్ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నిర్ణయం తీసుకోనుంది. తక్కువ రన్‌టైమ్, పక్కా ప్లానింగ్‌తో వస్తున్న ఈ లేడీ స్పై మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
