Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘యూత్’

తమిళంలో బాల నటుడిగా మంచి పేరు సంపాదించిన కెన్ కరుణాస్.. ఇప్పుడు తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ‘యూత్’ అనే సినిమా తీసేశాడు.

By:  Tupaki Desk   |   27 March 2026 2:12 PM IST
మూవీ రివ్యూ : ‘యూత్’
X

‘యూత్’ మూవీ రివ్యూ

నటీనటులు: కెన్ కరుణాస్ - అనీష్మా అనిల్ కుమార్- ప్రియాంశి యాదవ్- మీనాక్షి దినేష్- సూరజ్ వెంజరమూడు- దేవదర్శిని తదితరులు

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

ఛాయాగ్రహణం: వికి

నిర్మాతలు: కరుపయ్య రామ్- సులోచన కుమార్

రచన-దర్శకత్వం: కెన్ అండ్ గ్యాంగ్

తమిళంలో బాల నటుడిగా మంచి పేరు సంపాదించిన కెన్ కరుణాస్.. ఇప్పుడు తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ‘యూత్’ అనే సినిమా తీసేశాడు. ఈ సినిమాలోని ‘ముత్త కలక్కి’ అనే పాట సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. తెలుగులో కూడా మంచి బజ్ క్రియేట్ చేసిన ‘యూత్’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ప్రవీణ్ (కెన్ కరుణాస్) ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. అతడి తండ్రి ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజిరమూడు) బేకరీ నడుపుతుంటాడు. తల్లి సరోజ (దేవదర్శిని) గృహిణి. వీళ్లిద్దరూ కొడుకును ఉన్నత స్థితిలో చూడాలనుకుంటారు. కానీ ప్రవీణ్ స్కూల్లో బుద్ధిగా చదువుకోకుండా అమ్మాయిల ప్రేమ కోసం పరితపిస్తుంటాడు. అతడి జీవితంలోకి కొంచెం ముందు వెనుకగా ముగ్గురు అమ్మాయిలు వస్తారు. మరి ఆ అమ్మాయిల వల్ల ప్రవీణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది.. మరోవైపు తన కుటుంబంలో తలెత్తిన ఇబ్బందులేంటి.. అల్లరి చిల్లరిగా తిరిగే అతడికి బాధ్యత తెలిసొచ్చిందా లేదా.. చివరికి ప్రవీణ్ జీవితం ఏ తీరానికి చేరింది.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

స్కూల్.. కాలేజీ రోజుల్లో తెలిసీ తెలియని వయసులో ఆడే లవ్వాటలను సహజంగా.. సరదాగా తెరకెక్కిస్తే వాటితో మెజారిటీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఆ కథలు ఇప్పుడు యవ్వనంలో ఉన్న వారికే కాదు రిలేటబుల్ గా అనిపించడమే కాక.. ఇప్పుడు వయసు పెరిగిన వారికి కూడా వారి యవ్వనాన్ని గుర్తు చేస్తాయి. ఐతే ఆ వయసులో ప్రేమ పేరుతో చేసే అల్లరికే పరిమితం కాకుండా.. జీవిత పరమార్థాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ టచ్ ఇచ్చినపుడే ఈ కథలకు సార్థకత వస్తుంది. ఇది ఎప్పట్నుంచో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న సినీ ఫార్ములా. పోయినేడాది ఇదే ఫార్ములాను ఫాలో అయిన ‘డ్రాగన్’ అనే సినిమా అటు తమిళం.. ఇటు తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు ‘యూత్’ మూవీ కూడా ఇదే దారిలో సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కెన్ కరుణాస్ చిన్న కుర్రాడే అయినా.. హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తూ రెండు రకాలుగా తన టాలెంట్ చూపించాడు. దర్శకుడిగా తనొక్కడికే క్రెడిట్ ఇచ్చుకరోకుండా ‘కెన్ అండ్ గ్యాంగ్’ అని టైటిల్ కార్డ్ వేసుకున్న ఈ కుర్రాడు.. ఫన్-ఎమోషన్ సమపాళ్లలో మిక్స్ చేసిన తీసిన ‘యూత్’తో ఇటు యువతనే కాక కుటుంబ ప్రేక్షకులనూ మెప్పించాడు.

కొడుకే ప్రాణంగా బతుకుతూ.. అతను గొప్ప స్థాయికి ఎదిగితే చూడాలని పరితపించే తల్లిదండ్రులు ఒకవైపు.. వారి ఆకాంక్షలు అర్థం చేసుకోకుండా చదువును నిర్లక్ష్యం చేస్తూ అమ్మాయిల కోసం వెంపర్లాడే కొడుకు ఇంకోవైపు.. ఈ రెండు విరుద్ధ ప్రపంచాల నేపథ్యంలో సాగే సినిమా.. యూత్. ఐతే ఎమోషన్ అంతా వెనక్కి నెట్టి.. ఈ కథను మొదలుపెట్టడం.. ముందుకు నడిపించడంలో వినోద మార్గాన్నే అనుసరించాడు కెన్. స్కూల్లో తన గ్యాంగ్ తో కలిసి చేసే అల్లరి.. ఆటలు పాటలు.. అమ్మాయిలతో సయ్యాటలు.. గిల్లికజ్జాలు.. స్నేహితుల ముందు ఇచ్చే బిల్డప్పులు.. ఇలా చాలా సరదాగా సాగిపోతాయి సన్నివేశాలు. అక్కడక్కడా కామెడీలో కొంచెం తమిళ అతి కనిపించినా.. తల్లిదండ్రుల ఆకాంక్షలకు భిన్నంగా హీరో ప్రవర్తన కొంత అసహనం కలిగించినా.. నవ్వులకైతే ఢోకా ఉండదు. ఇంటర్వెల్ ముంగిట బ్రేకప్ సీన్ ప్రథమార్ధానికి హైలైట్ గా నిలుస్తుంది. ఫస్టాఫ్ మంచి వేగంతో.. సరదాగా సాగి సినిమా మీద మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది.

‘యూత్’ ద్వితీయార్ధంలో కూడా కొంత ఫన్ ఉన్నప్పటికీ.. ఆ తర్వాత పూర్తిగా ఎమోషనల్ రూట్లోకి మళ్లుతుంది. హీరో కుటుంబంలో సమస్య తలెత్తినప్పటి నుంచి ‘యూత్’ భావోద్వేగాలతో కట్టి పడేస్తుంది. హీరో తండ్రి ఫ్లాష్ బ్యాక్ కూడా ప్రేక్షకులపై బలమైన ముద్ర వేస్తుంది. ఈ తరం యువత ఆలోచనలకు.. వారి తల్లిదండ్రుల ఆకాంక్షలకు మధ్య ఉన్న అంతరాన్ని చాలా బాగా.. పరిణతితో చర్చించాడు కెన్. కథ కానీ.. అందులోని మలుపులు కానీ.. కొత్తగా అనిపించకపోయినా.. చాలా సినిమాల్లో చూసిన విషయాలే మళ్లీ చూస్తున్నట్లు అనిపించినా.. అవేమీ పెద్ద సమస్యలు కావు. బోర్ కొట్టించని కథనం.. సన్నివేశాలు.. ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. ఈ కథకు ద్వితీయార్ధంలో ఇచ్చిన ఎమోషనల్ టచ్ బాగా పని చేసింది. కథ రొటీనే అయినా బోర్ కొట్టని సన్నివేశాలు.. చక్కటి పెర్ఫామెన్సులు.. మ్యూజిక్ ‘యూత్’కు ప్లస్ అయి మంచి టైంపాస్ మూవీగా రూపుదిద్దుకుంది.

నటీనటులు:

కెన్ కరుణాస్ నటనకు మంచి మార్కులు పడతాయి. బాధ్యతలు పట్టని టీనేజీ కుర్రాడి పాత్రలో అతను చక్కటి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. తన అల్లరి బాగా నవ్విస్తుంది. అదే సమయంలో భావోద్వేగాలను కూడా బాగానే పండించాడు. కొత్తవాడైనప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యేలా అతడిలో ఏదో ఒక ఆకర్షణ ఉందనిపిస్తుంది. ముగ్గురు హీరోయిన్లలో అనీష్మా అనిల్ కుమార్ బాగా పెర్ఫామ్ చేసింది. క్యూట్ గా అనిపిస్తూనే చక్కగా హావభావాలు పలికించింది. మీనాక్షి.. ప్రియాంశి ఓకే అనిపిస్తారు. హీరో తల్లిదండ్రుల పాత్రల్లో సూరజ్.. దేవదర్శిని చాలా బాగా నటించారు. వారి పాత్రలు.. నటన సినిమాకు పెద్ద బలంగా నిలిచాయి.

సాంకేతిక వర్గం:

జి.వి.ప్రకాష్ కుమార్ ‘ముత్త కలక్కి’ వైరల్ పాటతో ముందే ఈ సినిమాకు చాలా ప్రయోజనం చేకూర్చి పెట్టాడు. తెలుగులో ఆ పాట లిరిక్స్ అంత ఆకర్షణీయంగా లేకపోయినప్పటికీ.. బీట్ వల్ల తెరపై ఈ పాట బాగానే క్లిక్ అయింది. మిగతా పాటలు.. నేపథ్య సంగీతం కూడా బాగున్నాయి. వికి ఛాయాగ్రహణం కలర్ ఫుల్ గా సాగింది. నిర్మాణ విలువలు సినిమాలకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. కెన్ తన టీంతో కలిసి యూత్ ను మెప్పించేలా ఒక సింపుల్ కథను ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో తెర మీద బాగా ప్రెజెంట్ చేశాడు. తన టేకింగ్ బాగుంది. వినోదంతో పాటు ఎమోషన్లనూ అతను బాగా హ్యాండిల్ చేశాడు.

చివరగా: యూత్.. యూత్ కోసం

రేటింగ్- 2.75/5