Begin typing your search above and press return to search.

ఆ వ్యాఖ్యల‌ వెనుక తార‌క్ మ‌ర్మ‌మేంటి?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కొచ్చి 25 ఏళ్లు పూర్త‌యింది. రెండున్న‌ర ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో 30 సినిమాల్లో న‌టించారు.

By:  Srikanth Kontham   |   11 Aug 2025 1:18 PM IST
ఆ వ్యాఖ్యల‌ వెనుక తార‌క్ మ‌ర్మ‌మేంటి?
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కొచ్చి 25 ఏళ్లు పూర్త‌యింది. రెండున్న‌ర ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో 30 సినిమాల్లో న‌టించారు. ఎన్నో సినిమా వేదిక‌ల్ని పంచుకున్నారు. మైక్ ప‌ట్టుకున్న ప్ర‌తీసారి త‌న వ్యాఖ్యల‌తో ప్రేక్షకాభిమానుల్ని మంత్ర ముగ్దుల్ని చేయ‌డం తార‌క్ కే చెల్లింది. అత‌డికి గొప్ప వ‌క్త‌గా పేరుంది. తానెంత గొప్ప న‌టుడో అంత‌కు మంచి వాక్చుత‌ర్యం క‌లిగిన వారు. తార‌క్ ఎంత సేపు మాట్లాడినా? అలా వినాల‌నిపిస్తూనే ఉంటుంది. హీరోల్లో ఎవ‌రికీ సాధ్యం కాని ప్ర‌తిభ తార‌క్ కి మాత్ర‌మే సాధ్య‌మైంది.

దాప‌రికం లేని న‌టుడు:

మీడియాతో ఇంట‌రాక్ష‌న్ అయినా? మైక్ చేత ప‌ట్టి ప‌బ్లిక్ గా మాట్లాడాల‌న్నా? ప్రీ రిలీజ్ వేడుక‌ల్లోనైనా? తార‌క్ మైక్ ప‌ట్టాడంటే? ఓ ర‌క‌మైన వైబ్ క్రియేట్ అవుతుంది. తాను చెప్పాల‌నుకున్న‌ది సూటిగా సుత్తి లేకుండా చెబుతారు. దాప‌రికం....ప‌రోక్షంగా మాట్లాడ‌టం వంటివి తార‌క్ కి చేత‌కావు. పాజిటివ్ అయినా? నెగిటివ్ అయినా స్ట్రెయిట్ గా మాట్లాడ‌టం తార‌క్ కి అల‌వాటు. సాధార‌ణంగా చాలా వ‌ర‌కూ సినిమా వాళ్లు? అంటే నెగిటివ్ అంశాల‌వైపు వెళ్ల‌రు. ఎవ‌రూ నొచ్చుకోకుండా సున్నితంగా మాట్లాడి వెళ్లిపోతుంటారు.

మునుపెన్న‌డు లేని విధంగా:

తార‌క్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ అలాగే మాట్లాడుకుంటూ వ‌చ్చారు. కానీ ఈ మ‌ధ్య కాలంలో తార‌క్ గ‌ళం మారిందన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న అనుకునే వ్య‌క్తుల కోసం తార‌క్ ఎలా నిల‌బ‌డ‌తారు ? అన్న‌ది ఓ సినిమా ఈవెంట్లో ప్రూవ్ అయిన‌ట్లు గ‌తంలో వార్త‌లొచ్చాయి. ఎన్టీఆర్ ఆర్స్ట్ బ్యాన‌ర్ విష‌యంలో ఓ వ్య‌క్తి ప‌ట్ల తార‌క్ తీసుకున్న స్టాండ్ కార‌ణంగా ఈ అంశం తెర‌పైకి వ‌చ్చిన‌ట్లు అప్ప‌ట్లో తార‌క్ అలా స్పందించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అంత క‌రాఖండీగా తార‌క్ ఎప్పుడూ మీడియా ముందు మాట్లాడ‌లేదు.

న‌న్నెవ్వ‌రూ ఆప‌లేరు:

తొలిసారి ఎవ్వ‌రు ఏమ‌నుకున్నా ప‌ర్వాలేద‌న్న‌ట్లు తార‌క్ మాట్లాడ‌టం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ తార‌క్ అలాంటి వ్యాఖ్య‌లు ఇంకే వేదిక‌పై చేయ‌లేదు. తాజాగా నిన్న‌టి రోజున జ‌రిగిన `వార్ 2` ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు ఆశీస్సులున్నంత‌ కాలం న‌న్నెవ్వ‌రూ ఆప‌లేరంటూ తార‌క్ వ్యాఖ్యానించ‌డం మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తార‌క్ ఎన్న‌డు అలా మాట్లాడింది లేదు. తొలిసారి నంద‌మూరి వార‌స‌త్వం.. తాత‌య్య పేరు స్మ‌రించుకుని త‌న‌ని ఎవ్వ‌రూ ఆప‌లేరంటూ వ్యాఖ్యానించ‌డం వెనుక అస‌లు కార‌ణం ఏంటి? అంటూ ప‌రిశ్ర‌మ స‌హా ప్రేక్ష‌కాభిమానుల్లో చ‌ర్చకు దారి తీస్తోంది.