80 ఏళ్ల వయసులో జైలుపాలైన నటుడు
విచారణలో ఆయన ఆ మహిళపై లైంగిక వేధింపులు జరిపినట్టు నిర్ధారణ జరిగింది. దీంతో కోర్టు అతనికి ఏడాది జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది.
By: Tupaki Desk | 5 April 2025 2:00 AM ISTప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న స్వ్కిడ్ గేమ్ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు కొరియన్ యాక్టర్ ఓ యంగ్ సు. ఆయన వయసు 80 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆయన అద్భుతమైన నటనను కనపరిచారని అందరూ ఆయన్నెంతగానో ప్రశంసించారు. అలాంటి టాలెంటెడ్ నటుడికి ఇప్పుడు జైలు శిక్ష పడింది.
అతడిపై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. 2017లో ఆయన ఓ మహిళను బలవంతంగా ఆలింగనం చేసి, ముద్దు పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కోగా, ఏప్రిల్ 3, 2025న సువాన్ జిల్లా కోర్టులో దానిపై తుది తీర్పు వెల్లడైంది. విచారణలో ఆయన ఆ మహిళపై లైంగిక వేధింపులు జరిపినట్టు నిర్ధారణ జరిగింది. దీంతో కోర్టు అతనికి ఏడాది జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది.
గత 50 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న ఓ యోంగ్ సు, ఓ జూనియర్ ఆర్టిస్టును లైంగికంగా వేధించారని, ఆ సంఘటన జరిగినప్పటి నుంచి బాధితురాలు భయంతో జీవిస్తుందని, ఆమెపై దాడి జరిగిన తర్వాత నుంచి పనికి వెళ్లాలంటేనే ఆమె భయపడుతుందని, యాక్టింగ్ మాత్రమే ఆమెకు జీవనాధారమని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
కేసు ఇన్వెస్టిగేషన్ టైమ్ లో తాను చేసిన దాంట్లో ఏ మాత్రం తప్పు లేదని, చేసిన పనికి అసలు పశ్చాతాప పడకుండా తనను తాను సమర్థించుకున్నారు ఆ సీనియర్ నటుడు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఓ యోంగ్ సు మాట్లాడుతూ తన 80 ఏళ్ల జీవితం ఒక్క క్షణంలో కూలిపోయినట్టనిపిస్తుందని కోర్టులో బాధ పడ్డారు.
