Begin typing your search above and press return to search.

22 ఏళ్ల యువ దర్శకురాలి అద్భుతం!

ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు కేవలం 22 ఏళ్ల ప్రాయంలోనే అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కథను వెండితెరపై ఆవిష్కరించారు.

By:  Srikanth Kontham   |   22 April 2026 9:12 AM IST
22 ఏళ్ల యువ దర్శకురాలి అద్భుతం!
X

ప్రతిభకు వయస్సుతో సంబంధం లేదని మ‌రోసారి ప్రూవ్ అయింది. 22 ఏళ్ల యువ దర్శకురాలు కన్నడ , హిందీ భాషల్లో తెరకెక్కిన స్వతంత్ర చిత్రం ప్రతిష్టాత్మకమైన కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. అతి పిన్న వయస్సులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం భారతీయ చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా కన్నడ సినీ వర్గాల్లో గర్వకారణంగా మారింది. ఈ విజయం వర్ధమాన సినీ నటులకు , దర్శకులకు గొప్ప స్ఫూర్తినిస్తోంది.

ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు కేవలం 22 ఏళ్ల ప్రాయంలోనే అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కథను వెండితెరపై ఆవిష్కరించారు.

ఈ సినిమా నేపథ్యం, కథా గమనం , పాత్రల చిత్రణ అంతర్జాతీయ జ్యూరీని మెప్పించడంతో కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్ విభాగంలో చోటు దక్కింది. భారతీయ సంస్కృతిని, సామాజిక అంశాలను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని మలిచిన తీరు అద్భుతమని విశ్లేషకులు కొనియాడుతున్నారు. కన్నడ - హిందీ భాషల కలయికతో రూపొందిన చిత్రం ప్రాంతీయ సరిహద్దులను దాటి ప్రపంచ వేదికపై ప్రదర్శితం కావడం విశేషం. సాధారణంగా పెద్ద బడ్జెట్ చిత్రాలు , అనుభవం ఉన్న దర్శకుల చిత్రాలే ఇలాంటి అంతర్జాతీయ వేదికలకు వెళ్తుంటాయి. కానీ పరిమిత వనరులతో ఓ యువతి సాధించిన విజయమిది.

కంటెంట్ బాగుంటే ప్రపంచం మొత్తం గుర్తిస్తుందని చాటిచెబుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు కూడా అధికశాతం యువకులే కావడం గమనార్హం. కేన్స్‌ వంటి వేదికపై సినిమా ప్రదర్శించబడటం వల్ల అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ల దృష్టి ఈ చిత్రంపై పడే అవకాశం ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. దర్శకురాలు ఎంచుకున్న కథాంశం , ప్రదర్శించిన విధానం పాశ్చాత్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉండటమే ఈ ఎంపికకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

యువ దర్శకురాలు ప్రతిభను కర్ణాటక చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు అభినందిస్తున్నారు. కేన్స్‌ వేదికపై భారతీయ జెండాను ఎగురవేయబోతున్న చిత్ర యూనిట్‌కు అన్ని వైపులా ప్రశంసలు అందుతున్నాయి. భవిష్యత్తులో ఈ యువ దర్శకురాలు మరిన్ని అద్భుతమైన చిత్రాలను రూపొందిస్తాడ‌ని ప్రపంచ సినిమా వేదికపై భారతదేశ కీర్తిని మరింత పెంచుతారని సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు.

ఈ సినిమా పేరు `సెప్టెంబ‌ర్ 21`. క‌రెన్ క్షిత సువ‌ర్ణ ద‌ర్శ‌కులు. మే 16న కేన్స్‌లోని మార్చే డు ఫిలిం విభాగంలో ప్రపంచ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న‌ వృద్ధుడి కథను, ఆ వ్యాధి కేవలం రోగిపైనే కాకుండా వారిని సంరక్షించే కుటుంబ సభ్యులపై చూపే మానసిక ప్రభావాన్ని ఎంతో భావోద్వేగంగా ఆవిష్కరించారు. ప్రియాంకా ఉపేంద్ర, జరీనా వహాబ్ వంటి సీనియర్ నటీమణులు ఇందులో కీలక పాత్రలు పోషించడం విశేషం.