మహేష్ మిస్ అయిన క్లాసిక్.. ఎందుకంటే?
అసలు మొదట్లో డైరెక్టర్ అనుకున్న క్యాస్టింగ్, క్లైమాక్స్ కు, ఇప్పుడు మనం చూస్తున్న సినిమా కథకు చాలా తేడా ఉంది.
By: Tupaki Desk | 4 July 2025 10:27 AM ISTసినీ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలను మరొకరు చేయడం, అలా వదులుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్లు అవడం చాలా కామన్. అయితే ఆ విషయాలు కొన్ని సినిమాలకు వెంటనే బయటికొస్తే మరికొన్ని ఎన్నో ఏళ్ల తర్వాత బయటికొస్తున్నాయి. ఇప్పుడు నాగచైతన్య, సమంత మొదటిసారి కలిసి నటించిన ఏ మాయ చేసావె గురించి ఓ న్యూస్ బయటికొచ్చింది.
ఏ మాయ చేసావే సినిమా రిలీజైన దాదాపు 15 ఏళ్లకు ఆ క్లాసిక్ మళ్లీ రీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఏ మాయ చేసావే డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమా గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏ మాయ చేసావే క్లైమాక్స్ ను మొదట్లో తాను అనుకున్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకున్నారో వెల్లడించారు.
అసలు మొదట్లో డైరెక్టర్ అనుకున్న క్యాస్టింగ్, క్లైమాక్స్ కు, ఇప్పుడు మనం చూస్తున్న సినిమా కథకు చాలా తేడా ఉంది. ఈ సినిమా కోసం ఆయన ముందు అనుకున్న కథను తీయకపోయినా, అతను ఊహించుకున్న క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మహేష్ బాబు అక్క మంజుల కోసం ఓ సినిమాను కమిట్ అయిన గౌతమ్ మీనన్, ఆ సినిమాను మహేష్ ను హీరోగా పెట్టి చేస్తానని చెప్పారట.
అనుకున్నట్టే తాను రాసుకున్న కథను మహేష్ కు చెప్పగా, యాక్షన్ సినిమా చేయాలనుకుంటున్నట్టు చెప్పి గౌతమ్ ఇచ్చిన ఆఫర్ ను మహేష్ సున్నితంగానే తిరస్కరించారట. ఆ తర్వాత టాలీవుడ్ లోని మరో స్టార్ హీరోకు చెప్పగా, మహేష్ చెప్పిన ఆన్సరే అతనూ చెప్పారని, దీంతో ఏ మాయ చేసావేను టాలీవుడ్ లో కొత్తవాళ్లతో చేయాలని డిసైడై, అప్పుడు నాగచైతన్యను లైన్ లోకి తీసుకొచ్చినట్టు గౌతమ్ మీనన్ తెలిపారు.
తాను మొదట అనుకున్న డ్రాఫ్ట్, క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని, హీరో ఉన్న చోటుకు దూరంలో హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది, హీరో తన ఫస్ట్ మూవీ సినిమా షూటింగ్ లో ఉంటాడు. ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తారు. హీరో డల్ గా ఉండటం గమనించిన చిరూ విషయం అడగ్గా, అప్పుడు తన గర్ల్‌ఫ్రెండ్ పెళ్లి గురించి చెప్పడం, ఆ తర్వాత చిరూ ఆ హీరో కోసం ఓ హెలికాప్టర్ అరేంజ్ చేసి, అందులో హీరోయిన్ పెళ్లి చేసుకునే దగ్గరకు వెళ్లడం ఇలా కొత్తగా రాసుకున్నారట గౌతమ్ మీనన్. కానీ కొత్తవారితో చేస్తున్నప్పుడు వారికి తగ్గట్టు కథను, క్లైమాక్స్ ను మార్చానని గౌతమ్ మీనన్ చెప్పారు. కాగా ఏ మాయ చేసావే తమిళ వెర్షన్ లో శింబు- త్రిష నటించగా, తెలుగు వెర్షన్ లో నాగ చైతన్య- సమంత నటించారు. ఈ రెండు వెర్షన్లూ మంచి హిట్లుగా నిలవగా, ఇప్పుడు తెలుగు వెర్షన్ జులై 19న రీరిలీజ్ కానుంది.
