Begin typing your search above and press return to search.

క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న పాన్ ఇండియా స్టార్!

సౌత్ హీరోలంతా ఇప్పుడు 'పాన్ ఇండియా స్టార్స్'గా మారడానికి కృషి చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 July 2024 4:10 AM GMT
క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న పాన్ ఇండియా స్టార్!
X

సౌత్ హీరోలంతా ఇప్పుడు 'పాన్ ఇండియా స్టార్స్'గా మారడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కథానాయకులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ సాధించడం ఒక ఎత్తయితే.. దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. నిజానికి ఏ హీరోకైనా క్రేజ్ ను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడమే అతి పెద్ద ఛాలెంజ్. అయితే ఆ విషయంలో కన్నడ హీరో యష్ వెనుకబడిపోయారనే అనుకోవాలి.

'కేజీఎఫ్' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు రాకింగ్ స్టార్ యష్. 'KGF 2' చిత్రం భారీ వసూళ్లను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇది కన్నడలోనే కాదు, బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లలో కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో శాండిల్ వుడ్ హీరో కాస్తా పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. కానీ సరైన ప్లానింగ్ లేక యశ్ ఆ స్టార్ డమ్ ను క్యాష్ చేసుకోలేకపోయారు.

2022 సమ్మర్ లో 'KGF చాప్టర్ 2' సినిమా థియేటర్లలో రిలీజైంది. తర్వాతి చిత్రాన్ని ప్రకటించడానికి దాదాపు ఏడాదిన్నర సమయం తీసుకున్నారు యష్. అది కూడా ఎవరైనా పాపులర్ పాన్ ఇండియా డైరెక్టర్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటారని అభిమానులు భావించారు. కానీ ఒక షార్ట్ ఫిల్మ్, రెండు సినిమాల అనుభవం ఉన్న గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో 'టాక్సిక్' మూవీని అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.

'టాక్సిక్' చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తామని అనౌన్స్ మెంట్ రోజునే అధికారికంగా ప్రకటించారు. కానీ అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రచారం జరగడం లేదు. సోషల్ మీడియాలో హీరో అభిమానులు ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోడానికి ఆసక్తిగా ఉన్నారు. కానీ దీని గురించి ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా మేకర్స్ సైడ్ నుంచి రావడం లేదు. హీరోయిన్ తో సహా సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలేవీ తెలియడం లేదు.

అలానే బాలీవుడ్ 'రామాయణం' మూవీలో యశ్ భాగం అవుతున్నారు. రాముడిగా రణబీర్ కపూర్, సీతా దేవిగా సాయి పల్లవి నటిస్తుంటే.. రావణాసురుడి పాత్రలో యష్ కనిపించబోతున్నారు. ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రావడం లేదు. ఇలా కన్నడ రాకింగ్ స్టార్ నటిస్తున్న రెండు చిత్రాలూ సైలెంట్ మోడ్ లో ఉండటంతో, గత కొన్నాళ్లుగా మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడా యశ్ గురించిన చర్చలు జరగడం లేదు. దీంతో ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్నారు.

అదే సమయంలో ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా హీరోలు.. తమ స్టార్ డమ్ ను నిలబెట్టుకునే విధంగా భారీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. ఇద్దరు ముగ్గురు అగ్ర దర్శకులను లైన్ లో పెట్టుకుంటున్నారు. ప్రభాస్ అయితే రెండేళ్ల గ్యాప్ లో నాలుగు పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆల్రెడీ మరో నాలుగు చిత్రాలకు కమిట్ అయ్యారు. కానీ యష్ మాత్రం మరీ స్లోగా వెళ్తున్నారు. మిగతా హీరోల మాదిరిగా యాక్టీవ్ గా ఉండటం లేదు.

ఇదిలాగే కొనసాగితే రాబోయే చిత్రాల్లో KGF హీరోని ఇతర భాషా ప్రేక్షకులు గుర్తించలేని పరిస్థితి రావొచ్చు. అది పరోక్షంగా ఆయన మార్కెట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా యశ్ తన పాన్ ఇండియా స్టార్ డమ్ ను క్యాష్ చేసుకునే విధంగా భారీ ప్లానింగ్ తో రావాలని అభిమానులు భావిస్తున్నారు. సినిమా సినిమాకి ఎక్కువ టైమ్ తీసుకోకుండా.. క్రేజ్ ఉన్నప్పుడే వీలైనంత త్వరగా మూవీస్ చెయ్యాలని కోరుకుంటున్నారు.