Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు య‌ష్ స్టార్‌డ‌మ్‌ని ఒప్పుకున్న హిందీ స్టార్

అంతేకాకుండా ఈ సినిమాలో సీత పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేయడంపై కూడా రణబీర్ ప్రశంసలు కురిపించారు.

By:  Sivaji Kontham   |   4 April 2026 12:32 AM IST
ఎట్ట‌కేల‌కు య‌ష్ స్టార్‌డ‌మ్‌ని ఒప్పుకున్న హిందీ స్టార్
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఉత్తరాది - దక్షిణాది మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పుడు సౌత్ స్టార్ల గొప్పతనాన్ని అంగీకరించడానికి బాలీవుడ్ ప్రముఖులు అంత సులభంగా ముందుకు వచ్చేవారు కాదు. దక్షిణాది దర్శకులు లేదా స్టార్లు సంచలన విజయాలు నమోదు చేసినా.. వారిని ప్రశంసించే విషయంలో హిందీ నటులు కొంత తటపటాయించేవారు. సందీప్ రెడ్డి వంగా వంటి ప్రతిభావంతులైన దర్శకులను కూడా ఏదో ఒక కోణంలో విమర్శించేందుకే వారు మొగ్గు చూపేవారు. కనీసం ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు రావడానికి కూడా ఆసక్తి చూపని బాలీవుడ్ స్టార్లు.. ఇప్పుడు మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా పాన్ ఇండియా మార్కెట్ కోసం దక్షిణాదికి క్యూ కడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ హిందీ నటుడు దక్షిణాది ట్యాలెంటెడ్ హీరో స్టార్‌డమ్‌ను బహిరంగంగా కీర్తించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా బాలీవుడ్ హీరోలు తమ ఇమేజ్ దెబ్బతింటుందేమో అన్నట్టుగా ఇతర హీరోలను పొగడటానికి వెనుకాడతారు. కానీ హిందీ సూప‌ర్ స్టార్ రణబీర్ కపూర్ మాత్రం రాకింగ్ స్టార్ యష్ విషయంలో చాలా నిజాయితీగా స్పందించారు. యష్‌కు ఉన్న అసాధారణమైన స్టార్‌డమ్‌ను ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించడమే కాకుండా.. ఒక అంతర్జాతీయ వేదికపై ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.

నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `రామాయణం`సినిమాకు సంబంధించి లాస్ ఏంజిల్స్ - న్యూయార్క్ నగరాల్లో జరిగిన అంతర్జాతీయ ఈవెంట్లలో రణబీర్ కపూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రను పోషిస్తున్న యష్ గురించి మాట్లాడుతూ.. `రావణుడి పాత్రకు అవసరమైన గంభీరమైన వ్యక్తిత్వం (ఆరా) , పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ యష్‌కు పుష్కలంగా ఉన్నాయి`` అని కొనియాడారు. యష్ స్టార్‌డమ్ ఈ సినిమాకు పెద్ద బలం అని అంగీకరించడం విశేషం.

అంతేకాకుండా ఈ సినిమాలో సీత పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేయడంపై కూడా రణబీర్ ప్రశంసలు కురిపించారు. సాయి పల్లవిని సీత గెటప్‌లో చూసిన మొదటి రోజే త‌న‌ కంటే మెరుగైన నటి ఈ పాత్రకు ఉండరని తనకు, దర్శకుడికి అర్థమైందని ఆయన తెలిపారు. దాదాపు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి.. రెండవ భాగం 2027 దీపావళికి విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారు.

ఇటీవల విడుదలైన టీజర్‌లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా రాజసం ఉట్టిపడేలా కనిపించగా.. టీజర్ ముగింపులో యష్ రావణుడిగా పుష్పక విమానం వైపు నడుస్తున్న గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఇందులో సన్నీ డియోల్ ఆంజ‌నేయుడిగా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఒక పక్కా గ్లోబల్ విజన్‌తో నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. రామాయణం భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ పటంలో మరో మెట్టు ఎక్కించాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు.