Begin typing your search above and press return to search.

అగ్ర నిర్మాణ సంస్థ 'యాంటీ హిందూ' క్యాంపెయిన్?

ఐదు ద‌శాబ్ధాల సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన సినీనిర్మాణ సంస్థ‌ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించింది.

By:  Sivaji Kontham   |   14 Jan 2026 10:38 AM IST
అగ్ర నిర్మాణ సంస్థ యాంటీ హిందూ క్యాంపెయిన్?
X

ఐదు ద‌శాబ్ధాల సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన సినీనిర్మాణ సంస్థ‌ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించింది. స్పై యూనివ‌ర్శ్ ల పేరుతో భారీ ఫ్రాంఛైజీల కోసం వంద‌ల కోట్ల పెట్టుబ‌డులు పెడుతున్న‌ సంస్థ ఇది. అయితే య‌ష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన కొన్ని సినిమాలు హిందూ వ్య‌తిరేక భావ‌న‌ల‌ను నూరిపోస్తున్నాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ముఖ్యంగా 2024 నుండి 2026 ప్రారంభం వరకు కొన్ని సినిమాలు, ప్రకటనలు ఈ త‌ర‌హా వివాదానికి కారణమయ్యాయి. ఇప్పుడు వైఆర్ఎఫ్ నిర్మాణంలో రాణీ ముఖ‌ర్జీ న‌టించిన మ‌రో సినిమా కూడా అదే బాట‌లో యాంటి హిందూ ప్రొప‌గండాతో ఉంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

య‌ష్ రాజ్ ఫిలింస్ వివాదాస్ప‌ద చిత్రాల వివ‌రాల్లోకి వెళితే... . ఈ బ్యాన‌ర్ నిర్మించిన 'మహరాజ్' చిత్రంపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఈ చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. 1862 నాటి 'మహరాజ్ లైబెల్ కేసు' ఆధారంగా తీసిన ఈ సినిమాలో హిందూ మతానికి చెందిన 'పుష్టిమార్గ్' సంప్రదాయాన్ని, గురువులను కించపరిచేలా చూపించారని హిందూ సంఘాలు ఆరోపించాయి.

గుజరాత్ హైకోర్టు ఈ సినిమా విడుదలపై మొదట స్టే విధించినా, ఆ తర్వాత కొన్ని మార్పులతో స్ట్రీమింగ్‌కు అనుమతి ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో #బాయ్ కాట్ YRF హాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది.

య‌ష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న భారీ ఫ్రాంఛైజీ చిత్రాలైన‌ పఠాన్, టైగర్ 3, వార్ 2 వంటి సినిమాల్లో పాకిస్థాన్ ఏజెంట్లను (ISI) మంచివారిగా చూపించడం.. అదే స‌మ‌యంలో భారత్-పాక్ మధ్య శాంతిని కోరుకునే కథలతో సినిమాలు తీయ‌డంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ, ఇతర దేశాలకు లేదా మతాలకు అనుకూలంగా కథలు రాస్తున్నారని , 'యాంటీ-హిందూ' ముద్ర వేస్తున్నారని ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌పై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల విడుదలైన ధురందర్ చాలా వాస్తవికంగా, దేశభక్తిని ప్రతిబింబించేలా ఉంది. కానీ య‌ష్ రాజ్ ఫిలింస్ సినిమాల్లో మాత్రం ఆ స్పూర్తి లేదని నెటిజన్లు పోల్చి చూస్తున్నారు.

ఈ జ‌న‌వ‌రిలో మ‌ర్ధాని 3 ఇదే బ్యాన‌ర్ నుంచి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జనవరి 30న‌ విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా టీజర్, పోస్టర్ విషయంలో కూడా కొన్ని మతపరమైన అంశాలను జోడిస్తున్నారనే విమర్శలు నెట్టింట మొదలయ్యాయి. దేవ‌త‌ల‌ను పూజించే దేశంలో ప్ర‌తి వారం వేలాది మంది కుమార్తెలు మిస్స‌యిపోతున్నారు! అనే సంభాష‌ణ హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ తీసింద‌ని టీజ‌ర్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. హిందువుల‌ను ఈ బ్యాన‌ర్ విల‌న్లుగా చూపెడుతోంద‌ని కూడా కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. యాంటి హిందూ ప్రొప‌గండాతో ఈ చిత్రం వ‌స్తోంద‌ని య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్ ని విమ‌ర్శిస్తున్నారు.

యశ్ రాజ్ ఫిల్మ్స్ గతంలో `ధర్మపుత్ర` వంటి సినిమాలతో మత సామరస్యాన్ని చాటినా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కథల ఎంపికలో ఈ సంస్థ అజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమర్శలు ఎదుర‌వుతున్నాయి. ముఖ్యంగా చారిత్రక క‌థాంశాల‌ను, మ‌తాల‌కు సంబంధించిన‌ సున్నితమైన అంశాలను డీల్ చేసేటప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని స‌ద‌రు బ్యాన‌ర్ ని హెచ్చ‌రిస్తున్నారు. అయితే నెటిజ‌నుల్లో ఒక వ‌ర్గం య‌ష్ రాజ్ ఫిలింస్ ని కూడా స‌మ‌ర్థిస్తున్నారు. వేలాది సినిమాల్లో హిందువులే విల‌న్లుగా ఉన్నారు. సినిమాల‌కు, సృజ‌నాత్మ‌క ప్ర‌క్రియ‌కు మ‌తం రంగు పుల‌మ‌కూడ‌ద‌ని కూడా కొంద‌రు య‌ష్ రాజ్ బ్యాన‌ర్ కి మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నారు.