Begin typing your search above and press return to search.

అగ్ర నిర్మాణ సంస్థ‌లో అస‌లేం జ‌రుగుతోంది?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న `టైగర్ వర్సెస్ పఠాన్` ప్రాజెక్ట్ ప్రస్తుతానికి అటకెక్కినట్లే కనిపిస్తోంది.

By:  Sivaji Kontham   |   14 Feb 2026 6:00 PM IST
అగ్ర నిర్మాణ సంస్థ‌లో అస‌లేం జ‌రుగుతోంది?
X

బాలీవుడ్ ని ద‌శాబ్ధాల పాటు ఏలిన అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్, త‌న ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో స‌రైన విజ‌యాల్లేక సంస్థ మెజారిటీ వాటాను బిజినెస్‌మేన్ ఆధార్ పూన‌వ‌ల్లాకు విక్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఎన్నో క్లాసిక్ హిట్ చిత్రాల‌ను అందించిన గొప్ప నిర్మాణ సంస్థ వేరొక‌రికి ఛేజిక్క‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే మారిన ట్రెండ్ లో ఇదే ప‌రిస్థితి ఇత‌ర అగ్ర నిర్మాణ సంస్థ‌ల‌కు ఎదుర‌వుతుందా? అన్న చ‌ర్చ సాగుతోంది.

ఆ స్థాయి స‌మ‌స్య లేదు కానీ, యశ్‌రాజ్ ఫిల్మ్స్ కూడా ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసించిన ఈ అగ్ర నిర్మాణ సంస్థ వరుస వైఫల్యాలు, ఆర్థిక సమీకరణాల వల్ల భారీ ప్రాజెక్టులను నిలిపివేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న `టైగర్ వర్సెస్ పఠాన్` ప్రాజెక్ట్ ప్రస్తుతానికి అటకెక్కినట్లే కనిపిస్తోంది. ప‌రిశ్ర‌మ‌లో 50ఏళ్లుగా మ‌నుగ‌డ‌లో ఉన్న ఈ నిర్మాణ సంస్థ తాజా ప‌రిస్థితి నిజంగా షాకిస్తోంది.

అయితే య‌ష్ రాజ్ బ్యాన‌ర్ ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. మారిన బ‌డ్జెట్లు, కాస్ట్ ఫ్యాక్ట‌ర్ నిజంగా నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. షారూఖ్ ఖాన్ -సల్మాన్ ఖాన్‌లను ఒకే స్క్రీన్‌పై చూపించడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు హీరోలు కూడా వందల కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు, సినిమా రెవెన్యూలో భారీ వాటాను డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ లెక్కలు నిర్మాత ఆదిత్య చోప్రాకు పెను భారంగా మారాయి. భారీ వ్యయంతో సినిమా తీయడం ఒకెత్తు అనుకుంటే, భారీ పారితోషికాలు చెల్లించ‌డం మ‌రొక ఎత్తు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కానిది అని భావించిన యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిలిపేసింద‌ని తెలుస్తోంది.

అయితే య‌ష్‌రాజ్ ఫిలింస్ తాజా నిర్ణ‌యంపై డిజాస్ట‌ర్ మూవీ `వార్ 2` ప్ర‌భావం ఉంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. వైఆర్ఎఫ్ గర్వంగా చెప్పుకునే స్పై యూనివర్స్ చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయి. ముఖ్యంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన `వార్ 2` ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా, నిర్మాణ సంస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు అలియా భట్ నటిస్తున్న `ఆల్ఫా` కూడా వరుస వాయిదాలతో సతమతమవుతోంది. ఈ వరుస పరాజయాలు ఆదిత్య చోప్రాను ఆత్మరక్షణలో పడేశాయని కూడా చెబుతున్నారు.

మ‌రోవైపు హృతిక్ రోషన్‌తో కలిసి `క్రిష్ 4`ని నిర్మించాలని వైఆర్ఎఫ్ ప్లాన్ చేసింది. అయితే బడ్జెట్ మేటర్స్ విషయంలో హృతిక్, వైఆర్ఎఫ్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 500 కోట్ల బ‌డ్జెట్ కావాల‌ని హృతిక్ అడుగుతుంటే, 250 కోట్ల‌తో స‌రిపెట్టాల‌ని య‌ష్ రాజ్ బ్యాన‌ర్ వాదిస్తోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. దీనికి తోడు సూపర్ హీరో సినిమాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని భావించిన నిర్మాణ సంస్థ ఆ ప్రాజెక్ట్ నుండి కూడా తప్పుకున్న‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. దీంతో హృతిక్, వైఆర్ఎఫ్ ప్రస్తుతానికి విడిపోయారనేది ఇన్ సైడ్ టాక్.

సల్మాన్, షారూఖ్‌ల వంటి అగ్ర హీరోలతో సినిమాలు తీయడం అంటే మార్కెట్ పరంగా అది పెద్ద అడ్వాంటేజ్ అయినా కానీ, అంత పెద్ద హీరోలు డిమాండ్ చేసే రెమ్యూనరేషన్లు సినిమా బడ్జెట్‌ను దాటిపోయి కాస్ట్ పెయిల్యూర్ గా మారుతున్నాయి. ఒకవేళ సినిమా హిట్ అయినా.. నిర్మాతలకు మిగిలే లాభం తక్కువగా ఉండటంతో వైఆర్ఎఫ్ తన స్ట్రాటజీని మార్చుకోవాలని చూస్తోంది.