'టాక్సిక్' స్పెషల్ గ్లింప్స్.. కండో*మ్ యాడ్ లా ఉందంటూ ట్రోల్స్..!
మరోవైపు సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు 'టాక్సిక్' గ్లింప్స్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది ఆల్కహాల్ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ మాదిరిగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.
By: Tupaki Desk | 9 Jan 2025 3:38 AM GMTకన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న సినిమా "టాక్సిక్". ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అనేది దీని ట్యాగ్ లైన్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. యష్ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, బుధవారం (జనవరి 8) చిత్ర బృందం ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. అయితే ఈ గ్లింప్స్ వీడియోకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.
'టాక్సిక్' బర్త్ డే పీక్ పేరుతో రిలీజైన ఈ వీడియోలో.. యశ్ ఒక వింటేజ్ కారులో నుంచి దిగి, స్టైల్ గా సిగార్ వెలిగించుకుని ఓ పబ్ లోకి నడుచుకుంటూ వెళ్తాడు. లోపలికి వెళ్ళి అక్కడ ఓ విదేశీ అమ్మాయిని పియానో మీద కూర్చోబెట్టి, ఆమెపై మందు పోస్తూ రొమాన్స్ చేస్తాడు. ఈ గ్లింప్స్ లో ఇంతకుమించి చెప్పుకోడానికి ఏమీ లేదు. యశ్ స్టైలిష్ అండ్ స్టన్నింగ్ లుక్, విజువల్స్, బీజీఎం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్లు వస్తున్నాయి.
KGF సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'టాక్సిక్' పై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే కేజీఎఫ్ రేంజ్ లో భారీ ఎలివేషన్స్ తో, యాక్షన్ కట్ తో గ్లింప్స్ ఉంటుందని అభిమానులు భావించారు. కానీ ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఏదో పేరుకి హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉందని అంటున్నారు కానీ, ఎక్కువ శాతం ఫ్యాన్స్ కి నిరాశ కలిగించిందనే మాట వాస్తవం.
మరోవైపు సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు 'టాక్సిక్' గ్లింప్స్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది ఆల్కహాల్ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ మాదిరిగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే ఇది ఏదో కండో*మ్ యాడ్ లాగా ఉందంటూ ఎడిట్ చేసిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఏదో ఆశిస్తే, ఇంకేదో వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద KGF కు మించిన కంటెంట్ ను ఊహిస్తే, దానికి ఏమాత్రం మ్యాచ్ చేయలేని గ్లింప్స్ ను వదిలారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
'టాక్సిక్' అనేది రెట్రో ఎలిమెంట్స్ తో కూడిన గ్యాంగ్‌స్టర్ స్టోరీ అనిపిస్తోంది. గోవా బ్యాక్ డ్రాప్ లో వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతోందని టాక్ కూడా ఉంది. డ్రగ్స్, మాఫియా నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా ఉంటుందనే క్లారిటీ అయితే వచ్చింది. కాకపోతే ఇప్పటి వరకూ భారీ సినిమాలు చేయని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్.. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను ఎలా హ్యాండిల్ చేస్తుందనేదే ఆసక్తికరంగా మారింది.
'టాక్సిక్' మూవీలో యష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. నయనతార, హ్యూమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్స్ క్రియేషన్స్ బ్యానర్స్ పై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2025లోనే సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.