Begin typing your search above and press return to search.

రణబీర్ కు లేని హోదా యశ్ మీద ఎందుకు?

యశ్ తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కేవలం ఒక సినిమా చేసి వెళ్ళిపోవడం కాకుండా, ఆ ప్రాజెక్ట్ క్వాలిటీలో తన పాత్ర ఉండాలని కోరుకుంటున్నారు.

By:  M Prashanth   |   2 April 2026 10:00 PM IST
రణబీర్ కు లేని హోదా యశ్ మీద ఎందుకు?
X

పాన్ ఇండియా స్టార్ యశ్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటిన ఈ కన్నడ హీరో, ఇప్పుడు బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణ’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో యశ్ రావణుడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆయన కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాణంలోనూ భాగస్వామిగా మారుతుండటం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

నెక్స్ట్ హీరోగా రానున్న సినిమా ‘టాక్సిక్’ విషయంలో కూడా యశ్ కో ప్రొడ్యూసర్ కార్డ్ తీసుకున్నారు. ఇప్పుడు అదే పద్ధతిని ‘రామాయణ’కు కూడా వర్తింపజేస్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా అగ్ర హీరోలు ఒక సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. కానీ యశ్ మాత్రం రూటు మార్చి లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందాలు చేసుకుంటున్నారనే చర్చ నడుస్తోంది. తన ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’ బ్యానర్‌పై నమిత్ మల్హోత్రాతో కలిసి ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న రణబీర్ కపూర్ కు లేని నిర్మాత హోదా యశ్ కు దక్కడం వెనుక ఉన్న మతలబు ఏంటనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో రణబీర్ కంటే యశ్ కు క్రేజ్ ఎక్కువే. రామాయణం లాంటి కథను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకెళ్లడంలో యశ్ మార్కెట్ వాల్యూని మేకర్స్ వాడుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కేవలం నటుడిగానే పరిమితం కాకుండా, ప్రాజెక్టును ముందుకు నడిపించే ఒక కీలక భాగస్వామిగా ఆయనకు ఈ క్రెడిట్ ఇచ్చినట్లు సమాచారం.

ఇది ఆయన ఎదుగుదలకు నిదర్శనమని కొందరు అంటుంటే, రణబీర్ లాంటి స్టార్ కి ఇది దక్కకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యశ్ తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కేవలం ఒక సినిమా చేసి వెళ్ళిపోవడం కాకుండా, ఆ ప్రాజెక్ట్ క్వాలిటీలో తన పాత్ర ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే నిర్మాణ పర్యవేక్షణలో కూడా భాగమవుతున్నారని తెలుస్తోంది.

‘రామాయణ’ లాంటి భారీ బడ్జెట్ తో కూడిన సినిమాలో నిర్మాతగా మారడం అంటే అది మామూలు విషయం కాదు. నటుడిగా ఎంత పారితోషికం తీసుకుంటున్నారనే దానికంటే, ఒక పార్ట్‌నర్‌గా ఆయనకున్న పట్టు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. హాలీవుడ్ సంస్థ ‘డిఎన్ఈజీ’తో యశ్ చేతులు కలపడం వల్ల సినిమాకు విదేశీ మార్కెట్ లో కూడా మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.

సాయి పల్లవి, సన్నీ డియోల్ లాంటి ఇతర స్టార్స్ ఉన్నప్పటికీ, యశ్ కి ప్రాధాన్యత పెరగడం వెనుక ఆయనకున్న బిజినెస్ మైండ్ సెట్ కూడా ఒక కారణం కావొచ్చు. సినిమా సక్సెస్ అయితే లాభాల్లో భారీ వాటా దక్కుతుంది కాబట్టి, ఇది ఒక రకమైన స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పొచ్చు. రణబీర్ కపూర్ కేవలం నటనపైనే దృష్టి పెట్టగా, యశ్ మాత్రం బిజినెస్ యాంగిల్‌లో కూడా రాణిస్తున్నారు. రామాయణ పార్ట్-1 దీపావళి 2026లో రాబోతొంది. మరి ఈ కో-ప్రొడ్యూసర్ ప్లాన్ బాక్సాఫీస్ దగ్గర ఆయనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.