Begin typing your search above and press return to search.

సినిమాలే కాదు.. ఆస్తుల్లోనూ పాన్ ఇండియా ప్లాన్!

దీంతో అలీబాగ్‌లో ఇప్పటికే ఆస్తులు కలిగిన స్టార్‌ల జాబితాలో యష్ కూడా చేరిపోయారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 Jun 2026 10:00 PM IST
సినిమాలే కాదు.. ఆస్తుల్లోనూ పాన్ ఇండియా ప్లాన్!
X

ప్ర‌ముఖ సెల‌బ్రిటీల‌కు ఫేవ‌రెట్ డెస్టినేష‌న్‌గా మారిన మహారాష్ట్రలోని అలీబాగ్ ఇప్పుడు మరో స్టార్ పేరును తన జాబితాలో చేర్చుకుంది. బాలీవుడ్ దిగ్గజాలు, క్రికెట్ ప్రముఖులు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన ఈ కోస్టల్ హాట్‌స్పాట్‌లో తాజాగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా అడుగుపెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తన భార్య రాధికా పండిట్‌తో కలిసి యష్ రూ.24 కోట్ల విలువైన ప్రీమియం బీచ్‌ఫ్రంట్ భూమిని కొనుగోలు చేసినట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో అలీబాగ్‌లో ఇప్పటికే ఆస్తులు కలిగిన స్టార్‌ల జాబితాలో యష్ కూడా చేరిపోయారు.

బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, రాయగడ్ జిల్లా అలీబాగ్ తాలూకాలోని కమత్ గ్రామంలో ఉన్న రెండు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమి ముక్కలను యష్ దంపతులు కొనుగోలు చేశారు. సముద్రానికి ఆనుకుని ఉన్న ఈ ప్రాపర్టీ మొత్తం సుమారు 5,289 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. తూర్పు వైపు గ్రామీణ రహదారి, పడమర వైపు సముద్ర తీరాన్ని ఆనుకుని ఉండటంతో ఈ భూమికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా కిహీమ్ బీచ్‌కు సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం గత కొన్నేళ్లుగా సెలబ్రిటీల పెట్టుబడులకు కేంద్రంగా మారింది. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొణె, క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి ప్రముఖులు ఈ ప్రాంతంలో విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే లిస్ట్ లో యష్ చేరడం ఆయన ఫైనాన్షియ‌ల్ ప్లానింగ్ పై కూడా ఆసక్తిని పెంచుతోంది.

ఇక సినిమాల పరంగా చూస్తే యష్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉన్నారు. ఒకవైపు భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ సినిమా, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న రామాయణ ప్రాజెక్ట్‌తో ఆయన బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కోట్ల రూపాయల విలువైన కోస్టల్ ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టడం ఆయన ఫ్యూచ‌ర్ ఫైనాన్షియ‌ల్ ప్లానింగ్ గా భావిస్తున్నారు.

ముఖ్యంగా అలీబాగ్ గత కొన్నేళ్లుగా ముంబైకి సమీపంలో ఉన్న లగ్జరీ రియల్ ఎస్టేట్ హబ్‌గా వేగంగా ఎదుగుతోంది. సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్స్, హై నెట్‌వర్త్ ఉన్న‌ వ్యక్తులు ఈ ప్రాంతాన్ని సెకండ్ హోమ్ డెస్టినేషన్‌గా ఎంచుకుంటుండటంతో భూముల విలువలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యష్ చేసిన పెట్టుబడి కేవలం వ్యక్తిగత అవసరాల కోసమే కాకుండా ఫ్యూచ‌ర్ వాల్యూని దృష్టిలో పెట్టుకున్న స్ట్రాట‌జిక్ డెసిష‌న్‌గా కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా రంగంలో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లోనూ ప్రముఖ సెలబ్రిటీల సరసన నిలవడం విశేషంగా మారింది.