Begin typing your search above and press return to search.

త‌ల్లైనా ఆ హీరోయిన్ ఇప్ప‌టికీ అమ్మ కూచీనే!

సినీ పరిశ్రమలో కథానాయికల ప్రయాణం వెనుక వారి తల్లుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది.

By:  Srikanth Kontham   |   5 May 2026 1:07 PM IST
త‌ల్లైనా ఆ హీరోయిన్ ఇప్ప‌టికీ అమ్మ కూచీనే!
X

సినీ పరిశ్రమలో కథానాయికల ప్రయాణం వెనుక వారి తల్లుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో కూతురిని వెన్నంటి ఉంటూ షూటింగ్ స్పాట్‌లలో వారికి రక్షణగా తోడుగా నిలిచే తల్లులను తరచుగా చూస్తుంటాం. అయితే హీరోయిన్ ఒక స్థాయికి చేరుకున్నాక లేదా వివాహం చేసుకున్న తర్వాత సాధారణంగా మదర్ సపోర్ట్' అనేది ఇంటికే పరిమితమవుతుంది. కానీ బాలీవుడ్ నటి యామీ గౌతమ్ విషయంలో మాత్రం ఇది పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. తాను తల్లిగా మారినా? ఇప్పటికీ తన తల్లికి అమ్మకూచీనే అని గర్వంగా చెబుతోంది.

యామీ గౌతమ్ వృత్తిపరమైన బాధ్యతలను - వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సమర్థవంతంగా బ్యాలెన్స్ చేయగలు గుతున్నారంటే? దానికి ప్రధాన కారణం ఆమె తల్లి అని అంటున్నారు. సాధారణంగా నటీమణులు పెళ్లి చేసుకున్న తర్వాత వారి తల్లుల ప్రమేయం తగ్గుతుంది. కానీ యామీ గౌతమ్ విషయంలో ఆమె తల్లి ఇల్లు, పిల్లల బాధ్యతలతో పాటు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఈ బలమైన పునాది ఉండటం వల్లే తాను కెరీర్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా కొన‌సాగుతున్నానంది. చాలామంది హీరోయిన్లు తల్లులు తమ కూతుళ్లు పెద్ద స్టార్స్‌ అయ్యే వరకూ మాత్రమే మేనేజర్లుగా , గార్డియన్లుగా వ్యవహరిస్తారు. కానీ యామీ గౌతమ్ తల్లి మాత్రం మానసిక స్థైర్యంగా మారారు.

షూటింగ్ షెడ్యూల్స్ వల్ల బిజీగా ఉన్న సమయంలో ఇంటి బాధ్యతలను తల్లి భుజాన వేసుకోవడం వల్లే తాను నటనపై పూర్తి దృష్టి పెట్టగలుగుతున్నానని యామీ కృతజ్ఞతా భావం వ్యక్తం చేసింది. ఇది కేవలం సహాయం మాత్రమే కాదని ఒక తల్లి తన బిడ్డపై చూపే అంతులేని ప్రేమకు నిదర్శనమని అంటోంది. ఒక మహిళ తన కెరీర్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలంటే కుటుంబ మద్దతు ఎంత అవసరమో యామీ మాటలు ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమ వంటి సవాలుతో కూడిన రంగంలో ఇంటి దగ్గర నమ్మకమైన వ్యక్తులు ఉన్నప్పుడే ప్రశాంతంగా పని చేయగలుగుతారు.

యామీ తల్లి ఆమెకు కేవలం తల్లిగానే కాకుండా మంచి స్నేహితురాలిగా, మార్గదర్శిగా ఉంటూ ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తున్నారు. ఈ బంధం తనను మరింత బాధ్యతాయుతమైన వ్యక్తిగా మార్చిందని తెలిపారు. నేటి తరం మహిళలకు యామీ గౌతమ్ స్ఫూర్తిగా నిలుస్తుంది. వివాహం, మాతృత్వం అనేవి కెరీర్‌కు అడ్డంకులు కాదని కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చని నిరూపిస్తుంది. తల్లిగా కొత్త ప్రయాణాన్ని ఆస్వాదిస్తూనే సినిమాల్లోనూ వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతుంది. తల్లి ఇచ్చే భరోసాతో యామీ గౌతమ్ సినీ ప్రయాణంలో మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అమ్మ ప్రేమ ముందు ఎంతటి స్టార్‌డమ్ అయినా తక్కువేనని ఈ అమ్మకూచీ మరోసారి చాటి చెప్పింది.