టాప్ హీరోయిన్స్ పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్పు!
బాలీవుడ్ లోని కొందరు అగ్ర కథానాయికలు తమ భర్తల ఇంటి పేరును తమ ఇంటి పేరుగా మార్చుకోవడం, దానికి కట్టుబడి ఉండడం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది.
By: Tupaki Desk | 13 Jun 2025 9:30 AM ISTసనాతన భారతదేశం చాలా ఎదుగుతోంది. ముఖ్యంగా మగువ విషయంలో చాలా మార్పులు, పర్యవసానాలు స్పష్ఠంగా కనిపిస్తున్నాయి. ఈ అధునాతన సమాజంలో పెళ్లి తర్వాత భర్త ఇంటి పేరు ఆడపిల్ల ఇంటి పేరు అవుతుందా? .. ఇది ఇటీవలి కాలంలో చాలా పెద్ద చర్చ. అసలు ఆడా మగా సమానం అని భావిస్తున్నప్పుడు, ఆడపిల్లకు తండ్రి ఆస్తిలో సగం వాటా ఉన్నప్పుడు ఈ మార్పు దేనికో అర్థం కాదు.
అయితే అధునాతన సమాజంలో, కోట్లాది రూపాయల పారితోషికాలు అందుకునే ఒక ధనిక వర్గంలో ఇప్పటికీ భర్త ఇంటి పేరును మగువ తన ఇంటి పేరుగా మార్చుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. ఇంకా ఇలాంటి సాంప్రదాయం భారతదేశంలో మిగిలి ఉంది.. హిందూ సాంప్రదాయాలు ఇంకా మారలేదని నిరూపణ అవుతోంది.
బాలీవుడ్ లోని కొందరు అగ్ర కథానాయికలు తమ భర్తల ఇంటి పేరును తమ ఇంటి పేరుగా మార్చుకోవడం, దానికి కట్టుబడి ఉండడం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. రణ్‌బీర్‌తో వివాహం తర్వాత అలియా భట్ చట్టబద్ధంగా 'అలియా కపూర్' అయ్యారు. ఈ విషయం ఇటీవల కేన్స్ 2025 ఉత్సవాల్లో నిరూపణ అయింది. ఆలియా రెడ్ కార్పెట్ కి వెళ్లే సమయంలో అక్కడ 'ఆలియా కపూర్' అనే వెల్ కం బోర్డ్ దర్శనమిచ్చింది. రణ్‌బీర్ కపూర్‌తో వివాహం తర్వాత ఆలియా చట్టబద్ధంగా తన పేరును మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆలియా తాజా బ్లాగ్‌లో కూడా ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. హోటల్ నుండి వచ్చేప్పుడు స్వాగత నోట్‌లో 'డియర్ ఆలియా కపూర్' అని రాసి ఉంది. దీనిని బట్టి తన పేరును అధికారికంగా అలియా భట్ నుండి ఆలియా కపూర్‌గా మార్చుకుందని భావించాలి.
ఆలియా గతంలోను తన భర్త ఇంటిపేరు రణబీర్ కపూర్‌ను స్వీకరించాలని .. కపూర్‌ను తన పేరుకు జోడించాలనే కోరికను వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పెళ్లి తర్వాత ఇంకా ఎవరెవరు తమ ఇంటి పేరును మార్చుకున్నారు? అన్నది చూస్తే, ఐశ్వర్య రాయ్ తన పేరును ఐశ్వర్య రాయ్ బచ్చన్‌గా మార్చుకున్నారు. ఈ మార్పు సినిమా క్రెడిట్‌లు, అధికారిక పత్రాలలో కూడా ప్రతిబింబిస్తుంది. ఈ జాబితాలో తదుపరిది కరీనా కపూర్. బెబో తన భర్త ఇంటిపేరు సైఫ్ అలీ ఖాన్‌ను స్వీకరించి అధికారికంగా కరీనా కపూర్ ఖాన్ అయ్యారు.
ఆనంద్ అహుజాతో వివాహం తర్వాత సోనమ్ కపూర్ తన పేరును ఇన్‌స్టాగ్రామ్‌లో చట్టపరమైన పత్రాలలో సోనమ్ కపూర్ అహుజాగా మార్చుకుంది. ప్రియాంక చోప్రా జోనాస్‌ను చేర్చడానికి అధికారికంగా తన పేరును మార్చుకుంది. ప్రతి సినిమా పోస్టర్‌లో, టాబ్లాయిడ్‌లలో ప్రతిచోటా కనిపిస్తుంది. శిల్పా శెట్టి కూడా తన భర్త రాజ్ కుంద్రా ఇంటిపేరును చట్టబద్ధంగా స్వీకరించి శిల్పా శెట్టి కుంద్రాగా మారింది. జెనీలియా కూడా చట్టబద్ధంగా తన పేరును మార్చుకుంది. ఇప్పుడు జెనీలియా దేశ్‌ముఖ్ అని పిలుస్తున్నారు. ఇంటర్నేషనల్ ఈవెంట్లలోను వీళ్ల పేర్లను భర్త ల ఇంటి పేరుతో పిలుస్తున్నారు. ఈ కథానాయికలంతా ఫ్యాషన్ ప్రపంచపు రాణులు. పోష్ కల్చర్ లో భాగం. కానీ ఇప్పటికీ భర్తల్ని గౌరవించడం, వారి ఇంటి పేర్లను తమ ఇంటి పేరుగా భావించడం నేటితరంలో చర్చకు వస్తోంది.
