Begin typing your search above and press return to search.

పుష్ప ఫేం కేశవ అరెస్టు.. ఏం తప్పు చేశాడంటే?

బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన పుష్ప మూవీ గురించి తెలిసిందే. ఈ సినిమా మొత్తాన్ని నడిపించే క్యారెక్టర్ కేశవ

By:  Tupaki Desk   |   7 Dec 2023 4:00 AM GMT
పుష్ప ఫేం కేశవ అరెస్టు.. ఏం తప్పు చేశాడంటే?
X

బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన పుష్ప మూవీ గురించి తెలిసిందే. ఈ సినిమా మొత్తాన్ని నడిపించే క్యారెక్టర్ కేశవ. పుష్ప స్నేహితుడు కేశవ పాత్రే.. హీరో గురించి.. అతడి ప్రస్థానం గురించి చెబుతూ ఉంటుంది. ఈ సినిమాతో కేశవ పాత్రధారి జగదీశ్ అలియాస్ మచ్చాకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. అతన్ని జగదీశ్ అని పిలిచే కన్నా.. కేశవగా పాపులర్ అయ్యారు.అతడ్ని తాజాగా పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ఒక యువతి ఆత్మహత్య కేసులో అతడు జైలుపాలయ్యాడు. కాకినాడకు చెందిన ఒక యువతి ఒక సంస్థలో ప్రైవేటు జాబ్ చేస్తూనే సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటిస్తుండేది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనిఒక అపార్టుమెంట్ లో ఉండేది. ఆమె తల్లిదండ్రులు కాకినాడలో ఉంటున్నారు. ఆమెకు పెళ్లై.. భర్తకు విడాకులు ఇచ్చి విడిగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే మణికొండలో నివసించే నటుడు జగదీశ్ (కేశవ) పరిచయం అయ్యారు.

వీరి పరిచయం కొద్దికాలానికే ప్రేమగా మారి.. లివింగ్ రిలేషన్ లో ఉండసాగారు. అయితే.. ఆమెను కాదని జగదీశ్ మరో యువతిని పెళ్లాడారు. దీంతో.. ఆమె జగదీశ్ ను దూరం పెట్టారు. ఇదిలా ఉంటే.. గత నెల 27న సదరు యువతి నివసించే ప్లాట్ కు వచ్చిన జగదీశ్.. ఆ టైంలో సదరు మహిళ మరో యువకుడితో సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని కిటికీలో నుంచి తీశాడు. ఆ తర్వాత డోర్ కొట్టి.. ఇంట్లోకి వెళ్లిన అతడు.. మీ భాగోతాన్ని వీడియో తీశానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫోటోల్ని డిలీట్ చేయాలని ఎంత కోరినా ఒప్పుకోలేదు.

దీంతో.. ఆ యువతి.. యువకుడు పోలీసులకు ఫోన్ చేస్తామని చెప్పటంతో జగదీశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత నుంచి ఫోన్ లో వేధించటం షురూ చేశాడు. గత నెల 29 ఉదయం ఆ యువతి పర్సనల్ ఫోటోల్ని ఆమెకు పంపి.. ఇలాంటివెన్నో తన వద్ద ఉన్నాయని.. వాటిని బయటపెడతానని బెదిరించాడు. దీంతో.. భయపడిన ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవటంతో ఆత్మహత్య కేసుగా నమోదు చేసి పోలీసులుకేసు దర్యాప్తు చేవారు. అయితే.. యువతి బంధువులు కేశవ వేధింపుల గురించి పోలీసులకు చెప్పటంతో.. ఆ కోణంలో విచారణ చేపట్టారు. అప్పటి నుంచి జగదీశ్ పరారీలో ఉన్నాడు. తాజాగా అతడ్ని గుర్తించి అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.