Begin typing your search above and press return to search.

స‌లార్ అంత‌ర్జాతీయంగా మెప్పిస్తాడా?

ఇందులో ప్ర‌భాస్ తో పాటు, మాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు.

By:  Tupaki Desk   |   6 Jan 2024 4:08 AM GMT
స‌లార్ అంత‌ర్జాతీయంగా మెప్పిస్తాడా?
X

ప్రభాస్ క‌థానాయ‌కుడిగా ప్రశాంత్ నీల్ తెర‌కెక్కించిన స‌లార్ సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికే 650 కోట్లు పైగా వ‌సూలు చేసి విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. ఈ భారీ యాక్ష‌న్ డ్రామా క‌థాంశాన్ని డార్క్ థీమ్ తో ప్ర‌శాంత్ నీల్ ఎలివేట్ చేసిన తీరుకు ప్ర‌శంస‌లు కురిసాయి. ఇందులో ప్ర‌భాస్ తో పాటు, మాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టించింది.

ఈ ప్రాజెక్ట్ వెనుక నిర్మాణ శక్తిగా ఉన్న హోంబలే ఫిల్మ్స్ తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. 7 మార్చి 2024న లాటిన్ అమెరికాలో స్పానిష్ భాషలో సలార్ విడుదల కానుందని అధికారికంగా ప్రకటించింది. శ్రీయా రెడ్డి, బాబీ సింహా, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం ప్ర‌ధాన హైలైట్.

అయితే స్పానిష్ భాష‌తో పాటు ఈ సినిమాని జ‌ప‌నీ భాష‌లోను విడుద‌ల చేసేందుకు ప్ర‌ణాళిక‌లు ఉన్నాయ‌ని తెలిసింది. జ‌ప‌నీ, కొరియ‌న్ భాష‌ల్లోను ప్ర‌భాస్ న‌టించిన గ‌త చిత్రాలు విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు స‌లార్ ని కూడా జ‌పాన్ లో భారీగా విడుద‌ల చేస్తార‌ని భావిస్తున్నారు. అయితే లాటిన్ అమెరికా, జ‌పాన్ స‌హా పాశ్చాత్య దేశాల‌కు స‌లార్ కంటెంట్ ఏమేర‌కు ఎక్కుతుంది? అన్న‌ది ప్ర‌శ్నిస్తే...

నిజానికి ఇది ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా అంద‌రినీ ఆక‌ట్టుకునే విజువ‌ల్ రిచ్ చిత్రం అన‌డంలో సందేహం లేదు. చాలా కొరియ‌న్ , చైనీ సినిమాలతో పోలిస్తే ఇది ఉత్త‌మ‌మైన కంటెంట్ తో తెర‌కెక్కింది. మేకింగ్ స్టాండార్డ్స్ ప‌రంగా హాలీవుడ్ చిత్రాల స్థాయికి ఎంత‌మాత్రం త‌గ్గలేదు. ఇది ఇండియ‌నైజ్డ్ డార్క్ వ‌ర‌ల్డ్ కి సంబంధించిన సినిమా. భార‌త‌దేశంలో సాగే క‌థ‌కు ప్ర‌పంచ దేశాల క‌నెక్ష‌న్ కూడా నీల్ ఆస‌క్తిక‌రంగా చూపించాడు. అందువ‌ల్ల ఇత‌ర దేశీయుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా ఉంటుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. నిజానికి హాలీవుడ్ పేరుతో వ‌ర‌ల్డ్ సినిమాల్లో చెత్త కంటెంట్ తో లెక్కకు మిక్కిలిగా సినిమాలు వ‌స్తున్నాయి. వాటితో పోలిస్తే `స‌లార్` అర్థ‌వంత‌మైన సినిమా అన‌డంలో సందేహం లేదు.