Begin typing your search above and press return to search.

'రామాయణ 2'.. నితేష్ తివారీ ధీమా వెనుక అసలు కథేంటి?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందంటేనే ఎన్నో లెక్కలు ఉంటాయి.

By:  M Prashanth   |   13 March 2026 5:00 AM IST
రామాయణ 2.. నితేష్ తివారీ ధీమా వెనుక అసలు కథేంటి?
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందంటేనే ఎన్నో లెక్కలు ఉంటాయి. అలాంటిది పార్ట్ 1 విడుదల కాకముందే, రెండో భాగం షూటింగ్ మొదలుపెట్టడం అనేది మామూలు విషయం కాదు. గతంలో రాజమౌళి 'బాహుబలి'కి, మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్'కు ఇలాంటి సాహసమే చేశారు. ఇప్పుడు నితేష్ తివారీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'రామాయణ' విషయంలో అదే బాటలో పయనిస్తున్నారు.

అసలు మొదటి భాగం ఫలితం తెలియకుండానే రెండో భాగంపై ఇంతటి ధీమా చూపించడం వెనుక ఉన్న రహస్యం ఏంటనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ​దీనికి ప్రధాన కారణం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒక ప్రత్యేక స్క్రీనింగ్ అని తెలుస్తోంది. పార్ట్ 1 కి సంబంధించిన రఫ్ కట్‌ను అక్కడ ప్రదర్శించగా, విజువల్స్ కథా గమనం చూసి మేకర్స్ షాక్ అయ్యారట.

హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్‌తో సినిమా అద్భుతంగా వచ్చిందనే నమ్మకం కలగడంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పార్ట్ 2 పనులను వేగవంతం చేశారు. రన్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా ఇప్పటికే తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడంతో, అదే ఫ్లోలో లంక ప్రయాణానికి సంబంధించిన కీలక ఘట్టాలను కూడా పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నారు.

​ఇలా రెండు భాగాలను ఏకకాలంలో ప్లాన్ చేయడం వెనుక ఒక బలమైన ప్లస్ పాయింట్ ఉంది. నటీనటుల లుక్స్ వారి బాడీ లాంగ్వేజ్‌లో ఎటువంటి తేడా రాకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా రామాయణం లాంటి ఇతిహాసాన్ని వెండితెరపై చూపిస్తున్నప్పుడు కంటిన్యూటీ చాలా ముఖ్యం. లంక వైపు సాగే ప్రయాణం, హనుమంతుడిగా సన్నీ డియో ఎంట్రీ వంటి కీలక సీన్లు పార్ట్ 2 లోనే ఎక్కువగా ఉంటాయి. అందుకే ఒక షెడ్యూల్ పూర్తి కాగానే వెంటనే రెండో భాగం సెట్స్‌ను సిద్ధం చేసి, షూటింగ్ గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు.

​అయితే ఇందులో రిస్క్ కూడా లేకపోలేదు. సుమారు రూ. 4000 కోట్ల భారీ పెట్టుబడితో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో పార్ట్ 1 ఫలితంపైనే పార్ట్ 2 భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మొదటి భాగానికి ఆశించిన స్పందన రాకపోతే రెండో భాగం పరిస్థితి ఏంటనే ప్రశ్న సహజంగానే వస్తుంది. కానీ రామాయణంకు ఉండే బజ్ వేరు, దాన్ని సరైన పద్ధతిలో విజువల్ వండర్‌గా చూపిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారనేది మేకర్స్ నమ్మకం. పైగా యాష్ లాంటి స్టార్ రావణుడిగా నటిస్తుండటం సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో పెద్ద క్రేజ్‌ను తెచ్చిపెడుతోంది.

​ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షెడ్యూల్‌లో రాముడి వనవాసం తర్వాత జరిగే కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. సీతమ్మ అపహరణ తర్వాత రాముడిలోని అలజడి, ఆపై హనుమంతుడిని కలవడం వంటి భావోద్వేగ సీన్లతో పాటు భారీ యుద్ధ సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్‌లో ప్లాన్ చేశారు. టెక్నాలజీ పరంగా కూడా ఎక్కడా రాజీ పడకుండా, అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సలహాలతో విజువల్ ఎఫెక్ట్స్‌ను రూపొందిస్తున్నారు. 2026 దీపావళికి మొదటి భాగం విడుదల చేసేలా మేకర్స్ పక్కా ప్రణాళికతో ఉన్నారు. 'రామాయణ' టీమ్ చేస్తున్న ఈ సాహసం భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించేలా కనిపిస్తోంది. మరి 2027లో రాబోయే రెండో భాగం నాటికి మొదటి భాగం ఎటువంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.