మూడేళ్లయినా క్యూరియాసిటీని కాపాడుకున్న ఏకైక ఫిలింమేకర్!
అయినా ఏదో ఒక రూపంలో లీకులు వస్తూనే ఉంటాయి. భారతీయ సినిమా చరిత్రలో బంపర్ హిట్లుగా నిలిచిన ఎన్నో సినిమాల కథలు విడుదలకు ముందే లీకు వీరుల వల్ల బయటకు వచ్చేసాయి.
By: Sivaji Kontham | 17 Jun 2026 1:00 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక సినిమాకు సంబంధించిన కథేంటో... అందులోని పాత్రల స్వభావం ఏంటో బయటకు తెలియకుండా జాగ్రత్తపడటం పెద్ద దర్శకులకు ఎప్పుడూ ఒక సవాలే. ఎస్.ఎస్.రాజమౌళి, శంకర్ వంటి దిగ్గజ దర్శకులు సైతం తమ చిత్రాల సెట్స్ నుండి ఎటువంటి సమాచారం లీక్ కాకూడదని కఠినమైన నిబంధనలు పెడుతుంటారు. కనీసం మొబైల్ ఫోన్లను కూడా లోపలికి అనుమతించనంతగా పకడ్బందీ చర్యలు తీసుకుంటారు. అయినా ఏదో ఒక రూపంలో లీకులు వస్తూనే ఉంటాయి. భారతీయ సినిమా చరిత్రలో బంపర్ హిట్లుగా నిలిచిన ఎన్నో సినిమాల కథలు విడుదలకు ముందే లీకు వీరుల వల్ల బయటకు వచ్చేసాయి.
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలకు సంబంధించిన కథలు విడుదలకు ముందే లీకయ్యాయి. ప్రేక్షకులు ఊహించిన కథనాలు.. జక్కన్న వెండితెరపై చూపించిన కథతో చాలా వరకు సరిపోలాయి. అలాగే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాల విషయంలో మేకర్స్ తామే స్వయంగా ప్రేక్షకులను ప్రిపేర్ చేయడానికి కొంత సమాచారాన్ని ముందే విడుదల చేశారు. ఇక దర్శకుడు శంకర్ భారీ చిత్రం `2.ఓ` కథ కూడా ముందే లీకైంది. అందులో రజనీకాంత్ రోబోట్ పాత్ర, అక్షయ్ కుమార్ పక్షిరాజు పాత్రల గురించిన వివరాలు విడుదలకు చాలా ముందే సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
ప్రభాస్ నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా `సాహో` కథ కూడా ముందే తెలిసిపోయింది. అది ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా అనే విషయాన్ని చిత్రబృందం ఎక్కడా దాచలేదు. అలాగే ఆయన నటిస్తున్న తాజా చిత్రం `ఫౌజి` కథకు సంబంధించి కూడా వెబ్‌లో ఇప్పటికే కొన్ని లీకులు షికార్ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో వచ్చిన పవన్ కళ్యాణ్ `ఓజీ` కథలో దాపరికం ఏదీ లేదు. సుజీత్ ముందే ఆ సినిమాలో పవన్ పాత్ర గురించి లీకులిచ్చారు. రాజమౌళి తదుపరి ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి` కథ ఏమిటన్నది పెద్దగా సస్పెన్స్ ఏమీ లేదు. మూడు యుగాలలో జరిగిన కథను చూపిస్తున్నామని చెబుతున్నారు. అయితే ఈ చిత్రాల విషయంలో దర్శక రచయితలే స్వయంగా కథకు సంబంధించిన కొన్ని క్లూస్ ఇవ్వడంతో.. సినిమా ప్రియులు పూర్తి కథ ఎలా ఉండబోతోందనేది సులభంగానే అంచనా వేయగలిగారు.
కానీ భారతీయ సినిమా చరిత్రలోనే అసలు ఈ సినిమా కథ ఏంటో ఎవరికీ తెలియదు అనేంతగా సస్పెన్స్ మెయింటెయిన్ చేసిన ఏకైక చిత్రం ఏదైనా ఉందంటే.. అది కచ్చితంగా `టాక్సిక్` మాత్రమే. కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథేమిటో ఇప్పటివరకు ఏమాత్రం రివీల్ కాకపోవడం నిజంగా గొప్ప విశేషం. ప్రతి ఒక్కరూ ఇది మరో గ్యాంగ్‌స్టర్ డ్రామా అని ఊహిస్తున్నారే తప్ప ఈ మూవీ అసలు థీమ్ ఏంటనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మహిళా దర్శకురాలైన గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి సంబంధించి లీకులేవీ లేకుండా ఎంతో పకడ్బందీగా నడిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్, విడుదల చాలా ఆలస్యమైనా.. కథేమిటన్నదానిపై చిన్న క్లూ కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు.
వందల కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పర్‌ఫెక్షన్ కోసం .. ఓటీటీ డీల్ కుదరాల్సి ఉండటం వల్లే అంతకంతకూ ఆలస్యమవుతోందని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. విడుదల ఎంత ఆలస్యమవుతున్నా.. ఈ సినిమా కథపై లీక్స్ రాకుండా సస్పెన్స్ మెయింటెయిన్ చేయడమే `టాక్సిక్`పై అంచనాలను సజీవంగా ఉంచింది. కొన్నిసార్లు కథేంటో ముందే చెప్పడం అవసరమే అయినా.. మరికొన్నిసార్లు కథను, పాత్రలను దాచి ఉంచడమే సినిమాకు శ్రీరామరక్ష అవుతుంది. ఈ విషయంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ వంద శాతం విజయవంతమయ్యారు. కేవలం ఈ రహస్యమే.. సినిమా అనౌన్స్ అయిన మూడేళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు దీని కోసం ఎంతగానో ఎదురుచూసేలా చేస్తోంది. కనీసం సంక్రాంతి బరిలో అయినా విడుదల ఫిక్సయినట్టేనా లేదా? అన్నది నిర్మాతలు వెల్లడించాల్సి ఉంది.
