ప్రేక్షకుడి ప్రశ్నలకు నిర్మాత, హీరో స్పందించరెందుకు?
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. పెద్ద పెద్ద స్టార్లు కూడా ఇక సినిమాలు చేయడం కష్టమే అని భయపడ్డారు.
By: Tupaki Desk | 24 May 2025 11:00 PM ISTకరోనా కారణంగా దేశ వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. పెద్ద పెద్ద స్టార్లు కూడా ఇక సినిమాలు చేయడం కష్టమే అని భయపడ్డారు. కోవిడ్ భయంతో ప్రేక్షకుల థియేటర్లకు వచ్చే అవకాశం లేదని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మన పరిస్థితి ఏంటని బెంబేలెత్తిపోయారు. షూటింగ్‌లు చేయడానికి కూడా వణుకుతున్న తరుణంలో ఇండియన్ సినీ ఇండస్ట్రీకి మేమున్నామంటూ అభయాన్నిచ్చింది తెలుగు ప్రేక్షకులే.
దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి జంకుతున్న వేళ మేమున్నామంటూ థియేటర్లకు వచ్చారు. భారీ స్థాయిలో స్టార్‌ల సినిమాలకు విజయాల్ని అందించారు. అయితే ఆ తరువాత నుంచి సీన్ మారిపోతూ వచ్చింది. సామాన్య ప్రేక్షకుడు థియేటర్లకు రావడానికి ప్రస్తుతం భయపడుతున్నాడు. కారణం పెరిగిన టికెట్ రేట్లు, థియేటర్లలో లభించే కూల్ డ్రింక్, పాప్ కార్న్‌లు. ఇవే ఇప్పుడు సగటే ప్రేక్షకుడు థియేటర్ ముఖం చూడాలంటే భయపడేలా చేస్తున్నాయి.
దీంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది.ఓటీటీ ప్రభావం పెరిగిపోవడం, ఇంట్లోనే ఉండి సినిమాలు, సిరీస్‌లు చూసే వెసులుబాటు ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా వరకు తగ్గించేశారు. కొంత కాలంగా థియేటర్ టికెట్‌ల గురించి,థియేటర్లలో లభించే పాప్ కార్న్, కూల్ డ్రింక్‌ల రేట్ల గురించి ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇండస్ట్రీ పెద్దలు, హీరోలు మాత్రం దీనిపై స్పందించడం లేదు. మంచి సినిమా చేశాం. థియేటర్లకు రండి,థియేటర్లలోనే సినిమా చూడండి అంటూ స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారు.
కానీ సినిమా ఇండస్ట్రీకి మహారాజ పోషకులైన ప్రేక్షకులు ఎందుకు రావడంలేదు. వారి సమస్యలు ఏంటీ? వఆటిని ఎలా పరిష్కరించి థియేటర్ వ్యవస్థని కాపాడాలి? అని మాత్రం నిర్మాతలు, హీరోలు ఆలోచించడం లేదు. ఎప్పటికీ వారికి లభించే పారితోషికాలు, లాభాల్లో వాటాల గురించే మాట్లాడుకుంటున్నారే తప్ప తమని బ్రతికిస్తున్న ప్రేక్షకుడిని మాత్రం గాలికి వదిలేశారు. ముందు ప్రేక్షకుడి సమస్యలని పరిష్కరిస్తే మళ్లీ థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందని, ఆ దిశగా నిర్మాతలు, హీరోలు, ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించాలని సగటు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
