Begin typing your search above and press return to search.

IMDb 2023 టాప్ 10లో మ‌న స్టార్లు ఎక్క‌డ‌?

దీంతో ఐఎండిబి ఏ ప్రాతిప‌దిక‌న ఈ జాబితాను రూపొందించింది? అంటూ చ‌ర్చ మొద‌లైంది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 11:37 AM GMT
IMDb 2023 టాప్ 10లో మ‌న స్టార్లు ఎక్క‌డ‌?
X

2023లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల IMDb జాబితా వెలువ‌డింది. ఇందులో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచారు. సౌత్ కి చెందిన ముగ్గురు స్టార్లు న‌య‌న‌తార‌-త‌మ‌న్నా-విజ‌య్ సేతుప‌తికి మాత్ర‌మే టాప్ 10లో ప‌ట్టంగ‌ట్టారు. అయితే పాన్ ఇండియా స్టార్లుగా ఓ వెలుగు వెలుగుతున్న ప్ర‌భాస్ - అల్లు అర్జున్- రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ అడ్రెస్ లేరు. ద‌ళ‌ప‌తి విజ‌య్, క‌మ‌ల్ హాస‌న్, రాకింగ్ స్టార్ య‌ష్‌, బ్ర‌హ్మాస్త్ర స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత వంటి స్టార్ల పేర్లు కూడా క‌నిపించ‌లేదు. దీంతో ఐఎండిబి ఏ ప్రాతిప‌దిక‌న ఈ జాబితాను రూపొందించింది? అంటూ చ‌ర్చ మొద‌లైంది.


నిజానికి ప‌బ్లిక్ లో ట్రెండ్, ఫాలోయింగ్.. సోష‌ల్ మీడియాల్లో జోష్.. సినిమాల రిలీజ్‌ సంద‌డి.. గూగుల్ లో సెర్చింగ్.. వంటి అంశాల‌ను ఐఎండిబి ప్రాతిప‌దిక‌గా తీసుకుంటోందా? లేక ఓటింగ్ ద్వారా ఈ జాబితాను త‌యారు చేస్తుందా? అంటే ఓటింగ్ లేదా యూజ‌ర్ రేటింగ్ విధానంలో దీనికి ప‌ట్టంగ‌డుతార‌నేది నిర్వివాదాంశం. కేవ‌లం యూజ‌ర్ రేటింగ్ ఆధారంగానే జనాద‌ర‌ణ‌ను లెక్కిస్తారా? అన్న‌ది అర్థం కాని అంశంగా మారింది. అయితే 2023లో ప్ర‌భాస్ కి ఎలాంటి రిలీజ్ లేదు. క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ 2022లో విడుద‌లైంది. త‌ర్వాత రిలీజ్ లేదు. అందుకే వీరిద్ద‌రూ రేసులో వెన‌క‌బ‌డ్డాడ‌ని భావించ‌వ‌చ్చు. కానీ ఇత‌ర స్టార్లు ఏదో ఒక సినిమాతో ట‌చ్ లోనే ఉన్నారు. కానీ వీళ్లెవ‌రూ ఐఎండిబి జాబితాలో క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఉత్త‌రాది నుంచి బాలీవ‌డ్ స్టార్ల‌కు రేటింగ్ కుదిరినా, ద‌క్షిణాది నుంచి అంత‌గా స్పంద‌న లేక‌పోవ‌డం రేటింగ్ ను ప్ర‌భావితం చేసి ఉంటుంద‌ని కూడా భావిస్తున్నారు.

2023లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల IMDb జాబితా ప‌రిశీలిస్తే.. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ 2023 IMDb టాప్ -1 స్టార్ గా నిలిచాడు. అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల జాబితాలో ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2023లో బాలీవుడ్ బాద్షా ప‌ఠాన్ -జవాన్ అనే రెండు బ్లాక్‌బస్టర్‌లను అందించాడు. ఇవి వరుసగా ప్రపంచవ్యాప్తంగా అత్య‌ధిక వ‌సూళ్ల‌తో అతిపెద్ద హిందీ సినిమాలుగా నిలిచాయి. క‌థానాయిక‌ల్లో అలియా భట్ - దీపికా పదుకొణె వరుసగా 2- 3 స్థానాల్లో నిలిచారు. నాల్గవ స్థానంలో నటి వామికా గబ్బి నిలిచారు.

నయనతార, తమన్నా భాటియా, కరీనా కపూర్ ఖాన్, శోభితా ధూళిపాళ వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత తొమ్మిదో స్థానంలో బాలీవుడ్ `ఖిలాడీ` అక్షయ్ కుమార్ స్థానం ద‌క్కించుకున్నారు. అక్షయ్ తర్వాత పదో స్థానంలో త‌మిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి జాబితాలో చేరాడు.