Begin typing your search above and press return to search.

హీరో రూ. కోటి సాయం వెనక అసలు విషయం ఏంటంటే?

అయితే ఇప్పుడు ఈ భవన నిర్మాణం పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

By:  Tupaki Desk   |   16 Feb 2024 1:30 PM GMT
హీరో రూ. కోటి సాయం వెనక అసలు విషయం ఏంటంటే?
X

టాలీవుడ్ లో తెలుగు నటీనటుల కోసం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఉన్నట్లుగానే, కోలీవుడ్ లో సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉంది. దీన్ని 'నడిగర్‌ సంఘం' అనే పేరుతో పిలుస్తుంటారు. చెన్నైలో అసోసియేషన్ కొత్త బిల్డింగ్ కట్టడానికి గత కొన్నేళ్లుగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ భవన నిర్మాణం పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీని కోసం తమిళనాడు ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేశారు.

దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం కోసం మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ రూ. కోటి మంజూరు చేశారు. గురువారం తన కార్యాలయంలో నడిగర్‌ సంఘం కోశాధికారి అయిన హీరో కార్తీకి చెక్ కు అందజేశారు. ఈ విషయాన్ని జనరల్ సెక్రటరీ విశాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఓ ఫోటోని పంచుకున్నారు. ఇందులో ఉదయ్, కార్తీ, విశాల్ లతో పాటుగా.. నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్, ఉపాధ్యక్షుడు పూచి మురుగన్, సీనియర్ నటుడు కరుణాస్ కనిపిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో విశాల్ ట్వీట్ చేస్తూ.. ''డియర్ ఉదయ, మా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ భవన నిర్మాణ ప్రయత్నాలకు మీ సహకారం అందించినందుకు, వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం ద్వారా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నందుకు.. స్నేహితుడిగా, నిర్మాతగా, నటుడుగా, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ క్రీడా మంత్రిగా ఉన్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నిజంగా చాలా మంచి విషయం. గాడ్ బ్లెస్" అని పేర్కొన్నారు.

2019లో నడిగర్‌ సంఘం ఎన్నికలు జరగగా.. వాటి ఫలితాలను మాత్రం 2022లో ప్రకటించారు. అప్పటి నుంచీ అసోషియేషన్ కొత్త బిల్డింగ్ నిర్మించడానికి కావాల్సిన నిధుల కోసం హీరో విశాల్‌ తీవ్రంగానే కష్టపడుతున్నారు. నూతన భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని శపథం కూడా చేశారు. అయితే భవన నిర్మాణానికి నిధుల కొరత ఉందని గతంలో విశాల్‌ తెలిపారు. మూడేళ్లు ఆలస్యమవ్వడం వల్ల 25 శాతం పనులు పెరిగాయని, దీని వల్ల బడ్జెట్‌ కూడా పెరిగిందని చెప్పారు.

నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సాయం చేయాలని కోరిన విశాల్.. అవసరమైతే భిక్షాటన కూడా చేస్తానని అన్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. మిగతా వర్క్ కంప్లీట్ చెయ్యడానికి బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో తీర్మానం చేశారు. ఇప్పుడు హీరో, మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ తన ప్రభుత్వం తరపున కోటి రూపాయలు సాయం చేయటంతో తమిళ ఆర్టిస్ట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత, తమిళ నటీనటుల సంఘం నూతన భవనం గురించి ఆలోచించడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా రెండు మూడు నెలల్లో తమిళనాడు లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సినీ నటుల మద్దతు కూడగట్టడానికే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవలే రాజకీయ పార్టీ పెట్టిన హీరో విజయ్, రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కాబట్టి అధికార పార్టీకి సినీ నటీనటుల సపోర్ట్ ఎంతో అవసరం ఉంది. ఉదయనిధి స్టాలిన్ ఇవన్నీ పరిగణలోకి తీసుకునే నడిగర్ సంఘానికి సహాయం చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.