Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్‌: 2000 కోట్ల బడ్జెట్ ఫేక్ సినిమాలో కామెడీ ఫేక్ కాదు క‌దా?

దాదాపు 4 నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న ఈ సుదీర్ఘమైన ట్రైలర్.. పరేష్ రావల్ డైరెక్ట‌ర్ హ్యాట్ ధరించి `వెల్‌కమ్ టు ది జంగిల్` అనే సినిమాను తీయడానికి సిద్ధమవడంతో ప్రారంభమవుతుంది.

By:  Sivaji Kontham   |   11 Jun 2026 3:01 PM IST
ట్రైల‌ర్ టాక్‌: 2000 కోట్ల బడ్జెట్ ఫేక్ సినిమాలో కామెడీ ఫేక్ కాదు క‌దా?
X

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన మోస్ట్ అవైటెడ్ కామెడీ ఎంటర్‌టైనర్ `వెల్‌కమ్ టు ది జంగిల్` (వెల్‌కమ్ 3) ట్రైలర్‌ను మేకర్స్ ఎట్టకేలకు విడుదల చేశారు. ఈ సూపర్ హిట్ కామెడీ సిరీస్‌లోకి అక్షయ్ కుమార్ మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హ్యూమర్, యాక్షన్, జంగిల్ నేపథ్యంలో సాగే గందరగోళం కలగలిసి ఈ ట్రైలర్ వినోదాత్మకంగా సాగింది. 2000 కోట్ల బడ్జెట్ ఫేక్ సినిమా కోసం హంగామా ఇది. ఒక నకిలీ (ఫేక్) సినిమా సెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కామెడీ డ్రామాను చిత్రీకరించినట్లు ట్రైలర్ ద్వారా రివీల్ చేశారు. అంతేకాకుండా.. నిజ జీవితంలో జరిగే పలు సంఘటనల రిఫరెన్స్‌లను ఇందులో చూపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

దాదాపు 4 నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న ఈ సుదీర్ఘమైన ట్రైలర్.. పరేష్ రావల్ డైరెక్ట‌ర్ హ్యాట్ ధరించి `వెల్‌కమ్ టు ది జంగిల్` అనే సినిమాను తీయడానికి సిద్ధమవడంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈ చిత్రంలో నటించిన భారీ తారాగణాన్ని ఒక్కొక్కరిగా పరిచయం చేశారు. సునీల్ శెట్టి, పరేష్ రావల్, రవీనా టాండన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటాని, లారా దత్తా, ఫరీదా జలాల్, అర్షద్ వార్సి, యశ్‌పాల్ శర్మ, జానీ లీవర్ వంటి ఎందరో ప్రముఖ నటీనటులు ఈ ట్రైలర్‌లో సందడి చేశారు. ఇక ట్రైలర్ చివర్లో అక్షయ్ కుమార్‌ను ఒకప్పుడు సక్సెస్‌ఫుల్ హీరోగా ఉండి ప్రస్తుతం వరుస `ఫ్లాప్స్` ఎదుర్కొంటున్న నటుడిగా వైవిధ్యంగా పరిచయం చేయడం విశేషం.

దర్శకుడు అనీస్ బజ్మీ సృష్టించిన `వెల్‌కమ్` లెగసీని కొనసాగిస్తూ.. గత భాగాలలో ఉదయ్ శెట్టి (నానా పటేకర్), మజ్ను భాయ్ (అనిల్ కపూర్) పాత్రలకు సోదరులుగా ఈసారి సునీల్ శెట్టి, అర్షద్ వార్సిలను రంగంలోకి దించారు. ఈ చిత్రంలో లారా దత్తా ఆర్మీ ట్రైనర్‌గా కనిపించగా... నటీనటులందరూ చేసే యాక్షన్ సీన్స్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. గత భాగంలో ఎంతగానో ఫేమస్ అయిన `మజ్ను భాయ్ పెయింటింగ్` ఈసారి సరికొత్త అవతారంలో మళ్లీ ప్రత్యక్షమై పాత జ్ఞాపకాలను గుర్తుచేసింది. ట్రైలర్‌లో వచ్చే కొన్ని డైలాగులు థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయమనిపిస్తోంది.

ట్రైలర్‌లో రవీనా టాండన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు దిశా పటాని ``ఈమె మనల్ని తినేస్తుంది`` అనగా.. రాజ్‌పాల్ యాదవ్ స్పందిస్తూ ``ఆమె పాత బీఎం (అనుభవజ్ఞురాలు)`` అని చెప్పే పంచ్ డైలాగ్ నవ్విస్తుంది. అలాగే జాక్వెలిన్ ``నేను ఈ సినిమాలో ఎందుకు ఉన్నాను?`` అని ప్రశ్నించగా.. యశ్‌పాల్ శర్మ `గ్లామర్ కోసం` అని సమాధానమివ్వడం హైలైట్‌గా నిలిచింది. ఇక విలన్ పాత్రలో ఎంట్రీ ఇచ్చిన జాకీ ష్రాఫ్.. అక్షయ్ కుమార్‌ను చూసి `నేను నిన్ను ఎక్కడో చూశాను` అని అడగగా... అక్షయ్ తన నిజ జీవిత బాక్సాఫీస్ ఫ్లాపులపై సెల్ఫ్ సెటైర్ వేసుకుంటూ.. ``మీరు ఫ్లాప్ సినిమాలు కూడా చూస్తారా?`` అని రిప్లై ఇవ్వడం ఇంట్రెస్టింగ్. వీరికి తోడు దలేర్ మెహందీ కూడా తనదైన శైలిలో నవ్వులు పూయించగా... ముగింపులో హీరోలు చేసే మైండ్ బ్లోయింగ్ యాక్షన్, పేలుళ్లు ట్రైలర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

అనీస్ బజ్మీ దర్శకత్వంలో వచ్చిన `వెల్‌కమ్` (2007) సంచలన విజయం సాధించగా ఆ తర్వాత `వెల్‌కమ్ బ్యాక్` (2015) ప్రేక్షకులను అలరించింది. అయితే అక్షయ్ కుమార్ కేవలం మొదటి భాగంలో మాత్రమే నటించారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత వస్తున్న ఈ మూడో భాగానికి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించగా.. బేస్ ఇండస్ట్రీస్ గ్రూప్ బ్యానర్‌పై ఫిరోజ్ ఎ. నాడియాడ్‌వాలా నిర్మించారు. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, తుషార్ కపూర్, కృష్ణా అభిషేక్, కీకు శారద వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ క్రేజీ జంగిల్ రైడ్ జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.