ఇండియా లెవల్లో టాలీవుడ్ స్టార్లకు గౌరవం
ఇండియా లెవల్లో జరగనున్న ఓ భారీ కార్యక్రమంలో తెలుగు స్టార్లకు గొప్ప గౌరవం దక్కనుంది.
By: Tupaki Desk | 25 April 2025 9:52 AM ISTఇండియా లెవల్లో జరగనున్న ఓ భారీ కార్యక్రమంలో తెలుగు స్టార్లకు గొప్ప గౌరవం దక్కనుంది. ముంబైలో జరగనున్న `ఆడియో విజువల్ & ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ (వేవ్స్ 2025)లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, దర్శకధీరుడు రాజమౌళి పాల్గొననున్నారు. వీరంతా తమకు కేటాయించిన విభాగంపై తమ నాలెజ్ ని ఈ వేదికపై షేర్ చేస్తారు. ముంబై జియో కన్వెన్షన్ లో మే 1 నుంచి 4 వరకూ జరిగే ఈ కార్యక్రమంలో బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, షారూఖ్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హేమమాలిని, మిథున్ చక్రవర్తి, ఐశ్వర్యారాయ్, కరీనా కపూర్, కరణ్ జోహార్ సహా పలువురు పాల్గొననున్నారు. వారితో పాటు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, మలయాళం నుంచి మోహన్ లాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ విలువైన సలహాలు సూచనలను చేస్తారు.
దేశంలో ఈ తరహా కార్యక్రమం ఇదే మొదటిసారి. ఆడియో విజువల్ రంగం సహా వినోద రంగంలో పెను విప్లవాల గురించి ముఖ్యంగా ప్యానెల్ సమావేశంలో ప్రముఖులంతా చర్చించనున్నారు. 1 మే 2025న `లెజెండ్స్ & లెగసీస్: ది స్టోరీస్ దట్ షేప్డ్ ఇండియాస్ సోల్` ప్యానెల్‌తో అమితాబ్ బచ్చన్, చిరంజీవి, హేమ మాలిని, మిథున్ చక్రవర్తి, రజనీకాంత్, మోహన్ లాల్ వంటి దిగ్గజాలు చర్చిస్తారని సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `ఇండియాస్ క్రియేటివ్ అసెంట్: ఎం&ఇ లీడర్స్ ఆన్ బికమింగ్ ఎ గ్లోబల్ పవర్‌హౌస్` ప్యానెల్ లో చర్చించనున్నారు. బన్నీతో పాటు జర్మన్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి అరియాన్ హింగ్స్ట్, ఇటాలియన్ మోడల్ బినాకా బాల్టి, ఇజ్రాయెల్ నటి రోనా లీ షిమోన్, యుఎస్ గాయని మేరీ జోరీ మిల్బెన్ కూడా పాల్గొంటారు.
`ది న్యూ మెయిన్ స్ట్రీమ్: బ్రేకింగ్ బోర్డర్స్, బిల్డింగ్ లెజెండ్స్` సెషన్‌లో ఎస్ ఎస్ రాజమౌళి, ఎ ఆర్ రెహమాన్, అనిల్ కపూర్ తదితరులు పాల్గొని చర్చిస్తారు. `సినిమా: ది సాఫ్ట్ పవర్` సెషన్ లో నానా పటేకర్ లాంటి సీనియర్ నటుడితో విజయ్ దేవరకొండ కూడా ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొంటారు. `రీడిఫైనింగ్ ఇండియన్ సినిమా` అనే మాస్టర్ క్లాస్ లో అమీర్ పాల్గొంటారు. నాగార్జున, అమితాబ్ బచ్చన్, కార్తీ , ఖుష్బు పాట్లతో కలిసి `పాన్-ఇండియన్ సినిమా: మిత్ ఆర్ మొమెంటం?` సెషన్ కు హాజరవుతారు. చివరి రెండు రోజులు కూడా డిజిటల్, ఏఐ రంగాలపై చర్చిస్తారని సమాచారం. ప్రతి సెషన్ కు ఒక మెంటార్ ఉంటారు. పాన్ ఇండియన్ సినిమాల వెల్లువలో టాలీవుడ్ స్టార్లకు గౌరవం అంతకంతకు పెరుగుతోందనడానికి ఈ వేడుకలో తెలుగు స్టార్ల ఉనికి ఒక ఉదాహరణగా నిలవనుంది.
