వేవ్స్‌లో మిస్సయినా సరైన పాయింట్ చెప్పిన పూరి
తాజా పాడ్ కాస్ట్ లో అన్ సక్సెస్ ఫుల్ గా జీవించడమెలానో పూరి చెప్పారు. సక్సెస్ ఫుల్ అయిన వారే కాదు.. సక్సెస్ లేనివారు కూడా ఆనందంగా జీవించగలరని అన్నారు.
By: Tupaki Desk | 3 May 2025 5:15 AMవేవ్స్ 2025 సమ్మిట్ చాలా కొత్త ఆవిష్కరణలకు తెర తీస్తోంది. ఇక్కడ మేధోమధనం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల ప్రతినిధులు ఈ ఉత్సవాలకు విచ్చేసారు. కానీ ఇలాంటి ముఖ్యమైన వేదికకు మన దేశం నుంచి, టాలీవుడ్ నుంచి కూడా చాలామంది దిగ్గజ దర్శకులు, స్టార్లు హాజరు కాలేదు. అయితే ఈ ఉత్సవాలకు పరిమిత సంఖ్యలో సినీప్రముఖులకు మాత్రమే ఆహ్వానాలు అందడమే ఈ మిస్సింగ్ కారణమా?
ఏది ఏమైనా 'వేవ్స్ 2025' వేదికగా కీలక చర్చా సమావేశాల్లో పూరి జగన్నాథ్ లాంటి సీనియర్ దర్శకనిర్మాత మిస్సయ్యారేమిటో అంటూ ఆయనను సోషల్ మీడియా ఫాలోవర్స్ ప్రశ్నిస్తున్నారు. కేవలం వేవ్స్ లో మిస్సవ్వడమే కాదు.. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలపైనా పూరి ఇంకా స్పందించలేదు. తన 'పూరి మ్యూజింగ్స్'లో ఎప్పటికప్పుడు ఆసక్తికర విషయాలను షేర్ చేస్తున్న పూరి 'వేవ్స్ 2025' పైనా ఒక ఎపిసోడ్ చేయాలని కోరుకుంటున్నారు.
తాజా పాడ్ కాస్ట్ లో అన్ సక్సెస్ ఫుల్ గా జీవించడమెలానో పూరి చెప్పారు. సక్సెస్ ఫుల్ అయిన వారే కాదు.. సక్సెస్ లేనివారు కూడా ఆనందంగా జీవించగలరని అన్నారు. ఎంత పెద్ద సక్సెస్ సాధించినా మానసిక శాంతి, ఆనందం లేనప్పుడు ఆ జీవితం వృధా అయినట్టేనని అభిప్రాయపడ్డారు. పెద్ద ఉద్యోగం.. పెద్ద ఇల్లు.. కారు ఎన్ని ఉన్నా కుళ్లి కుళ్లి ఏడుస్తున్నవాళ్లు ఉన్నారు. దీనివల్ల ఏం ప్రయోజనం? అని ప్రశ్నించారు. గమ్యాన్ని చేరలేకపోయినంత మాత్రాన తక్కువ చేసి చూడకూడదని, లక్ష్యాన్ని చేరనివారు కూడా గొప్పవారేనని పూరి అన్నారు.
తోటమాలి, టీచర్, చేపలు పట్టేవాడు కూడా వారు చేసిన పనికి ఏదో రావాలని కోరుకోరు. చేసిన పనితో సంతృప్తి చెందుతారు. మనశ్వాంతిగా నిద్రపోతారు. అందువల్ల బిలియనీర్ కంటే వీరంతా ఆనందంగా ఉంటారని పూరి అభిప్రాయపడ్డారు. సంపద, పేరు ప్రఖ్యాతులు, అధికారం ఇవేవీ లేకపోయినా సంతోషంగా ఉండాలని పూరి సూచించారు. ఇతరులతో పోలికలు చూడొద్దని అన్నారు. మొత్తానికి పూరి పాడ్ కాస్ట్ లో వేదాంత ధోరణి చాలా నిజాలను ఆవిష్కరించింది. ఎంత పెద్ద బిలియనీర్ అయినా మానసిక ప్రశాంతతను కోల్పోతే సర్వం కోల్పోయినట్టే. చాలా చిన్న జీవితాన్ని కూడా ఆనందంగా జీవించగలిగిన వారే నిజమైన బిలియనీర్ అని అర్థం చేసుకోవాలి.