సైకో థ్రిల్లర్ గా వాష్ వివాష్ లెవెల్ 2 ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
ఈ మధ్యకాలంలో ఆడియన్స్ ఎక్కువగా సైకో థ్రిల్లర్ జోనర్ లో వచ్చే సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 2 Aug 2025 2:09 PM ISTఈ మధ్యకాలంలో ఆడియన్స్ ఎక్కువగా సైకో థ్రిల్లర్ జోనర్ లో వచ్చే సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారికోసం ఇప్పుడు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో త్వరలో రాబోతున్న చిత్రం 'వాష్ వివాష్ లెవెల్ 2'. ప్రముఖ డైరెక్టర్ కృష్ణదేవ్ యాగ్నిక్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 27వ తేదీన చాలా గ్రాండ్గా హిందీలో విడుదల కాబోతోంది. కేఎస్ ఎంటర్టైన్మెంట్, అనంత బిజినెస్ కార్ప్ పటేల్ ప్రాసెసింగ్ స్టూడియోస్ బ్యానర్లపై కల్పేష్ సోనీ, కృనాల్ సోనీ, నిలయ్ చోటాయ్ , ధృవ్ పటేల్ నిర్మించారు. ఈ చిత్రానికి ఆండ్రూ సామ్యూల్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రం నుండి ఆగస్టు 1న ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం భయానకంగా, అనుక్షణం థ్రిల్లింగ్ అంశాలతో విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో విడుదలైన ఈ ట్రైలర్ 24 గంటల్లోనే ట్రెండింగ్లోకి వచ్చేసింది. గుజరాతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక విభిన్నమైన చిత్రంగా నిలిచిన 'వాష్' మూవీ కొనసాగింపుగా రాబోతున్న ఈ చిత్రం.. టీజర్ తోనే అంచనాలు పెంచేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ తో ఊహించని క్యూరియాసిటీని పెంచేసిందని చెప్పవచ్చు.
ఈ ట్రైలర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఈ ట్రైలర్ ఒక స్కూల్ తో ప్రారంభం అవుతుంది. అక్కడ చాలా మంది విద్యార్థినిలు కూర్చొని కనిపిస్తారు. ముఖ్యంగా వారు తమ హావభావాలను అణిచివేస్తూ.. భయపడుతున్నట్లు మనం గమనించవచ్చు.. "ఇక్కడ.. అక్కడ.. ప్రతి చోట నేనే ఉన్నాను నేను.. మీకోసం ప్రతిచోట ఉంటాను. మీరందరూ ఇకపై నేను చెప్పినట్లే చేయాలి" అంటూ ఒక వాయిస్ వినిపిస్తుంది. ఇకపోతే ట్రైలర్లో ఆ వ్యక్తిని పాక్షికంగా రివీల్ చేసినా అతడు తన హిప్నోటిజంతో అమ్మాయిలను లొంగదీసుకున్నట్లు అనిపిస్తుంది.
కొంతమంది అమ్మాయిలు స్కూల్ బిల్డింగ్ నుంచి టైం చూసుకొని మరీ ఒకేసారి దూకేయడం.. ఇంకొంతమంది అమ్మాయిలు ఒకరికొకరు కొట్టుకోవడం, అలాగే జనావాసాల్లోకి వచ్చి అటు నగరాన్ని బందీలుగా చేసుకున్నట్లు మనం చూడవచ్చు. చివరికి వాష్ విలన్ ప్రతాప్ తెరపైకి వస్తాడు. అతడు చెప్పినట్లే ఈ అమ్మాయిలంతా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు ఆ ప్రతాప్ ఎవరు? అమ్మాయిలను సైకోలుగా మార్చడం వెనుక అతడి ఉద్దేశం ఏమిటి? ఎందుకు అమ్మాయిలంతా అతడు చెప్పినట్లే వింటున్నారు? వారిలో కలుగుతున్న భయానికి కారణం ఏంటి? ఇలా ప్రతి క్యూరియాసిటీ ప్రశ్నకు సమాధానం దొరకాలి అంటే సినిమా చూడాల్సిందే.
ఇక భారీ అంచనాల మధ్య ఆధ్యంతం క్యూరియాసిటీని పెంచేస్తూ.. భయానక సన్నివేశాలతో ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ వశీకరణ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ చూసిన ఆడియన్స్ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరి కొంతమంది ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు కదా మనకు కావాల్సింది.. ఖచ్చితంగా ఇది బ్లాక్ బాస్టర్ అవుతుంది అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సైకో థ్రిల్లర్ అంశాలతో కూడిన ఈ సినిమా చూడాలి అంటే ఆగస్టు 27 వరకు ఎదురు చూడాల్సిందే.
