కూలీ, వార్-2.. తెలుగులో టికెట్ రేట్ల పెంపు సరైనదా? కాదా?
చెన్నైలో పీవీఆర్ మల్టీప్లెక్స్ లో రూ.183 ఉంటే.. హైదరాబాద్ పీవీఆర్ లో రూ.453గా టికెట్ రేటు చూపిస్తోంది.
By: M Prashanth | 12 Aug 2025 4:34 PM ISTకూలీ, వార్-2 సినిమాలు మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఆగస్టు 14వ తేదీ థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నాయి. రెండు సినిమాలపై కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో సినీ ప్రియులు, అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
అదే సమయంలో ఇప్పటికే మేకర్స్.. అడ్వాన్స్ బుకింగ్స్ ను స్టార్ట్ చేశారు. అయితే భారీ చిత్రాలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో జీవోలు రానున్నాయి. దీంతో కూలీ మూవీకి సంబంధించి తమిళనాడు రాజధాని చెన్నైతో పోలిస్తే హైదరాబాద్ లో టికెట్ రేట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
చెన్నైలో పీవీఆర్ మల్టీప్లెక్స్ లో రూ.183 ఉంటే.. హైదరాబాద్ పీవీఆర్ లో రూ.453గా టికెట్ రేటు చూపిస్తోంది. దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. సింగిల్ స్క్రీన్ విషయంలో కూడా భారీ తేడా కనిపిస్తుంది. వార్-2 టికెట్స్ కూడా ముంబై కంటే హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో నెటిజన్లు ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. తెలుగు చిత్రాలకు పెంచినా మన హీరోలే కదా అని పర్లేదని అనుకుంటామని అంటున్నారు. ఇప్పుడు డబ్బింగ్ మూవీస్ కు కూడా రేట్లు పెంచేస్తే ఎలా అని అడుగుతున్నారు. తమిళనాడు, ముంబై కన్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పెంచారని ఫైర్ అవుతున్నారు.
శాశ్వతంగా అందరూ నిర్మాతలు తమ సినిమాల రేట్స్ పెంచుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు. ప్రభుత్వాలు ధరలు నియంత్రిస్తుంటే, డబ్బింగ్ సినిమాలు టికెట్ ధరల పెంపునకు అర్హత పొందవుగా అని చెబుతున్నారు. ప్రోద్బలం ఉన్న వ్యక్తుల సపోర్ట్ తో టికెట్ ధరలు పెంచుతున్నారని కామెంట్లు పెడుతున్నారు.
అయితే సాధారణంగా సినిమాల టికెట్స్ రేట్స్ సప్లై అండ్ డిమాండ్ ప్రకారం ఉంటుందనే చెప్పాలి. నిర్మాతలు తమ సినిమాల టికెట్ రేట్లను నిర్ణయించుకుంటున్నారు. దానికి ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. అయితే టికెట్ కొనాలా వద్దా అనేది ప్రేక్షకుల ఇష్టం. ఎక్కువగా అనుకుంటే కొనరు.. వర్తబుల్ అనుకుంటే కొంటారు. మేకర్స్ అంతా అలాగే అనుకుంటున్నారేమో.
ఇప్పుడు డబ్బింగ్ సినిమాల టికెట్ రేట్ల పెంపునకు వ్యతిరేకత వస్తుంది. కానీ తమిళనాడు మనల్ని మనం పోల్చుకోవడానికి ఉదాహరణ కాదని కొందరు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడులోని మల్టీప్లెక్సుల్లో ఒక్కో నిర్మాత ఒక టికెట్ కు రూ.80 పొందుతారని.. కానీ పాప్ కార్న్ ఇండియా మొత్తం లానే రూ.350 ఉంటుందని చెబుతున్నారు.
అయితే వార్-2, కూలీ రెండూ స్ట్రయిట్ మూవీస్ కావన్న విషయం తెలిసిందే. కానీ వార్-2 మాత్రం డైరెక్ట్ తెలుగు సినిమా అనే విధంగా అంతా అభిప్రాయపడుతున్నారు. అందువల్ల అదనపు రేటుకు సమస్య లేదు. కూలీకి డబ్బింగ్ వెర్షన్ అన్న పాయింట్ వల్ల ఇబ్బందిగా అనిపిస్తున్నట్లు ఉందేమో. ఏదేమైనా జీవోలు వచ్చాక చూడాలి అసలు సంగతి.
