వార్ 2: ఐమ్యాక్స్ విషయంలో ఇంత తేడా ఎందుకు?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన “వార్ 2” ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కానుంది.
By: M Prashanth | 12 Aug 2025 10:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన “వార్ 2” ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కానుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ చిత్రం, భారీ యాక్షన్ సీక్వెన్సెస్, పాన్ ఇండియా లెవెల్ ప్రమోషన్స్‌తో పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు మరికొన్ని భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నిరాశ కలిగించే ఒక కీలక సమాచారం బయటకు వచ్చింది.
సాధారణంగా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు ప్రతి భాషలో ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్లలో కూడా ప్రదర్శించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తారు. పెద్ద యాక్షన్ సీన్స్, హై బడ్జెట్ విజువల్స్ ఈ ఫార్మాట్‌లో చూస్తే మరింత విజువల్ ఫీల్ ని ఇస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులు ఐమ్యాక్స్ వర్షన్‌లో కూడా రిలీజ్ అవుతుంటాయి. కానీ “వార్ 2” విషయంలో ఆ అంచనాలు తీరడం లేదు.
యష్ రాజ్ ఫిల్మ్స్ ఇండియాలో ఒక్క తెలుగు ఐమ్యాక్స్ షో కూడా ప్లాన్ చేయలేదని సమాచారం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూర్ వంటి నగరాల్లోని IMAX స్క్రీన్లు కూడా కేవలం హిందీ IMAX వెర్షన్‌నే ప్రదర్శించనున్నాయి. అంటే తెలుగు వెర్షన్‌ను పెద్ద స్క్రీన్, హై రిజల్యూషన్ ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో చూడాలని అనుకున్న ప్రేక్షకులు నిరాశ చెందాల్సిందే. IMAXలో చూడాలంటే హిందీ వెర్షన్ టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
విశేషమేమిటంటే, తెలుగు ఐమ్యాక్స్ షోలు కేవలం USAలోనే ఉంటాయి. అమెరికాలోని కొన్ని నగరాల్లో తెలుగు వెర్షన్‌ను ఐమ్యాక్స్ స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. అంటే స్వదేశంలో ఈ సౌకర్యం లేకపోవడం తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో తెలుగు ప్రేక్షకుల సంఖ్య, టికెట్ రేట్లు ఎక్కువగా ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తోంది.
దీంతో సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చ మొదలైంది. “పాన్ ఇండియా” అనే పదాన్ని ఉపయోగించి అన్ని భాషా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా, ఇలాంటి షెడ్యూలింగ్ నిర్ణయాలు ఆ కాన్సెప్ట్‌కి విరుద్ధమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. హిందీ వెర్షన్‌కే IMAX ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా, స్థానిక భాషా ప్రేక్షకుల అనుభవాన్ని తగ్గించడం సరైన పద్ధతి కాదని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ అంశంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
