రిలీజ్ కు ముందే 2 సార్లు.. వార్-2 మేకర్స్ ఎందుకిలా?
అయితే ఇప్పుడు ఆ సినిమా ట్రిమ్మింగ్స్ కోసం సోషల్ మీడియాతో సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
By: M Prashanth | 9 Aug 2025 7:38 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ వార్-2. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమాతోనే తారక్.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆ చిత్రంలో హృతిక్ ను ఢీకొట్టే పాత్రలో కనిపించనున్నారు.
యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపుదిద్దుకుంటున్న వార్-2 మూవీని ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఆ సినిమా.. ఆగస్టు 14వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది. తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఇప్పుడు ఆ సినిమా ట్రిమ్మింగ్స్ కోసం సోషల్ మీడియాతో సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తప్పనిసరి పరిస్థితుల మధ్య సెన్సార్ల మీద సెన్సార్లు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అసలు వార్-2 మేకర్స్ ఎందుకు అలా చేస్తున్నారోనని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతుందోనని అంటున్నారు.
నిజానికి ఆ సినిమా రన్ టైమ్ ను 182 నిమిషాల 49 సెకన్లుగా మేకర్స్ లాక్ చేసినట్లు తెలిసింది. సెన్సార్ కూడా పూర్తి చేశారు. కానీ ఆ తర్వాత ఎందుకో తొలిసారి ట్రిమ్ చేశారు. దాదాపు తొమ్మిది నిమిషాల ఫుటేజ్ ను తొలగించారని సమాచారం. అనంతరం మరోసారి సెన్సార్ బోర్డు అధికారులకు సమర్పించారు.
అప్పుడు మూవీ రన్ టైమ్ 173 నిమిషాల 24 సెకన్లుగా ఫిక్స్ అయింది. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ అందించింది. దీంతో అంతా ఓకే అయిపోయిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు మరోసారి ట్రిమ్ చేసినట్లు తెలుస్తోంది. రెండు నిమిషాల సీన్స్ ను తొలగించినట్లు సమాచారం. ఇది కేవలం తెలుగు వెర్షన్ కేనని టాక్.
హిందీ వెర్షన్ 173 నిమిషాల 24 సెకన్లతోనే రిలీజ్ అవుతుంది. కానీ తెలుగు వెర్షన్ 171 నిమిషాల 44 సెకెన్ల రన్ టైమ్ తో రానుందని సమాచారం. కాగా.. సినిమాలో హీరోయిన్ గా కియారా అడ్వానీ నటిస్తుండగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ లో ఆమెకు సంబంధించిన సీన్స్ ను కట్ చేసినట్లు తెలుస్తోంది. అలా రెండు సార్లు ట్రిమ్మింగ్స్ చేసిన మేకర్స్ కే అసలు కారణం తెలియాలి.
