Begin typing your search above and press return to search.

నాగవంశీకి యష్ సంస్థ ఆఫర్.. అన్ని కోట్లు చెల్లిస్తుందా?

ఇప్పుడు వార్-2 టాలీవుడ్ ఆడియన్స్ కు అంతగా నచ్చకపోవడంతో నష్టాలు తప్పవనే చెప్పాలి.

By:  M Prashanth   |   20 Aug 2025 1:30 PM IST
నాగవంశీకి యష్ సంస్థ ఆఫర్.. అన్ని కోట్లు చెల్లిస్తుందా?
X

బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నుంచి రీసెంట్ గా వార్-2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన వార్-2.. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14వ తేదీన రిలీజైంది. అదే రోజు కూలీ మూవీ కూడా థియేటర్స్ లో సందడి చేసింది.

వార్-2లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో నటించగా.. బీ టౌన్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు. అనిల్ కపూర్, అశుతోష్ రాణా కీలక పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో వార్-2 మూవీని యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. రూ.80 కోట్లకుపైగా డీల్ తో ఆయన తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ఆయన సొంతం చేసుకున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వార్-2 టాలీవుడ్ ఆడియన్స్ కు అంతగా నచ్చకపోవడంతో నష్టాలు తప్పవనే చెప్పాలి.

ముఖ్యంగా నాగవంశీ.. రిలీజ్ కు ముందే చాలా హైప్ క్రియేట్ చేశారు. అంచనాలు పెంచే కామెంట్స్ చేశారు. తెలుగులో రూ.100 కోట్లను సినిమా ఈజీగా రాబడుతుందని అంచనా వేశారు. కానీ విడుదలైన మొదటి రోజు నుంచే మిక్స్ డ్ రెస్పాన్స్ రాగా.. నెట్టింట మీమ్స్ దర్శనమిచ్చాయి. నాగవంశీకి నష్టాలు పక్కా అని అంతా చెబుతున్నారు.

అయితే యష్ రాజ్ ఫిల్మ్స్ చాలా ప్రొఫెషనల్‌ గా నాగవంశీతో డీల్ సెట్‌ చేసుకుందని సమాచారం. ఇప్పుడు నాగవంశీకి కొంత ఉపశమనం కలిగించడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. నాగవంశీతోపాటు ఆయన భాగస్వాములకు రూ. 22 కోట్లు తిరిగి ఇవ్వడానికి యష్‌ రాజ్‌ సంస్థ అంగీకరించినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

నైజాం ఏరియాకు రూ.10 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు రూ.7 కోట్లు, సీడెడ్‌ కు రూ. 5 కోట్లు ఇచ్చేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి నాగవంశీకి ఉపశమనం లభించనుందన్నమాట. అయితే తెలుగు వెర్షన్ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ.. హిందీలో సినిమా బాగానే ఆడుతున్నట్లు తెలుస్తోంది. సాలిడ్ కలెక్షన్లు రాబడుతోందని సమాచారం.