Begin typing your search above and press return to search.

వార్ 2 దెబ్బ.. గూఢాచారుల అంతమేనా?

టైగర్ 3 ఫలితంతోనే గూఢాచారుల కథలపై సందేహాలు మొదలయ్యాయి. కానీ అందరి దృష్టి వార్ 2 మీదే ఉండింది.

By:  M Prashanth   |   19 Aug 2025 12:23 AM IST
వార్ 2 దెబ్బ.. గూఢాచారుల అంతమేనా?
X

యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన వార్ 2 చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ అనే నార్త్, సౌత్ స్టార్‌లను కలిపి తెరపై చూపించడం ఈ ఫ్రాంచైజీకి పెద్ద ప్లస్ అవుతుందని భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించిన ఫలితాలు మాత్రం వ్యతిరేకంగా మారాయి. దీంతో వైఆర్ఎఫ్ మేల్ స్పై యూనివర్స్ భవిష్యత్తుపై సందేహాలు తలెత్తాయి.

మొదటి నాలుగు సినిమాలు అయిన ఎక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ వరుసగా భారీ హిట్స్ కావడంతో స్పై యూనివర్స్ హాలీవుడ్ రేంజ్‌లోకి వెళ్తుందని అనుకున్నారు. కానీ సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 ఫలితం ఆశించిన స్థాయికి రాకపోవడంతోనే ఈ ఫ్రాంచైజీకి బ్రేక్ పడింది. దీనికి తోడు, టైగర్ వర్సెస్ పఠాన్ అనే పెద్ద ప్రాజెక్ట్ కూడా షెల్వ్ అయినట్లు సమాచారం.

టైగర్ 3 ఫలితంతోనే గూఢాచారుల కథలపై సందేహాలు మొదలయ్యాయి. కానీ అందరి దృష్టి వార్ 2 మీదే ఉండింది. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్ ఈ సిరీస్‌ని మళ్లీ రివైవ్ చేస్తుందని మేకర్స్ నమ్మారు. అయితే రిలీజ్ అయ్యాక ఓపెనింగ్స్ బలహీనంగా ఉండటమే కాకుండా వర్డ్ ఆఫ్ మౌత్ కూడా అంతగా వర్క్ అవ్వలేదు. దీంతో సినిమా టైగర్ 3 కంటే కూడా తక్కువ రేంజ్‌లో క్లోజ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

హృతిక్, ఎన్టీఆర్ లాంటి స్టార్ పవర్ ఉన్నప్పటికీ వార్ 2 ఆడియన్స్ ను పూర్తిగా ఆకర్షించలేకపోయింది. వాస్తవానికి ఈ స్థాయిలో అంచనాలు పెట్టుకున్న సినిమాకి ఇలాంటి ఫలితం రావడం ఫ్రాంచైజీకి పెద్ద షాక్ గా మారింది. దీంతో మేల్ స్పై యూనివర్స్ పై నమ్మకం తగ్గిపోగా, స్టార్‌లు కూడా ముందుకు రావాలనే ఆసక్తి చూపకపోవచ్చని అంటున్నారు సినీ వర్గాలు.

ఇదిలా ఉంటే, యశ్ రాజ్ ఫిలిమ్స్ ఇప్పుడు ఫీమేల్ స్పై యూనివర్స్ వైపు దృష్టి సారించింది. అలియా భట్, శర్వరి వాఘ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆల్ఫా అనే చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ సినిమా ఫలితం వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ భవిష్యత్తును తేలుస్తుందని ఫిలింనగర్ అంచనా.

మొత్తం మీద, టైగర్ 3, వార్ 2 ఫలితాలతో స్పై యూనివర్స్ పట్ల ఆడియన్స్ ఆసక్తి తగ్గిపోవడం నిజం. ఇప్పుడు ఆల్ఫా కూడా పని చేయకపోతే, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ పూర్తిగా ముగిసినట్లే అని చెప్పొచ్చు.