తారక్ తో పరిటాల మూవీ.. కొడాలి నాని నో చెప్పేశారా?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
By: M Prashanth | 26 March 2026 1:39 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య ఉన్న అనుబంధంతోపాటు ఒక కీలక ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందన్న అంశాలపై ఆయన మాట్లాడారు.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్ లో ఆయనను పెద్ద స్టార్ గా నిలబెట్టాలని గట్టిగా కోరుకున్న వ్యక్తుల్లో కొడాలి నాని ఒకరని వినాయక్ తెలిపారు. ఎన్టీఆర్ దగ్గరకు ఏ సినిమా కథ వచ్చినా ముందు నాని, వంశీ వినేవారని, కథ ఎంపికలో వారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించేవారని చెప్పారు. ఎన్టీఆర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కథలు ఎంపిక చేయడంలో నాని కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ నాయకుడిగా పేరొందిన పరిటాల రవి, ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో ఆయనతో ఒక సినిమా నిర్మించాలని ఆసక్తి చూపారని చెప్పారు. ఆది, సాంబ వంటి చిత్రాలతో ఎన్టీఆర్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న స్టేజ్ లో పరిటాల రవి స్వయంగా సినిమా చేయమని అడగడం పెద్ద విషయం అని వినాయక్ వివరించారు. అయితే ఆ ప్రాజెక్టు అనుకున్నట్టుగా ముందుకు సాగలేదు.
దీనికి కారణం కొడాలి నాని తీసుకున్న నిర్ణయమేనని వినాయక్ తెలిపారు. "పరిటాల రవి గారి మాటకు అప్పట్లో ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. అలాంటి వ్యక్తి సినిమా చేయమంటే సాధారణంగా ఒప్పుకోవాల్సిందే. కానీ నాని మాత్రం స్పష్టంగా వద్దని చెప్పేశారు. అందుకు కారణం తనకు తెలియదు. బహుశా కథ నచ్చకపోవడం లేదా దర్శకుడిపై నమ్మకం లేకపోవడం వల్లే ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు" అని అభిప్రాయపడ్డారు.
"ఎన్టీఆర్ కెరీర్ ముఖ్యం. నచ్చితే చేస్తారు, లేకపోతే లేదు" అన్న ధోరణితో నాని వ్యవహరించారని ఆయన వెల్లడించారు. ఆ విషయంలో నాని ఎంతో గట్టిగా నిలబడినట్టు వినాయక్ తెలిపారు. నో అంటే నో అన్నట్టుగా ఎన్టీఆర్ కూడా అదే నిర్ణయాన్ని గౌరవించారని చెప్పారు. ఏదేమైనా కొడాని నాని అప్పట్లో ఎన్టీఆర్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవారని వినాయక్ గుర్తు చేశారు.
కానీ ప్రస్తుతం ఇద్దరూ వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉండటంతో అంతగా కలుసుకునే అవకాశాలు లేకపోయినా, గతంలో ఉన్న అనుబంధం మాత్రం ప్రత్యేకమని తెలిపారు. ఇక తనకు ఎన్టీఆర్ తో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని వినాయక్ చెప్పారు. ఆది, అదుర్స్, సాంబ వంటి విజయవంతమైన చిత్రాలను ఆయనతో కలిసి చేశానని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో ఆ చిత్రాలు కీలక మైలురాళ్లుగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
