చిరును తిట్టిన వాళ్లెవరూ ఇండస్ట్రీలోనే లేరు: వినాయక్
హైదరాబాద్ లో ఇటీవల జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
By: M Prashanth | 29 March 2026 2:00 PM ISTహైదరాబాద్ లో ఇటీవల జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డులు మళ్లీ ప్రారంభించాలని, సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని ఆయన చేసిన సూచనలను కొందరు సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మార్చారు. ఇంకొందరు అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు.
కానీ ఆ విషయంపై ఇప్పటివరకు చిరంజీవి ఎక్కడా ఎప్పుడూ రెస్పాండ్ అవ్వకపోయినా.. తాజాగా ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ గట్టిగా స్పందించారు. ఇలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు ఒక అభిమానికి మీకు ఏమని అనిపిస్తుంది? అని ఓ ఇంటర్వ్యూలో వినాయక్ ను అడగ్గా.. ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినాయక్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
"చిరంజీవి గురించి అలా మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది. కానీ మేం ఇప్పుడు ఏదైనా మాట్లాడితే కాంట్రవర్సీగా ఉంటుంది. మేమెప్పుడూ అలా మాట్లాడినా ఆయన మాకు తిడతారు. మెగాస్టార్ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు. ఒకప్పుడు అంగరంగ వైభవంగా నంది అవార్డులు ఎలా జరిగేవి.. అసలు పండుగంతా అప్పుడే ఉన్నట్లు అనిపించేది" అని వినాయక్ తెలిపారు.
"నంది అవార్డుల టైమ్ లో మొత్తం అంతా టీవీల ముందు ఉండేవారు. అదొక పెద్ద సెలబ్రేషన్ టీవీల ముందు జరిగింది. చిరంజీవి గారికి అసలు అవార్డులు అవసరం లేదు. కానీ ఆయన అందరికోసం కోరుకున్నారు. అది కూడా తప్పంటే ఎలా? ఆయనను ఎవరైతే కామెంట్ చేస్తారో వారంతా పాడై పోతారు. దానికి వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరికి వాళ్లు ఆలోచించుకోవాలి" అని తెలిపారు.
"దయచేసి ఒక మంచి మనిషిని మాట అంటే.. కచ్చితంగా పాడవుతారు. ఇప్పటికే ఆయనను అకారణంగా కామెంట్ చేసిన వారెవరు ఇప్పుడు లేరు. ఏదో రకంగా పాడయ్యారు.. ఏదేమైనా ఆయన స్టేటస్ ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ ఆయన ఫ్యాన్స్. మెగాస్టార్ శక్తి నా లాంటి దగ్గరగా ఉన్న వారికి మాత్రం తెలుస్తుంది" అని వీవీ వినాయక్ తెలిపారు.
"ముఖ్యంగా నంది అవార్డులు గురించి చిరంజీవి చెప్పింది అందరి అభిప్రాయమని గుర్తుంచుకోవాలి. నిజంగానే అవార్డులు ఇస్తే గవర్నమెంట్ కే పేరు వస్తుంది.. అంతే కదా. అందుకే ఆయన ఎవరి పేరు తీసి ఏమీ తప్పుగా అనలేదు. అసలు రాజకీయాలకు ఆయనకు సంబంధం లేదు. ప్రభుత్వానికి ఆయనకు సంబంధం లేకపోయినా, అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. ఆ సమయంలో స్టేజ్ మీద ప్రధాని నరేంద్ర మోడీ గారు లేచి మరీ చిరంజీవిని కలిశారు. తెలుగు వాడిగా ఆయనకు గౌరవం ఇచ్చారు కదా.. బయటంతా ఇలా చిరంజీవిని కీర్తిస్తుంటే, మనం మాత్రం కామెంట్ చేస్తే.. ఏంటండీ ఈ దరిద్రం'' అంటూ ఫైర్ అయ్యారు!
