Begin typing your search above and press return to search.

మార్వాడీ మ‌న‌స్త‌త్వంతో ఏడాదిలో 8500 కోట్లు సేక‌రించిన న‌టుడు!

హార్డ్ వ‌ర్క్ కాదు స్మార్ట్ వ‌ర్క్ చేయాల‌ని చెబుతారు తెలివైన వాళ్లు! ఈ జాబితాకే చెందుతాడు వివేక్ ఒబెరాయ్.

By:  Tupaki Desk   |   7 July 2025 9:00 AM IST
మార్వాడీ మ‌న‌స్త‌త్వంతో ఏడాదిలో 8500 కోట్లు సేక‌రించిన న‌టుడు!
X

హార్డ్ వ‌ర్క్ కాదు స్మార్ట్ వ‌ర్క్ చేయాల‌ని చెబుతారు తెలివైన వాళ్లు! ఈ జాబితాకే చెందుతాడు వివేక్ ఒబెరాయ్. ర‌క్త చ‌రిత్ర చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన ఒబెరాయ్, ఐశ్వ‌ర్యారాయ్ తో డేటింగ్ లో ఉన్న స‌మ‌యంలో బాలీవుడ్ నుంచి అతి పెద్ద థ్రెట్ ని ఎదుర్కొన్నాడు. కొంద‌రు గూడుపుటానీ చేసి, అత‌డికి అవ‌కాశాల్లేకుండా చేయ‌డంతో డిప్రెష‌న్ లోకి కూడా వెళ్లాడు. న‌టుడిగా స‌క్సెస్ ఉండి, ప్ర‌తిభకు కొద‌వ లేక‌పోయినా కుట్ర‌ల్ని ఎదుర్కొన్నాన‌ని చెప్పాడు.

అదంతా స‌రే కానీ, కుట్ర‌ల ప్ర‌పంచంతో సంబంధం లేకుండానే, స్మార్ట్ వ‌ర్క్ తో వంద‌ల కోట్లు ఎలా సంపాదించాలో ఈ న‌టుడిని అడిగి తెలుసుకోవాలి. అత‌డు ఎప్పుడూ సంపాద‌న విష‌యంలో ప్లాన్ -బితో రెడీగా ఉంటాన‌ని చాలాసార్లు ఇంట‌ర్వ్యూల్లో చెప్పాడు. న‌ట‌న అనేది కేవ‌లం అత‌డి అభిరుచి మేర‌కు ఒక వ్యాప‌కం మాత్ర‌మే. అత‌డి సంపాద‌న అంతా స్టాక్ మార్కెట్లు, రియ‌ల్ వెంచ‌ర్లు, ఇంకా చాలా వ్యాపార మార్గాల ద్వారా వ‌స్తుంది.

వివేక్ ఒబెరాయ్ తన కంపెనీల కోసం కేవలం ఒక సంవత్సరంలోనే రూ. 8,500 కోట్లు సేకరించానని తాజా ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మార్వాడీ మనస్తత్వంతో ఉంటే చాలు ఎద‌గ‌డం ఎలానో తెలుస్తుంద‌ని అన్నాడు. సినిమాల భ్ర‌మ నుంచి బ‌య‌ట‌ప‌డి తన వ్యాపార సంస్థలపై దృష్టి పెట్టానని అన్నారు. గ‌త ఏడాది తాను భాగ‌స్వామిగా ఉన్న‌ 12 కంపెనీల కోసం సుమారు 8500 కోట్లు (ఒక బిలియ‌న్ డాల‌ర్లు) సేక‌రించాన‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం ఒబెరాయ్ నిక‌ర ఆస్తి విలువ సుమారు 1200 కోట్లు. ఇంచుమించు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ నిక‌ర సంప‌ద‌లతో స‌మాన‌మైన విలువ ఇది.

త‌న‌కు వ్యాపార సూత్రాల్ని నేర్పించింది త‌న తండ్రి సురేష్ ఒబెరాయ్. చిన్న వ‌య‌సులోనే వ్యాపారంలో మెళ‌కువ‌లు నేర్చుకున్నాడు. త‌న తండ్రి భూమిపై పెట్టుబ‌డి పెట్టేవాడు. భూములు అమ్మ‌డం కొనుగోలు చేయ‌డం చేసేవాడు. ప‌దేళ్ల వ‌య‌సులోనే పెర్ఫ్యూమ్ లు అమ్మ‌డం, ఎల‌క్ట్రానిక్స్ వ‌స్తువులు అమ్మ‌డం త‌న‌కు నేర్పించాడు. వ‌స్తువులు ఇంటింటికీ తిరిగి అమ్మ‌గా వ‌చ్చిన లాభం మాత్ర‌మే త‌న జేబులో ఉండేది. పెట్టుబ‌డిని త‌న తండ్రి తిరిగి తీసుకునేవాడు. అలాగే వివేక్ ఒబెరాయ్ ప్ర‌స్తుతం విద్యా సంస్థ‌ల‌కు వ‌డ్డీల‌కు అప్పులిచ్చే వ్యాపారంలోను ఉన్నాడు. దాదాపు 3400 కోట్ల మేర ఈ వ్యాపారం న‌డుస్తోంది. సినిమా ప‌రిశ్ర‌మ‌లో బొంగ‌రంలా ఎంత తిరిగినా తిరిగి అక్క‌డికే వ‌చ్చాన‌ని గ్ర‌హించాక స్టార్ట‌ప్ వ్యాపారాల‌తో ఆర్థిక వృద్ధి సాధించాన‌ని ఒబెరాయ్ చెప్పాడు. మ‌నం ఎప్పుడూ మార్వాడీ మనస్తత్వంతో సిలికాన్ వ్యాలీని వివాహం చేసుకోవాల‌ని క‌ల‌లు క‌నాల‌ని కూడా సూచించాడు. అలాగే సినీప‌రిశ్ర‌మ‌ను కొంద‌రు నియంత్రిస్తార‌ని కూడా వివేక్ ఒబెరాయ్ చెప్పాడు.