టికెట్ రేట్లపై అధ్యయన కమిటీలో వివేక్
24 శాఖల్ని సమన్వయం చేస్తూ సహాయ నిర్మాతగా ముందుకు సాగడం అంటే ఆషామాషీ కాదు. అలాంటి గురుతర బాధ్యతలను నిర్వర్తించిన అనుభవజ్ఞులు వివేక్ కూచిభొట్ల.
By: Tupaki Desk | 15 May 2025 9:03 AM IST24 శాఖల్ని సమన్వయం చేస్తూ సహాయ నిర్మాతగా ముందుకు సాగడం అంటే ఆషామాషీ కాదు. అలాంటి గురుతర బాధ్యతలను నిర్వర్తించిన అనుభవజ్ఞులు వివేక్ కూచిభొట్ల. పీపుల్స్ మీడియా సంస్థతో చాలా కాలంగా ఆయన అనుబంధం కొనసాగించారు. సహనిర్మాతగా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా తన అనుభావాన్ని ఆయన సంస్థ కోసం ఉపయోగించారు. ఇక పంపిణీ రంగం, ఎగ్జిబిషన్ రంగం సహా ఇతర రంగాలపైనా ఆయనకు బోలెడంత అవగాహన ఉంది.
ఇప్పుడు సినిమా టికెట్ రేట్లను అధ్యయనం చేసే కమిటీలో వివేక్ కి కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ సీఎంవో తీసుకున్న నిర్ణయం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ నియామకాన్ని గౌరవంగా భావిస్తున్నానని కూచిభొట్ల ఈ సందర్భంగా అన్నారు. జనం థియేర్లకు రావాలంటే ఏం చేయాలి? ఆక్యుపెన్సీ స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? నిర్మాత ఆసక్తులకనుగుణంగా టికెట్ రేట్లను ఎలా సెట్ చేయాలి? వంటి అంశాలను వివేక్ కూచిభొట్ల ఆయన టీమ్ అధ్యయనం చేయనున్నారు. బ్యాలెన్స్‌డ్ గా ప్రతిదీ ఆలోచించి అధ్యయన ఫలితాన్ని వెల్లడిస్తానని ఆయన అన్నారు.
తనకు ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ లకు కృతజ్ఞతలు తెలియజేసారు.
