బాలీవుడ్ కు దూరంగా ఉండాలనిపిస్తోంది
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో మంచి గుర్తింపు, క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ లోని ప్రస్తుత పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు
By: Tupaki Desk | 14 May 2025 10:18 AMది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో మంచి గుర్తింపు, క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ లోని ప్రస్తుత పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని దర్శకనిర్మాతలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ దర్శకనిర్మాతలకు యాక్టర్లపై కోపమున్నా ధైర్యం చేసి దాన్ని బయటకు చెప్పలేరన్నారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ చేసిన యానిమల్ సినిమా రిలీజైనప్పుడు ఆ సినిమాపై వచ్చిన విమర్శలపై కూడా ఆయన ఈ సందర్భంగా కామెంట్ చేశారు. యానిమల్ రిలీజ్ టైమ్ లో అందరూ డైరెక్టర్ సందీప్ నే టార్గెట్ చేయడాన్ని వివేక్ అగ్నిహోత్రి తప్పు బడుతూ, రణ్‌బీర్ పై కామెంట్ చేసే ధైర్యం ఇండస్ట్రీలో లేకనే సందీప్ ను టార్గెట్ చేశారన్నారు.
రణ్‌బీర్ ను విమర్శించే ధైర్యం ఎవరికీ లేదని, బాలీవుడ్ లో అతనెంతో పవర్‌ఫుల్ అని, అతనికి ఎదురు చెప్పే ధైర్యసాహసాలు ఎవరూ చేయలేరని, తాను ఛాలెంజ్ చేస్తున్న యాక్టర్ల గురించి తప్పుగా మాట్లాడని ఒక్క దర్శకనిర్మాతనైననా చూపించమని అడిగిన వివేక్ అగ్నిహోత్రి అలా ఎవరూ లేరని, ప్రతీ ఒక్కరూ ఏదొక టైమ్ లో ఎవరొకరిని తిట్టినవాళ్లేనని, కాకపోతే పబ్లిక్ లో మాట్లాడే ధైర్యం చేయరని ఆయన అన్నారు.
అందుకే బాలీవుడ్ లోని దర్శకనిర్మాతలకు ఇబ్బంది పడటం తప్పదని, ఎంత దారుణంగా నటించినా వారికి రూ.150 కోట్లు ఇవ్వడంతో పాటూ తమ లక్ ను కూడా ఆర్టిస్టులకే కట్టబెడతారని, అందుకే తనకు బాలీవుడ్ కు దూరంగా ఉండాలనిపిస్తుందని సంచలన కామెంట్స్ చేశారు. వాస్తవానికి తనకు రియల్ స్టార్స్ తో ఎలాంటి సమస్యా లేదనీ, ఏమీ సాధించకుండా స్టార్ అని చెప్పుకుని తిరిగే వాళ్లతోనే తనకు సమస్య అని అన్నారు.