తమిళ మార్కెట్లో తెలుగు యువనిర్మాత బిగ్ ప్లాన్స్
టాలీవుడ్ నిర్మాతలు ఇరుగు పొరుగు భాషల్లోకి దూసుకెళుతున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 4 Aug 2026 12:08 AM ISTటాలీవుడ్ నిర్మాతలు ఇరుగు పొరుగు భాషల్లోకి దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు బాలీవుడ్ లోను సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు యువ నిర్మాత నాగవంశీ తెలుగు సినిమాలతో పాటు తమిళ పరిశ్రమలోను బిజీగా మారారు. తాజాగా ద్విభాషా చిత్రం `విశ్వనాథన్ అండ్ సన్స్` ఆడియో లాంచ్ వేడుకలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు దక్షిణాది సినీ వర్గాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కోయంబత్తూరులో జరిగిన ఈ వేడుకలో అతడు మాట్లాడుతూ.. తమ ప్రయాణం పళని పూజతో ఇక్కడే ప్రారంభమైందని .. కోయంబత్తూరు నగరం తమ బ్యానర్‌కు ఒక లక్కీ ఛార్మ్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళంలో తమకు ఇది రెండవ చిత్రమైనా స్థానిక ప్రేక్షకుల ఆదరణపై పూర్తి ధీమాను కనబరిచారు.
తమిళ అగ్ర కథానాయకుడు సూర్య తమపై ఉంచిన నమ్మకాన్ని నాగవంశీ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. తెలుగు పరిశ్రమ నుంచి వచ్చిన యువ నిర్మాతలను నమ్మి... కథ విన్న మొదటి క్షణం నుంచే ఏమాత్రం సందేహపడకుండా ప్రాజెక్ట్ ఓకే చేసినందుకు సూర్యకి ధన్యవాదాలు తెలిపారు. `గజినీ` చిత్రంలో సూర్య చేసిన ఐకానిక్ క్యారెక్టర్ `సంజయ్ రామస్వామి` స్థాయి పాత్రను.. ఆయనలోని పూర్తి ఎనర్జీని ఈ చిత్రం ద్వారా అభిమానులకు మళ్లీ తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు.
సినిమా కంటెంట్, ముఖ్యమైన పాత్రల గురించి మాట్లాడూతూ నాగవంశీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న మమితా బైజు నటన `జెన్-జీ` యువతను విశేషంగా ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే సీనియర్ నటి రాధిక సూర్య తల్లిగా అద్భుతంగా నటించారని.. ఫస్ట్ హాఫ్‌లో సూర్య, రాధిక, మమితల మధ్య వచ్చే ఒక ప్రత్యేకమైన కామెడీ సీన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిన్న లీక్ ఇచ్చారు.
తమ సినిమా అవుట్‌పుట్‌పై స్పందిస్తూ.. నాగవంశీ సినిమా విజయంపై పూర్తి ధీమాగా ఉన్నారు. తెలుగులో తమ బ్యానర్‌లో వచ్చిన ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ తరహాలోనే ఈ చిత్రం కూడా తమిళ బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడికి జీవీకి సరదాగా మాస్ వార్నింగ్ ఇస్తూ.. సూర్య అభిమానులకు నచ్చేలా అత్యుత్తమ రీ-రికార్డింగ్ అందించాలని... హ్యాట్రిక్ హిట్‌ను అందించాల్సిన బాధ్యత మ్యూజిక్ డైరెక్టర్‌పై ఉందన్నారు.
చివరగా సోషల్ మీడియాలో తనను `చింటూ` అని ఎందుకు పిలుస్తారో ఈవెంట్‌లో అడిగిన ప్రశ్నకు నాగవంశీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తాను సోషల్ మీడియా వేదికగా కాస్త ఓపెన్‌గా - బోల్డ్‌గా స్పందిస్తుంటానని.. అందుకే అక్కడ అభిమానులు సరదాగా తనకు ఆ పేరు పెట్టారని క్లారిటీ ఇచ్చారు. వైవిధ్యమైన ప్రమోషన్లతో పాటు నిర్మాత నాగవంశీ చూపిన ఈ కాన్ఫిడెన్స్ చూస్తుంటే `విశ్వనాథన్ అండ్ సన్స్` సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
